2017 జూన్ 2లోపు ఏపీకి వచ్చిన వారికే...స్థానిక హోదా

2 Oct, 2015 02:43 IST|Sakshi
2017 జూన్ 2లోపు ఏపీకి వచ్చిన వారికే...స్థానిక హోదా

- రాష్ట్ర మంత్రివర్గంలో కీలక నిర్ణయం
సాక్షి, విజయవాడ బ్యూరో:
రాష్ట్రంలో స్థానికత నిబంధన సడలింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2017 జూన్ రెండో తేదీలోపు ఏపీకి వచ్చిన వారికే స్థానికత వర్తిస్తుందని ప్రకటించింది. తెలంగాణలో చదువుతున్న విద్యార్థులు, ఉద్యోగులు, ఇతరులెవరైనా ఈలోపు ఇక్కడకు వచ్చి నివాస ధ్రువపత్రాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వచ్చిన వారికి ఇక్కడి స్థానికత వర్తించదు. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకూ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత స్థానికత నిబంధనల ప్రకారం నాలుగేళ్లపాటు ఎక్కడ ఉంటే ఆ ప్రాంతానికే స్థానికులు అవుతారు.

రాష్ట్ర విభజన జరిగిన ప్రత్యేక నేపథ్యంలో ఉద్యోగులు స్థానికత విషయంలో అసంతృప్తితో ఉన్న పరిస్థితుల్లో  రాష్ట్రంలో ఆ నిబంధనకు ప్రభుత్వం సడలింపు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం 2017 జూన్ 2లోపు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన వారికి వెంటనే స్థానికత వర్తిస్తుంది. అయితే, ప్రస్తుత నిబంధనను మార్చాలంటే ఏపీ స్టేట్ రీ-ఆర్గనైజేషన్ ప్రకారం.. కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై కేంద్రం అనుమతితోపాటు రాష్ట్రపతి ఆమోదం పొందాలి. కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు నారాయణ, పల్లె రఘునాథ్‌రెడ్డి, అచ్చెన్నాయుడు, దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు, సిద్ధా రాఘవరావు మీడియాకు వెల్లడించారు. ఏపీ కొత్త రాజధాని అమరావతికి ఈనెల 22న శంకుస్థాపన చేయాలని గతంలోనే నిర్ణయించిన ప్రభుత్వం ముహూర్తాన్ని కూడా ఖరారు చేసింది.

ఈ నెల 22న మధ్యాహ్నం 12.35-12.45 మధ్య ఉద్దంరాయునిపాలెం, తాళ్లాయపాలెం, మందడం మధ్య సీడ్ రాజధాని నిర్మించే ప్రాంతంలో శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుంది. కృష్ణా నది నుంచి కరకట్టవైపు 50 ఎకరాలను ఇందుకు సిద్ధం చేస్తున్నారు.
3వేల ఎకరాల్లో తొలి దశ రాజధాని నిర్మాణం ఉంటుంది. భూమిని సీఆర్‌డీఏ పేరిట ఉంచి సింగపూర్ సంస్థల భాగస్వామ్యంతో స్విస్ చాలెంజ్ పద్ధతిలో నిర్మిస్తారు. సచిత్తూరు జిల్లా కుప్పంలో 3కేఆర్ ప్రాజెక్టు కోసం బ్యాంకుల నుంచి తీసుకున్న 13,035మంది రైతులకు చెందిన రూ.13.24 కోట్ల రుణాల మాఫీ.
కృష్ణపట్నం పోర్టు అభివృద్ధి కోసం ఇచ్చిన 1,398 ఎకరాల లీజును 30 ఏళ్లకుపొడిగింపు. సవిశాఖపట్నం జిల్లా రాయవరం, రాంబిల్లి మండల్లాలో 1,965.57 ఎకరాలను నేవల్ ఆల్టర్నేట్ బేస్ ప్రాజెక్టు కోసం డిఫెన్స్ ఎస్టేట్‌కు ఎకరం రూ.5 లక్షల చొప్పున అప్పగింత.
లక్ష మంది పిల్లలకు భోజనం సరఫరా చేసేందుకు ముందుకొచ్చిన అక్షయపాత్ర ఫౌండేషన్‌కు గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులో 2 ఎకరాల 20 సెంట్ల స్థలాన్ని ఎకరా రూ.54 వేల చొప్పున 30 ఏళ్లపాటు లీజుకివ్వాలని నిర్ణయం. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో డీఆర్‌డీఓకు 2,721 ఎకరాల కేటాయింపు.
పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.30 వేల కోట్లకు పెరగడంపై చర్చ. ఈ నెల 22 నుంచి ఎర్త్‌వర్క్ పనుల్ని ప్రారంభించాలి. ఈ పనులు ప్రారంభించడానికి వీలుగా రెండు గ్రామాలను ఖాళీ చేయించాలి.
 
ఐటీ కంపెనీలకు భారీ రాయితీలు...
ఐటీ టెక్నాలజీ పార్కులో కార్యాలయం ఏర్పాటు చేసుకునే సంస్థలకు లీజు అద్దెలో 50 శాతం రీయింబర్స్‌మెంట్ (ఏడాదికి రూ.10 లక్షలకు లోబడి) సదుపాయం కల్పించడం.
ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్‌కు కంపెనీలు చెల్లించే బ్యాండ్ విడ్త్ చార్జీల్లో 25 శాతం(రూ.15 లక్షల పరిమితికి లోబడి) రీయింబర్స్‌మెంట్. కార్యకలాపాలు ప్రారంభించిన నాటి నుంచి మూడేళ్లపాటు ఈ అవకాశం.
కార్యకలాపాలు ప్రారంభించిన నాటి నుంచి ఐదేళ్లపాటు నిర్ణీత కరెంటు చార్జీలు యూనిట్ ఒక్కింటికి రూ.10 చొప్పున రీయింబర్స్‌మెంట్. ఐటీ, ఐటీఈఎస్ యూనిట్లు కార్యకలాపాలు ప్రారంభించిన నాటి నుంచి ఐదేళ్లపాటు విద్యుత్ సుంకాల్లో నూరు శాతం మినహాయించి పరిశ్రమలకు వర్తింపచేసే టారీఫ్.
రిజిస్ట్రేషన్, స్టాంపు డ్యూటీలో సబ్ రిజిస్ట్రార్‌కు చెల్లించిన స్టాంపు డ్యూటీ, ట్రాన్స్‌ఫర్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుపై నూరుశాతం రీయింబర్స్‌మెంట్.
ఐటీ కార్యాలయాలకు స్థానిక మున్సిపాల్టీలకు చెల్లించే ఆస్తి పన్నులో 50 శాతం రీయింబర్స్‌మెంట్. ఐటీ కంపెనీల కోసం నిర్మించే భవనాలకు 50 శాతం బీమా. నిర్వహణ చార్జీల్లో 50.4 శాతం రీయింబర్స్‌మెంట్‌కు అవకాశం. ఆడియో, వీడియో సిస్టమ్స్, ప్రొజెక్షన్, సర్వర్ రూమ్, కెఫెటేరియాలతో ఉన్న కాన్ఫరెన్స్ హాలు ఏర్పాటుకు వన్ టైమ్ విలువతో రూ.10 లక్షలకు మించకుండా 50 శాతం రీయింబర్స్‌మెంట్. ఐటీ భవనాలు నిర్మించే మౌలిక వసతుల ప్రొవైడర్లు, డెవలపర్లు, బిల్డర్లు, లీజుదారులకు ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రుణాల్లో పది శాతం రీయింబర్స్‌మెంట్.
కొత్తగా ఏర్పాటు చేసే ఐటీ కంపెనీల్లో రెండేళ్లపాటు ఉద్యోగికి రూ.2 వేల చొప్పున పీఎఫ్ రీయింబర్స్‌మెంట్ (రెండేళ్లు ఉద్యోగంలో కొనసాగి ఉంటే)

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా