ఇక ఎకరాలోనూ లేఅవుట్!

23 Aug, 2015 02:06 IST|Sakshi
ఇక ఎకరాలోనూ లేఅవుట్!

హెచ్‌ఎండీఏలో స్థలపరిమితిని తగ్గింపునకు సర్కారు ఓకే
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరం చుట్టుపక్కల చిన్నచిన్న మొత్తాల్లో భూములు గల యజమానులకు శుభవార్త! చిన్నచిన్న భూముల్లో లేఅవుట్లకు అనుమతి ఇవ్వాలంటూ ఎన్నో రోజులుగా సర్కారు వద్ద పెండింగ్‌లో ఉన్న ఫైలుకు మోక్షం కలిగింది. లేఅవుట్ నిబంధనలను సడలించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) పరిధిలో ఇకపై కనీసం ఎకరా స్థలం ఉన్నా లేఅవుట్ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

దీంతో లేఅవుట్‌నిబంధనల్లో సడలింపు కోసం ఎదురుచూస్తున్న భూ యజమానులు, సన్నకారు రైతులు, చిన్న చిన్న రియల్టర్ల కలలు నెరవేరనున్నాయి. ప్రస్తుతం లేఅవుట్ నిర్మాణానికి అనుమతి రావాలంటే కనీసం పది ఎకరాలుండాలనేది నిబంధన. దీంతో చిన్న మొత్తంలో స్థలాలు గల రైతులు, భూ యజమానులు ఇబ్బంది పడుతున్నారు.

ఈ నేపథ్యంలో లేఅవుట్‌కు కనీస స్థల పరిమితిని ఎకరాకు తగ్గించాలని, ఎకరా నుంచి 9 ఎకరాల వరకు స్థలం ఉన్నా అనుమతిచ్చేలా నిబంధనలను సడలించాలని కోరుతూ హెచ్‌ఎండీఏ ఏడాది కింద ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇప్పుడు దీనికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రతిపాదనల ఫైలుపై తాజాగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతకం చేయడంతో, ఒకట్రెండు రోజుల్లో జీవో జారీ చేసేందుకు పురపాలక శాఖ కసరత్తు చేస్తోంది.
 
భారీ సంఖ్యలో వెంచర్లు...
లేఅవుట్ సడలింపుల వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయని పురపాలక శాఖ వర్గాలు ధీమా వ్యక్తంచేస్తున్నాయి. హెచ్‌ఎండీఏ పరిధిలోని నల్లగొండ, మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని వేల ఎకరాల భూముల్లో చిన్న చిన్న లేఅవుట్‌ల నిర్మాణం ఊపందుకోనుంది. భారీ సంఖ్యలో కొత్త వెంచర్లు పుట్టుకు రానున్నాయి. నగరం సైతం త్వరితంగా విస్తరించనుంది. మధ్యతరగతి ప్రజలకు నగర శివార్లలో స్థలాలు సైతం అందుబాటులోకి రానున్నాయి. ఎకరా, రెండెకరాల భూములు కలిగిన రైతులు స్వయంగా లేఅవుట్‌లను నిర్మించి స్థిరాస్తి వ్యాపారం చేసుకునేందుకు అవకాశం కలగనుంది.

చిన్న రియల్టర్లు సైతం అవకాశాలు పెరిగి లాభపడనున్నారు. మళ్లీ భూముల ధరలు సైతం పెరిగే అవకాశముంది. నిబంధనల మేరకు కనీసం 10 ఎకరాల స్థలం లేకపోవడంతో అనుమతులు రాక ఇప్పటికే వందల సంఖ్యలో అక్రమ లేఅవుట్లు పుట్టుకొచ్చాయి.

ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా భవిష్యత్తులో ఈ అక్రమ లే అవుట్లను క్రమబద్ధీకరించే అవకాశం కలగనుంది. అదేవిధంగా కొత్తగా అక్రమ లేఅవుట్ల నిర్మాణాన్ని అడ్డుకోవచ్చని హెచ్‌ఎండీఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరగా, అందుకు సర్కారు సానుకూలంగా స్పందించింది. ఇదిలా ఉండగా, 10 ఎకరాల్లోపు ఉన్న లే అవుట్‌లకు అనుమతులు జారీ చేసేందుకు అదనంగా 50 శాతం డెవలప్‌మెంట్ చార్జీలను వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం కొసమెరుపు.

మరిన్ని వార్తలు