ట్రంప్‌కు కిమ్‌ దిమ్మతిరిగే వార్నింగ్‌!

22 Sep, 2017 10:23 IST|Sakshi
ట్రంప్‌కు కిమ్‌ దిమ్మతిరిగే వార్నింగ్‌!

సియోల్‌: ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. డొనాల్డ్‌ ట్రంప్‌ 'మతిచెడిన' పిచ్చివాడిలా ప్రవర్తిస్తున్నాడని, ఉ.కొరియాను నాశానం చేస్తానంటూ వ్యాఖ్యలు చేసినందుకు ట్రంప్‌ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కిమ్‌ హెచ్చరించారు.

ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ సమావేశాల్లో తొలిసారి మాట్లాడిన ట్రంప్‌.. అమెరికాపై గానీ, తన మిత్రదేశాలపైగానీ దాడులు చేస్తే.. ఉ.కొరియాను సమూలంగా నాశానం చేస్తానని తీవ్రస్వరంతో హెచ్చరించారు. ట్రంప్‌ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టిన కిమ్‌ 'డీపీఆర్కే (డెమొక్రటిక్‌ పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్ కొరియా)ను సమూలంగా నాశనం చేస్తానన్న అమెరికా అధ్యక్షుడు తగిన మూల్యం చెల్లించుకోనేలా చేస్తా' అని పేర్కొన్నట్టు కొరియా ప్రభుత్వ వార్తాసంస్థ కేసీఎన్‌ఏ అధికార వర్గాలను ఉటంకిస్తూ పేర్కొంది.

ఐరాస వేదికగా ఒక సార్వభౌమాధికార దేశాన్ని పూర్తిగా నాశనం చేస్తానని పేర్కొనడం ద్వారా అమెరికా అధ్యక్షుడు పిచ్చివాడిగా ప్రవర్తించాడని కిమ్‌ మండిపడ్డారు.

ఉత్తర కొరియాను సమూలంగా నాశనం చేస్తానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన భీకర హెచ్చరికను.. ఆ దేశం తేలికగా కొట్టిపారేసింది. ట్రంప్‌ హెచ్చరికలను కుక్క అరుపులేనని, ఈ బెదిరింపులకు ఉత్తరకొరియా లొంగే ప్రసక్తే లేదని ఇప్పటికే తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే.

ఉత్తర కొరియా ఇటీవల వరుసగా అణ్వాయుధ పరీక్షలు, క్షిపణీ ప్రయోగాలు నిర్వహిస్తుండటంతో అంతర్జాతీయంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. ఉ. కొరియా అణుపరీక్షలపై అమెరికా, దానిమిత్రదేశాలు తీవ్రంగా విరుచుకుపడుతున్నాయి. అయితే, ఎన్ని ఆంక్షలు విధించినా అణ్వాయుధాల విషయంలో వెనుకకు తగ్గేది లేదని ఉ.కొరియా తెగేసి చెప్తుండటం ఉద్రికత్తలు రేపుతోంది.


 

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా