కోహ్లి కక్ష పెంచుకోవడం సరికాదు!

29 Mar, 2017 18:03 IST|Sakshi
కోహ్లి కక్ష పెంచుకోవడం సరికాదు!

మెల్‌బోర్న్‌: వివాదాలతో, విద్వేషాలతో ఉత్కంఠభరితంగా ఆస్ట్రేలియా సిరీస్ ముగిసిన నేపథ్యంలో ఆ జట్టు ఆటగాళ్లను ఇక ఎంతమాత్రం స్నేహితులుగా పరిగణించబోనంటూ టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి చేసిన వ్యాఖ్యలపై ఆసీస్‌ దిగ్గజాలు అసంతృప్తి వ్యక్తం చేశారు. క్రీడలో జయాపజయాలతోపాటు అన్ని భాగమేనని, కాబట్టి ఈ విషయంలో అతడు ప్రత్యర్థి ఆటగాళ్లపై కక్ష పెంచుకోవడం సరికాదని హితవు పలికారు. ధర్మశాల టెస్టులో విజయంతో బోర్డర్‌-గవస్కర్‌ ట్రోఫీని కైవసం చేసుకున్న అనంతరం కోహ్లి మాట్లాడుతూ ఇక ఆసీస్‌ ఆటగాళ్లతో తాను ఏమాత్రం స్నేహాన్ని కొనసాగించబోనని, వారు తన స్నేహితులు కాదని చెప్పాడు. ఈ వ్యాఖ్యలను ఆసీస్‌ బ్యాటింగ్‌ దిగ్గజం మార్క్‌ టేలర్‌ తీవ్రంగా  తప్పుబట్టారు. కోహ్లి మరింతగా ఎదగాల్సిన అవసరముందని సూచించాడు.  

’ఈ రోజుల్లో క్రికెటర్లు కొన్నిసార్లు కలిసి ఆడుతున్నారు. కొన్నిసార్లు ప్రత్యర్థులుగా ఆడుతున్నారు. ఇలాంటి సమయంలో కక్షలు పెంచుకోవడం సరికాదు. ఇలాంటి వ్యాఖ్యలు చేసేవిషయంలో అప్రమత్తంగా ఉండాలి’ అని టేలర్‌ సూచించాడు. ఆటలో పరిణామాలు, జయాపజయాలు ఎలా ఉన్నా క్రీడాస్ఫూర్తి వ్యవహరించడం ముఖ్యమని వైడ్‌ వరల్డ్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ కోసం రాసిన తన బ్లాగ్‌లో పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్‌మన్ డీన్‌ జోన్స్‌, మాజీ ఇంగ్లండ్‌ ఆటగాడు డేవిడ్‌ లాయిడ్‌ సైతం కోహ్లి వ్యాఖ్యలను తప్పుబట్టారు. అతని వ్యాఖ్యల్లో విజ్ఞత కనిపించడం లేదని పేర్కొన్నారు. ’ఈ గొప్ప క్రీడలో గెలుపోటములే కాదు.. ఆటలో స్నేహంగా మసులుకోవడం, స్నేహితులను చేసుకోవడం కూడా భాగమే’ అని జోన్స్‌ పేర్కొన్నారు. మైదానంలో ఎలా వ్యవహరించాలనే దానిపై లెజండరీ బ్యాట్స్‌మన్‌ సచిన్‌ టెండూల్కర్‌ నుంచి కోహ్లి పాఠాలు నేర్చుకోవాలని లాయిడ్‌ సూచించాడు.

>
మరిన్ని వార్తలు