పాక్‌ మ్యాచ్‌లో కోహ్లి సత్తా చాటుతాడు!

27 May, 2017 10:26 IST|Sakshi
పాక్‌ మ్యాచ్‌లో కోహ్లి సత్తా చాటుతాడు!

తాజాగా జరిగిన ఐపీఎల్‌లో భారత డ్యాషింగ్‌ బ్యాట్స్‌మన్‌ విరాట్‌ కోహ్లి పెద్దగా రాణించలేదు. ఐపీఎల్‌లో ఆడిన పది మ్యాచుల్లో 30.80 సగటుతో 308 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌లో జరగనున్న ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీలో విరాట్‌ కోహ్లి మరోసారి పుంజుకొని.. తన సత్తా ఏమిటో చూపే అవకాశముందని ఇంగ్లండ్‌ లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ మాంటీ పనేసర్‌ అన్నాడు. కోహ్లి ఐపీఎల్‌లో అంచనాల మేరకు రాణించలేదని, కాబట్టి చాంపియన్స్‌ ట్రోఫీలో బాగా ఆడేందుకు ప్రయత్నిస్తాడని మాంటీ చెప్పాడు.

"ఇండియాకు టోర్నమెంటు గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఐపీఎల్‌లో కోహ్లి గొప్పగా ఆడలేదు. కాబట్టి సహజంగానే అతడు ఈ టోర్నమెంటులో బాగా ఆడాలన్న ఆకలితో ఉంటాడు.  కోహ్లి కీలక ఆటగాడు. పెద్ద టోర్నీల్లో బాగా ఆడటాన్ని ఇష్టపడతాడు. టీమిండియాకు మ్యాచ్‌ విన్నర్‌ అయిన అతను ఇంగ్లండ్‌లోనూ బాగా రాణిస్తాడని నేను భావిస్తున్నా' అని చెప్పాడు. జూన్‌ 4న బిర్మింగ్‌హామ్‌లో బద్ధ విరోధి పాకిస్థాన్‌ మ్యాచ్‌తో భారత్‌ చాంపియన్స్‌ ట్రోపీ వేటను ప్రారంభించబోతున్నది. పాకిస్థాన్‌తో జరిగే ఈ పోరుతో కోహ్లి తనలోని బెస్ట్‌ గేమ్‌ను చూపిస్తాడని, మళ్లీ ఫామ్‌లోకి వచ్చి సత్తా చాటుతాడని పనేసర్‌ అన్నాడు.

మరిన్ని వార్తలు