కేంద్రంతో కేజ్రీవాల్ ప్రత్యక్ష పోరు

12 Jun, 2015 04:03 IST|Sakshi
కేంద్రంతో కేజ్రీవాల్ ప్రత్యక్ష పోరు

హోం సెక్రటరీ సరెండర్ చెల్లదన్న హోంశాఖ
* వెనక్కి పంపే అధికారం మాకుంది: కేజ్రీవాల్

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీపై ఆధిపత్య పోరులో మరోసారి కేంద్రం ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంది. ఢిల్లీ హోం కార్యదర్శి ధరమ్‌పాల్‌ను తొలగిస్తూ ఆప్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని గురువారం రద్దు చేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ, హోం శాఖ, భూభవనాల శాఖల ముఖ్యకార్యదర్శిగా ఉన్న ధరమ్‌పాలే కొనసాగుతారని కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

అంతే కాకుండా భూభవనాల ముఖ్యకార్యదర్శిగా ఆప్ సర్కారు నియమించిన అశ్విన్‌కుమార్ నియామకాన్ని కూడా రద్దు చేసింది. కేంద్ర హోం శాఖ ఆదేశాల మేరకు ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేకే శర్మ ధరమ్‌పాల్‌కు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వానికి కేంద్ర హోం శాఖ పంపిన ఉత్తర్వుల్లో అఖిలభారత సర్వీసులు(జాయింట్ క్యాడర్) రూల్స్-1972 ప్రకారం కేంద్ర పాలిత ప్రాంతాలకు.. జేసీఏ పరిధిలోని రాష్ట్రాలకు పాలనాపరమైన అవసరాలను బట్టి ఐఏఎస్ అధికారులను  కేంద్ర హోం శాఖే కేటాయిస్తుందని స్పష్టం చేసింది.

ఏ రూల్ ప్రకారం కూడా ఢిల్లీ ప్రభుత్వానికి అధికారుల బదిలీ విషయంలో ఎలాంటి అధికారాలు లేవని తేల్చిచెప్పింది. దీంతో ధరమ్‌పాల్‌ను కేంద్రానికి వెనక్కి పంపడం, ఆయన స్థానంలో మరొకరికి బాధ్యతలు అప్పగిస్తూ ఢిల్లీ ప్రభుత్వం జారీ చేసిన 296, 297 ఉత్తర్వులు చెల్లవని స్పష్టం చేసింది.
 
జోక్యం చేసుకోవద్దు
తమ ప్రభుత్వ వ్యవహారాల్లో అనవసరంగా జోక్యం చేసుకోవద్దని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర హోం శాఖకు ఘాటుగా లేఖ రాశారు. ఐఏఎస్ అధికారులను కేంద్రానికి సరెండర్ చేసే అధికారం తమ ప్రభుత్వానికి ఉందనీ, అదే సమయంలో ఉన్నతాధికారులకు అదనపు బాధ్యతలు ఇవ్వటం కూడా తమ ప్రభుత్వ పరిధిలోని అంశమేనని ఆయన స్పష్టం చేశారు. హోం శాఖకు పూర్తిస్థాయి అధికారిని నియమించినప్పుడు తప్పకుండా ఎల్జీని సంప్రదిస్తామని ఆయన అందులో పేర్కొన్నారు.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు