మజ్లిస్ మెప్పుకోసమే పాకులాట

16 Sep, 2015 04:06 IST|Sakshi
మజ్లిస్ మెప్పుకోసమే పాకులాట

సీఎం కేసీఆర్‌పై కిషన్‌రెడ్డి ఫైర్
హైదరాబాద్: గత కాంగ్రెస్ ప్రభుత్వం ఎంఐఎంకు కీలుబొమ్మగా మారి విమోచన ఉత్సవాలు నిర్వహించేందుకు ముందుకురాలేదని, ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం కూడా ఆ పార్టీ మెప్పుకోసమే పాకులాడుతోందని బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కలసిన నిజాం జిల్లాల్లో ఆయా ప్రభుత్వాలు అధికారికంగా ఉత్సవాలు జరుపుతున్నాయని, అక్కడ ముస్లింలు లేరా? అని ప్రశ్నించారు. సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలన్నారు.

మంగళవారం బీజేపీ చేపట్టిన చలో సెక్రటేరియెట్ కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ బీజేపీ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద ధర్నా అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా చలో సచివాలయం చేపట్టారు. అప్రమత్తమైన పోలీసులు ఇందిరాపార్కు చౌరస్తా సమీపంలో ఆందోళనకారులను అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు తోపులాట జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, శాసనసభాపక్ష నేత డాక్టర్ కె. లక్ష్మణ్, ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి, గ్రేటర్ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి తదితర నాయకులతో పాటు కార్యకర్తలను అరెస్టు చేశారు.

అంతకు ముందు జరిగిన ధర్నాలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ విమోచన ఉత్సవాలను ముస్లింలు వ్యతిరేకించడం లేదని, రజాకార్ల పార్టీ అయిన ఎంఐఎం మాత్రమే వ్యతిరేకిస్తోందని అన్నారు. త్యాగాలు అవసరమో, ఎంఐఎం కావాలో టీఆర్‌ఎస్ తేల్చుకోవాలని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్, నాయకులు చింతా సాంబమూర్తి, వెంకటరమణి, చంద్రయ్య, నాగూరావ్ నామోజీ తదితరులు మాట్లాడారు.

మరిన్ని వార్తలు