బద్దలైన మరో ప్రైవేటు బ్యాంకు బాగోతం!

23 Dec, 2016 12:23 IST|Sakshi
బద్దలైన మరో ప్రైవేటు బ్యాంకు బాగోతం!

న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు దేశవ్యాప్తంగా ఉన్న యాక్సిస్‌ బ్యాంకు శాఖల్లో పెద్ద ఎత్తున అక్రమాలు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. యాక్సిస్‌ బ్యాంకు బాగోతం మరువకముందే మరో ప్రముఖ ప్రైవేటు బ్యాంకులో నకిలీ ఖాతాల వ్యవహారం కలకలం రేపుతోంది. న్యూఢిల్లీ కస్తుర్బా గాంధీ మార్గ్‌లో ఉన్న కోటక్‌ మహేంద్ర బ్యాంకు శాఖపై తాజాగా ఆదాయపన్ను (ఐటీ) అధికారులు నజర్‌ పెట్టారు. ఈ బ్యాంకులో దాదాపు రూ. 70 కోట్లు డిపాజిట్‌ చేసిన నకిలీ ఖాతాలు వెలుగుచూసినట్టు సమాచారం. ఇందులో రూ. 39 కోట్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు అధికారుల సహకారంతో తొమ్మిది నకిలీ ఖాతాలు తెరిచి.. అందులో సుమారు రూ. 39 కోట్లను డిపాజిట్‌ చేసినట్టు ఐటీ అధికారులు గుర్తించారు. ఈ నకిలీ ఖాతాలన్నింటినీ రమేశ్‌ చంద్‌, రాజ్‌కుమార్‌ అనే వ్యక్తుల నియంత్రణలో ఉన్నట్టు భావిస్తున్నారు.

కాగా, రాధికా జెమ్స్‌ అనే కంపెనీ పేరిట ఉన్న మరో నకిలీ ఖాతాలో మరో 36.40 కోట్లు డిపాజిట్‌ చేసినట్టు తెలుస్తోంది. నకిలీ ఖాతాల్లో డబ్బు డిపాజిట్‌ చేయడమే కాదు.. పెద్ద ఎత్తున డిమాండ్ డ్రాప్ట్స్‌ ద్వారా నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునేందుకు బ్యాంకు అధికారులు సహకరించినట్టు ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. మరోవైపు తమ బ్యాంకులో ఎలాంటి అక్రమాలు జరగలేదని, కేవైసీ (నో యువర్‌ కస్టమర్‌) వివరాలు అన్ని తీసుకున్న తర్వాత ఆయా ఖాతాల్లో డిపాజిట్లకు అనుమతించామని కోటక్‌ మహేంద్ర బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కేసుల విషయంలో ఐటీ అధికారుల విచారణకు సహకరిస్తున్నట్టు పేర్కొంది.