భార్యకు పెద్దనోట్ల చెల‍్లింపు, భర్తకు జైలు

16 Nov, 2016 15:24 IST|Sakshi
భార్యకు పెద్దనోట్లతో భరణం, భర్తకు జైలు

కోల్‌కతా: విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న భార్యకు భరణం కింద రద్దయిన 500, 1000 రూపాయల నోట్లను చెల్లించిన భర్త జైలుపాలయ్యాడు. ఈ కేసు వివరాలిలా ఉన్నాయి. కోల్‌కతాకు చెందిన రిటైర్డ్‌ ఇంజనీర్‌ ఏడేళ్లుగా భార్యకు దూరంగా ఉంటున్నాడు. విడాకుల కోసం దరఖాస్తు చేయగా కోర్టులో కేసు నడుస్తోంది. మనోవర్తి కింద నెలకు 8 వేల రూపాయల చొప్పున భార్యకు చెల్లించాల్సిందిగా గతంలో  కోర్టు ఆదేశించింది. కాగా నాలుగేళ్లుగా ఆయన భరణం చెల్లించలేదు. ఈ నెల నాటికి ఆయన మొత్తం 2.25 లక్షల రూపాయలు భార‍్యకు చెల్లించాల్సి వచ్చింది. భరణం చెల్లించకపోయిన విషయాన్ని ఆయన భార‍్య కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. ఈ నెల 8వ తేదీ నాటికి ఈ మొత్తం నగదు ఆమెకు ఇవ్వాల్సిందిగా కోర్టు ఆదేశించింది.

రిటైర్డ్‌ ఇంజినీర్‌ తరపున ఆయన సోదరుడు కోర్టు విచారణకు హాజరయ్యాడు. సోదరుడి భార్యకు ఇవ్వాల్సిన భరణంలో రెండు లక్షల రూపాయలు కోర్టులో చెల్లించాడు. ఇవన్నీ 500, 1000 రూపాయల నోట్లు. అయితే రద్దయిన ఈ నోట్లను తీసుకునేందుకు రిటైర్డ్‌ ఇంజనీర్‌ భార్య తిరస్కరించింది. చట్టపరంగా చెల్లుబాటులో ఉన్న నోట్లను ఇవ్వాలని కోరింది. ఆమె వాదనకు జడ్జి కూడా అభ్యంతరం చెప్పలేదు. పెద్ద నోట్లను రద్దు చేసినా వీటిని బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసుకోవచ్చని రిటైర్డ్‌ ఇంజినీర్‌ తరఫు న్యాయవాది వాదించినా ఆమె అంగీకరించలేదు. చెక్‌, డీడీ రూపంలో ఇస్తామన్నా ఒప్పుకోలేదు. దీంతో గడువులోపల భరణం చెల్లించడంలో విఫలమైన రిటైర్డ్‌ ఇంజినీర్‌కు కోర్టు జ్యుడిషియల్‌ కస్టడీ విధించింది.
 

మరిన్ని వార్తలు