యోగా వేడుకలకు సర్వం సిద్ధం

21 Jun, 2015 04:13 IST|Sakshi

ఢిల్లీలో రాజ్‌పథ్ వద్ద వేలాది చాపలను సిద్ధంచేస్తున్న సిబ్బంది. సియాచిన్ గ్లేసియర్ వద్ద యోగాను అభ్యసిస్తున్న సైనికులు
నేడు భారత్ సహా 192 దేశాల్లో యోగా దినోత్సవం
* రాజ్‌పథ్‌లో ‘రికార్డు’ ఉత్సవాలు.. పాల్గొననున్న మోదీ, కేజ్రీవాల్
* 37 వేల చాపలు, 2,000 సినిమా స్క్రీన్లతో యోగాసనాలకు ఏర్పాట్లు

సాక్షి, న్యూఢిల్లీ:  ప్రపంచవ్యాప్తంగా ఆదివారం జరగనున్న తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవాల కోసం భారత్ సిద్ధమైంది. రాజధాని ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో ప్రధాని నరేంద్రమోదీ సహా 37 వేల మంది ఆదివారం ఉదయం యోగా చేయనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 192 దేశాల్లోని 251కి పైగా నగరాల్లో యోగా డే నిర్వహించనున్నారు.

ఐరాస ప్రధాన కార్యాలయం సహా పలు దేశాల్లో యోగా ఉత్సవాలకు కేంద్ర మంత్రులు సారథ్యం వహించనున్నారు. ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియాగేట్ వరకు రెండున్నర కిలోమీటర్ల మేర గల రాజ్‌పథ్‌లో.. ఉదయం 7 గంటల నుంచి 7:35 గంటల వరకూ యోగా నిర్వహించనున్నారు. రఫీమార్గ్ క్రాసింగ్‌లోని రాజ్‌పథ్ మధ్యలో భారీ వేదిక ఏర్పాటు చేశారు. వేదిక నుంచి ఇండియా గేట్ వరకు కిలోమీటరు పొడవున యోగాసనాల కోసం 37 వేల చాపలు పరిచారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదు చేయటం లక్ష్యంగా రాజ్‌పథ్‌లో చేపడుతున్న యోగా ఉత్సవాలకు 152 విదేశీ ఎంబసీలను ఆహ్వానించారు.

ఆయుష్ మంత్రిత్వశాఖ సమన్వయం చేస్తున్న ఈ యోగా ఉత్సవాలను ప్రజలు తిలకించేందుకు వీలుగా 2,000 భారీ సినిమా స్క్రీన్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. అంతర్జాతీయ యోగా డేను పురస్కరించుకుని పోస్టల్ శాఖ ముద్రించిన పోస్టల్ స్టాంపులను, ఆర్థికశాఖ ముద్రించిన రూ.10, రూ. 100 బిళ్లలను ఆదివారం రాజ్‌పథ్‌లో జరిగే కార్యక్రమంలో విడుదల చేయనున్నారు. ప్రధాని పాల్గొంటున్న ఈ కార్యక్రమానికి భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోదీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, యోగా గురు బాబారాందేవ్ సహా యోగా నిపుణులు ఆసనాలు వేయనున్నారు.

సినీ నటులు అమితాబ్ బచ్చన్, అమీర్‌ఖాన్ వంటి  ప్రముఖులకు ప్రభుత్వం నుంచి ఆహ్వానాలు వెళ్లాయి. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, త్రివిధ దళాల సిబ్బంది, అధికారులు, ఉద్యోగులు, క్రీడాకారులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు.. అన్ని వర్గాలకు చెందిన వారు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ యోగా ఉత్సవాలను దూరదర్శన్, పీఐబీ వెబ్‌సైట్ ద్వారా ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు చేశారు.
 
అన్ని రాష్ట్రాల్లోనూ ఏక కాలంలో..: లక్నో, కోల్‌కతా, పట్నా తదితర నగరాల్లోనూ భారీ స్థాయిలో యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఏక కాలంలో నిర్వహించాలని, జిల్లా, పంచాయతీ రాజధానుల్లోనూ కార్యక్రమాలు నిర్వహించాలని అన్ని రాష్ట్రాలకూ సూచించారు.  ప్రభుత్వమే కాకుండా పలు సంస్థలు కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. రామ్‌దేవ్ 1,100 కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అయితే.. యోగా దినోత్సవంలో యోగాసనాలు వేయడానికి చైనా నుంచి దిగుమతి చేసుకున్న యోగా చాపలను వినియోగించడాన్ని కాంగ్రెస్, ఆప్ పార్టీలు విమర్శించాయి. ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదాలిచ్చే ప్రధాని మోదీ ప్రభుత్వం.. తొలి ప్రపంచ యోగా దినోత్సవ వేడుకల్లో ‘మేక్ ఇన్ చైనా’కు ప్రాధాన్యమిచ్చిందని ఎద్దేవా చేశాయి. దేశంలో యోగా ఉత్సవాల కోసం సుమారు రూ. 40 కోట్ల వరకు వ్యయం అయినట్టు తెలుస్తోంది.  
 
విదేశాల్లో మంత్రుల నేతృత్వం..
ప్రధాని మోదీగత ఏడాది ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో చేసిన ప్రతిపాదనకు 177 దేశాలు ఆమోదం తెలపటంతో.. జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఐరాస గత ఏడాది డిసెంబర్‌లో ప్రకటించడం తెలిసిందే. న్యూయార్క్‌లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో యోగా దినోత్సవాలకు సారథ్యం వహించేందుకు విదే శాంగ మంత్రి సుష్మాస్వరాజ్ అమెరికా చేరుకున్నారు.  ఈ కార్యక్రమం తర్వాత న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్‌లో 30,000 మంది యోగా చేస్తారు.
 
ప్రతి ఒక్కరూ భాగం కావాలి
ఆదివారం జరగనున్న తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఇతరులు కూడా పాల్గొనేలా ప్రోత్సహించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం ఒక ప్రకటనలో దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
 
యోగాపై సర్కారుది నిస్సిగ్గు దురాక్రమణ: కాంగ్రెస్
ప్రాచీన భారత సంస్కృతిలో భాగమైన యోగా ను దురాక్రమించుకుని.. దానిని  ప్రచార కార్యక్రమంగా, ప్రజాసంబంధాల కార్యక్రమంగా వాడుకునేందుకు మోదీ ప్రభుత్వం నిస్సిగ్గుగా ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ విమర్శించింది.  యోగాతో ఆరోగ్య ప్రయోజనాలు అంటూ ప్రచారం చేస్తున్న కేంద్రం.. ఆరోగ్య రంగానికి బడ్జెట్ కేటాయింపులను తగ్గించటమే కాక.. 2013-14లో రూ. 1,069 కోట్లుగా ఉన్న యోగా బడ్జెట్ కేటాయింపులను ఈ ఏడాది కేవలం రూ. 318 కోట్లకు తగ్గించటం ఏమిటని  ఓ ప్రకటనలో ప్రశ్నించింది. మాజీ ప్రధాని జవహర్‌లాల్‌నెహ్రూ యోగా చేస్తున్న ఫొటోతో పాటు.. ఎవరైనా దేనినైనా తాము ఆచరించాకే ఇతరుల నుంచి ఆ ఆచరణను ఆశించాలని చెప్పే గాంధీ సూక్తితో కూడిన గాంధీ ఫొటోను విడుదల చేసింది.

మరిన్ని వార్తలు