బ్రేకింగ్‌ న్యూస్‌: వారిని విడుదల చేసేవరకు దీక్ష!

29 Dec, 2016 12:37 IST|Sakshi
వారిని విడుదల చేసేవరకు దీక్ష!

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా తన నివాసంలోనే టీజేఏసీ చైర్మన్‌, ప్రొఫెసర్‌ కోదండరాం గురవారం దీక్షకు దిగారు. సాగునీటి ప్రాజెక్టులకు భూసేకరణ విషయంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ తాము తలపెట్టిన ఆందోళనకు ప్రభుత్వం అనుమతి నిరాకరించిందని, ఆ విషయం తెలియగానే తాము ఆందోళన విరమించుకున్నామని కోదండరాం తెలిపారు. అయినా తమ ఆందోళనకు మద్దతు తెలిపిన రైతులను చాలాచోట్ల పోలీసులు  అరెస్టు చేశారని ఆయన ఆరోపించారు. అరెస్టయిన రైతులందరినీ విడుదల చేసేవరకు తాను దీక్ష కొనసాగిస్తానని కోదండరాం స్పష్టం చేశారు. 2013 భూసేకరణ చట్టం భూనిర్వాసితులకు హక్కుల కల్పించగా.. తాజాగా ప్రభుత్వం చేసిన చట్టం ఏకపక్షంగా ఉందని ఆయన ఆరోపించారు. రైతులకు అన్యాయం జరుగుతుంటే తాము చూస్తూ ఊరుకోమని కోదండరాం పేర్కొన్నారు. కాగా, దీక్ష చేస్తున్న కోదండరాంకు కాంగ్రెస్‌ నేతలు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి సంఘీభావం తెలిపారు. భూసేకరణ చట్టంలో మార్పులు చేసి రైతులకు న్యాయం చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

 
భూసేకరణ చట్టంలో మార్పులు చేయాలని డిమాండ్‌ చేస్తూ గురువారం ఇందిరాపార్కులో భూనిర్వాసితులతో దీక్ష చేయాలని టీజేఏసీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో దీక్షను జేఏసీ వాయిదా వేసింది.

అయితే, ప్రజాస్వామ్యబద్ధంగా తలపెట్టిన దీక్షకు అనుమతి లభించకపోవడంతో తన నివాసంలోనే కోదండరాం దీక్షకు దిగారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం కోదండరాం నివాసంలో టీజేఏసీ అత్యవసర భేటీ నిర్వహించింది. భవిష్యత్తు కార్యాచరణ గురించి ఈ భేటీలో చర్చించారు. ఈ క్రమంలో కోదండరాం నివాసానికి జేఏసీ నేతలు పెద్దసంఖ్యలో చేరుకుంటున్నారు.

టీజేఏసీ తలపెట్టిన భూనిర్వాసితుల హక్కుల సాధన దీక్షకు అనుమతి ఇవ్వకపోవడం, ఎక్కడికక్కడ జేఏసీ నేతల్ని అరెస్టు చేయడంపై జేఏసీ ఆగ్రహంగా ఉంది. ఈ నేపథ్యంలో జేఏసీ శ్రేణులు పెద్ద ఎత్తున కోదండరాం నివాసానికి చేరుకుంటుండగా.. వారిని పోలీసులు అడ్డుకుంటున్నారు.