పోలీసుల వేధింపులు.. ఫేస్‌బుక్‌లో లైవ్!

22 Feb, 2017 16:47 IST|Sakshi
పోలీసుల వేధింపులు.. ఫేస్‌బుక్‌లో లైవ్!
ఇద్దరు పోలీసులు కలిసి తమను వేధిస్తుంటే.. ఆ మొత్తం వ్యవహారాన్ని ఫేస్‌బుక్ లైవ్ ద్వారా ప్రపంచానికి చూపించి కేరళకు చెందిన ఓ ప్రేమజంట ధైర్యంగా నిలబడింది. ఇంకా పెళ్లి కాని ఆ యువతీ యువకులు.. తిరువనంతపురంలోని మ్యూజియం పార్కులో కూర్చుని ఉండగా.. వాళ్లు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ పోలీసులు వాళ్లను ప్రశ్నించడం మొదలుపెట్టారు. దాంతో బాగా ఇబ్బంది పడిన వాళ్లు.. పోలీసుల వేధింపులు మొత్తాన్ని ఫేస్‌బుక్‌ ద్వారా లైవ్‌లో చూపించారు. తాము అసభ్యంగా ప్రవర్తిస్తున్నామంటూ పో్లీసులు ఆరోపించారని, కానీ తాము కేవలం కూర్చుని మాట్లాడుకుంటున్నామని ఆ యువకుడు చెప్పాడు. 
 
తాను కేవలం అమ్మాయి భుజం మీద చేయి వేసుకుని కూర్చున్నానని, అందులో అసభ్యత ఏముందని అతడు ప్రశ్నించాడు. పోలీసులు తమతో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడంతో.. బాగా ఆందోళనకు గురైన యువతి తాము కోర్టును ఆశ్రయిస్తామని తెలిపింది. ఇలాంటి పరిస్థితి చాలామందికి వస్తోందని, వాళ్లు కూడా బయటకు వచ్చి మాట్లాడాలని ఆమె చెప్పింది. వచ్చిన ఇద్దరు పోలీసులలో ఒక మహిళా పోలీసు కూడా ఉన్నారని, తాము అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు వాళ్లు చెప్పినప్పటి నుంచి తాము ఫేస్‌బుక్ లైవ్ ఆన్ చేశామని యువకుడు తెలిపాడు. వాళ్లిద్దరూ పార్కులో అసభ్యంగా ప్రవర్తించడం వల్ల వాళ్లను అదుపులోకి తీసుకుని వారిపై ఐపీసీ సెక్షన్ 290 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.  
మరిన్ని వార్తలు