నా చెల్లి నన్ను కలిసింది...

13 Oct, 2015 00:04 IST|Sakshi
నా చెల్లి నన్ను కలిసింది...

ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి... సుమారు నలభై సంవత్సరాల తర్వాత ఆ అక్కా చెల్లెళ్ళు... కలిసిన సన్నివేశం అందర్నీ అబ్బుర పరచింది. తొమ్మిదేళ్ళ వయసులో అమెరికాకు చెందిన దంపతులకు దత్తత వెళ్ళిన కొరియాకు చెందిన హోలీ ఓబ్రెయిన్... తన చిన్ననాటి సంఘటన గుర్తుకు రావడంతో ఆవేదనలో మునిగిపోయింది. తనను దత్తత ఇచ్చిన తర్వాత తన చెల్లిని సవతి తల్లి  అనాథాశ్రమంలో చేర్చినట్లు ఆమెకు లీలగా గుర్తుకు వచ్చింది. ఆ జ్ఞాపకం మెదడులో కదిలిన క్షణం నుంచీ.... ఓబ్రెయిన్ మనసాగలేదు.  చెల్లిని చూడాలని పరితపించి పోయింది. ఎలాగైనా ఆమె జాడ తెలుసుకోవాలని ప్రయత్నాలు మొదలు పెట్టింది.

తన సోదరి మేగాన్ హుఘ్స్ ను సవతి తల్లి కొరియాలోని ఓ అనాధాశ్రమంలో చేర్చినట్లుగా ఓబ్రెయిన్ కు అస్పష్టంగా గుర్తుకు వచ్చింది. కొన్నాళ్ళ తర్వాత ఓ బ్రెయిన్ ను పెంచుకున్న తండ్రి... వేగంగా వెడుతున్న రైలునుంచి పడి మరణించాడు. ఆమెను చూసినవారు గుర్తించి రక్షించడంతో ఆమె బతికి బయట పడింది. ఆ తర్వాత దక్షిణ కొరియాలోని ఓ అనాధాశ్రమంలో చేరింది. అయితే అప్పటినుంచీ ఆమె సవతి తల్లి తన సోదరిని తన నుంచీ దూరం చేసిన క్షణాలు  జ్ఞప్తికి వస్తూనే ఉన్నాయి.

ఓ రోజు అర్థరాత్రి నిద్రనుంచీ ఉన్నట్టుండి లేచిన ఓబ్రెయిన్ కు కళ్ళ నీళ్ళు ఆగలేదు. తన గతాన్ని తలచుకొని కన్నీరుమున్నీరైంది. ఎలాగైనా తన చెల్లిని కలుసుకోవాలన్న కోరిక ఆమెలో పెరిగిపోయింది. తనను పెంచిన తల్లిని అడిగింది. ఆమె అనాథాశ్రమంలో వివరాలు సేకరించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.  అయినా ఓబ్రెయిన్ కు ఎక్కడో ఆశ... తన చెల్లి ఎక్కడో బతికే ఉంది. తనకెప్పటికైనా కనిపిస్తుందన్న నమ్మకంతో ఆమె జాడకోసం ప్రయత్నాలు కొనసాగించింది.

 

చెల్లిని.. అమ్మను అనాథాశ్రమం దగ్గరే చివర్లో చూశాను. ఎలాగైనా ఆమె వివరాలు తెలుసుకోవాలని వార్తా పత్రికలకు కూడ సమాచారం ఇచ్చింది. దీంతో కొరియాలోని అనాథాశ్రమాల్లో వివరాలు సేకరించిన  ప్రతినిధులు.. హుఘ్స్ ను కూడా  అనాథాశ్రమం నుంచీ ఓ అమెరికన్ దంపతులు పెంపకానికి తీసుకున్నారని, వారు న్యూయార్క్ లో ఉంటారని తెలిపారు.

ఓబ్రెయిన్ ఈ సంవత్సర ప్రారంభంలో బే ఫ్రంట్ హెల్త్ పోర్ట్ ఛాలెట్ అనే వైద్య విభాగంలో ఉద్యోగానికి చేరింది.మరో మూడు నెలల తర్వాత హుఘ్స్  కూడా అక్కడే ఫిజికల్ థెరపీ అసిస్టెంట్ గా చేరింది. సుమారు నలభై ఏళ్ళ క్రితం కొరియాలో విడిపోయిన ఆ ఇద్దరు అనాధలు ఒకే ఆస్పత్రిలో... ఒకే ఫ్లోర్ లో ఉద్యోగానికి చేరారు.  ఒకే షిఫ్టులో కూడ పనిచేస్తున్నారు. కానీ  ఒకరికి ఒకరు పరిచయం లేదు. అక్కాచెల్లెళ్ళేనని అస్సలు తెలియదు.

 

అయితే ఓ రోజు ..ఓ పేషెంట్ కొరియాకు చెందిన  మరో నర్స్ ఇక్కడ పని చేస్తోందని... బహుశా మీరిద్దరూ ఒకే ప్రాంతానికి చెందిన వారు అయి ఉండొచ్చని చెప్పింది. విషయం తెలిసిన వెంటనే ఓబ్రెయిన్ ఉత్సాహంగా ఆమెను కలిసేందుకు ప్రయత్నించింది. వివరాలు సేకరించింది. తెలిసిన వివరాలను బట్టి అక్కాచెల్లెళ్ళేనని నిర్థారణ అయింది. వారిద్దరూ అక్కాచెల్లెళ్ళేనని డీఎన్ ఏ టెస్టులు కూడా ధృవీకరించాయి. అనుమానం తీర్చుకొనేందుకు మరోసారి ల్యాబ్ టెస్టులను  చెక్ చేసుకుంది.

 ''దేవుడు ఇంతటి అదృష్టాన్నిస్తాడని అనుకోలేదు. నా చెల్లి నన్ను కలిసింది. నాకు జీవితంలో కావాల్సింది ఏముంది? ఇప్పుడు నాకు పిల్లలు లేకపోయినా... నా చెల్లికి ఇద్దరు పిల్లలున్నారు. మేమంతా సెలవుల్లో సంతోషంగా గడుపుతాం..'' అంటూ ఓ బ్రెయిన్ ఆనంద భాష్పాలను తుడుచుకూంటూ... చెల్లి హుఘ్స్ ను గట్టిగా హగ్ చేసుకుంది.

మరిన్ని వార్తలు