రైల్లో యువతిపై సైనికుల గ్యాంగ్ రేప్

29 Dec, 2015 12:49 IST|Sakshi
రైల్లో యువతిపై సైనికుల గ్యాంగ్ రేప్

ఇంట్లోంచి పారిపోయి రైలెక్కిన ఓ యువతిపై.. ఆ రైల్లో ఉన్న ఆర్మీ జవాన్లు గ్యాంగ్ రేప్ చేశారు. ఈ దారుణం హౌరా- అమృతసర్ ఎక్స్‌ప్రెస్‌లో జరిగింది. ఆ అమ్మాయి ఆదివారం నాడు ఇంటి నుంచి పారిపోయింది. దాంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదుచేయగా, వాళ్లు రైల్వేశాఖను అప్రమత్తం చేశారు. హౌరా స్టేషన్‌లో వేలాది మంది మధ్య ఆమెను సీసీ టీవీలో గుర్తించిన పోలీసులు.. ఆమె అమృతసర్ ఎక్స్‌ప్రెస్ ఎక్కినట్లు తెలుసుకున్నారు. కానీ అప్పటికే రైలు జార్ఖండ్ దాటింది. రాంచీ డీజీపీ కార్యాలయానికి సమాచారం పంపగా, ఫొటో ఆధారంగా ఆమెను కాపాడే ప్రయత్నాలు మొదలయ్యాయి. రైలును మధుపూర్ స్టేషన్‌లో ఏడు నిమిషాల పాటు ఆపి.. జీఆర్‌పీ, ఆర్పీఎఫ్‌ సిబ్బంది ప్రతి బోగీని చూశారు. అయితే మిలటరీ కోచ్ మాత్రం లోపల నుంచి గడియ వేసి ఉంది.

కొంత వాగ్వాదం తర్వాత ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బంది బోగీలోకి వెళ్లగా.. అందులోనే ఆ అమ్మాయి ఉంది. మహిళా కానిస్టేబుళ్లు ఆమెను జీఆర్పీ స్టేషన్‌కు తరలించి.. అక్కడ అనుమానాస్పదంగా ఉన్న మంజ్రీష్ త్రిపాఠీ అనే సైనికుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అమ్మాయిని ప్రశ్నించగా.. ముగ్గురు జవాన్లు తనతో బలవంతంగా మద్యం తాగించారని, ఇద్దరు రేప్ చేశారని తెలిపింది. సీసీటీవీ ఫుటేజిలో ఆ ఇద్దరినీ ఆమె గుర్తించింది. అయితే, ఈ ప్రక్రియ అంతా ముగిసి వాళ్లను అరెస్టు చేయాలని ఆదేశాలిచ్చేసరికి రైలు 22 స్టాపులు దాటి సుల్తాన్‌పూర్ చేరుకుంది. దాంతో వాళ్లు ఆ బోగీ నుంచి మాయమయ్యారు. దాంతో.. వారితోపాటు ఉన్న మంజ్రీష్ త్రిపాఠీని రైల్వే పోలీసులు అరెస్టు చేశారు.

మరిన్ని వార్తలు