కిరణ్‌కు ‘ఉత్తమ పాలన’ పురస్కారం

21 Dec, 2013 02:38 IST|Sakshi
కిరణ్‌కు ‘ఉత్తమ పాలన’ పురస్కారం

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాల పనితీరును విశ్లేషించి ‘ఇండియా టుడే’ పత్రిక అందజేసే పురస్కారాల్లో ‘ఉత్తమ పాలన’ విభాగంలో ‘ఉత్తమ పెద్ద రాష్ట్రం’ పురస్కారాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అందుకున్నారు. ఈ విజయం అంకితభావంతో పని చేసే ఉద్యోగులు, నైపుణ్యమున్న అధికారుల సమష్టి కృషి ఫలితమన్నారు. ఢిల్లీలో శుక్రవారం ఇండియా టుడే నిర్వహించిన ‘రాష్ట్రాల స్థితిగతుల వార్షిక సదస్సు-2013’లో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి జైరాం రమేశ్ చేతుల మీదుగా కిరణ్ అవార్డును స్వీకరించారు. అనంతరం జైరాం, ముఖ్యమంత్రులు భూపీందర్ సింగ్ హూడా (హర్యానా), మనోహర్ పారికర్ (గోవా)లతో కలిసి ప్యానెల్ చర్చలో పాల్గొన్నారు. అభివృద్ధికి అవరోధంగా మారిన సమ్మెలు, బంద్‌ల అడ్డంకులను రాష్ట్రం ఎలా పరిష్కరించిందంటూ ప్యానెల్ చర్చ నిర్వాహకుడు కిరణ్‌ను ప్రశ్నించారు.
 
 తాను పరిస్థితులన్నింటినీ చక్కదిద్దానని, మంచి పథకాలను అమలు చేస్తున్నానని ఆయన చెప్పుకొచ్చారు. ‘‘ఆందోళనల వల్ల స్కూళ్లు, వ్యాపార సంస్థలు కూడా పని చేయని, ఉపాధి అవకాశాల్లేని, సంక్షేమ పథకాలపై రూ.9,000 కోట్లు అప్పులు పేరుకున్న స్థితిలో నేను సీఎంగా బాధ్యతలు చేపట్టాను. సాధారణ పరిస్థితులు నెలకొల్పడాన్ని ప్రథమ ప్రాధాన్యంగా భావించాను. ప్రభుత్వం గట్టి నిర్ణయాలతో ముందుకు సాగడంతో అప్పులు తీర్చడంతో పాటు కొత్త పథకాలనూ చేపట్టగలిగాం. 1.45 కోట్ల మహిళలకు వడ్డీ లేని రుణాలు, ఏటా 28 లక్షల మంది విద్యార్థులకు రూ.3,000 కోట్ల ఉపకార వేతనాలు ఇచ్చాం. ఉపాధి హామీ పథకంపై దాదాపు ఐదారు వేల కోట్లు ఖర్చుపెడుతున్నాం. మహిళా గ్రూపులు సకాలంలో బ్యాంకు రుణాలను చెల్లిస్తున్నందుకు ప్రభుత్వం వైపు నుంచి రూ.1,400 కోట్ల మొత్తాన్ని వడ్డీ కింద బ్యాంకులకు చెల్లిస్తున్నాం. ప్రజాకర్షక కార్యక్రమాలను వారి శ్రేయస్సు కోసమే అమలు చేస్తున్నాం తప్ప ఎన్నికల కోసం కాదు. ప్రజల జీవనశైలిని మెరుగు పరచడానికి, వారికి సాధికారతను ఇవ్వడానికి, నైపుణ్యాన్ని పెంచడానికి మీసేవ, రాజీవ్ యువ కిరణాలు వంటి పథకాలను నేను చేపట్టాను’’ అని చెప్పారు.
 
 గడ్డు పరిస్థితుల్ని అధిగమించింది
 గడ్డు పరిస్థితులను ఆంధ్రప్రదేశ్ అధిగమించిందని ఇండియాటుడే న్యాయనిర్ణేతల బృందం తన నివేదికలో పేర్కొంది. రాష్ట్ర విభజన అంశంపై నిరంతర ఆందోళనల వంటి క్లిష్ట పరిస్థితుల మధ్య కూడా రాష్ట్రం ఉత్తమ పాలనను అందించే దిశగా పయనించిందని తెలిపింది. ‘‘అన్ని రాష్ట్రాల్లోకెల్లా ఆంధ్రప్రదేశ్‌లోనే పెండింగ్ కేసులు బాగా తగ్గాయి. జాతీయ స్థాయిలో 4 శాతం పెరిగితే రాష్ట్రంలో మాత్రం అవి 3 శాతం మేర తగ్గాయి. అత్యాచార కేసుల్లో 7 శాతం, కిడ్నాపుల్లో 13 శాతం, హత్యల్లో 3 శాతం తగ్గుదల నమోదైంది’’ అని వివరించింది.
 

మరిన్ని వార్తలు