కృష్ణా డెల్టా ఉప్పు కయ్యే!

30 Nov, 2013 01:01 IST|Sakshi
  •  బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పు ఫలితం
  •  కృష్ణా నీటిలో లవణాల శాతం పెరుగుదల
  •  తాగేందుకు, సాగుకూ నిరుపయోగం
  •  
    వరి పండించడం మరచిపోదాం.. పాడి పరిశ్రమకూ మంగళం పాడదాం.. భవిష్యత్తులో కృష్ణా డెల్టా రైతులు ఇక నమ్ముకోవాల్సింది.. అమ్ముకోవాల్సిందీ ఉప్పు మాత్రమే! కృష్ణా నదీ జలాల వివాదాలపై బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీసుకొస్తున్న పెను ఉపద్రవమిది!! కృష్ణా జలాల వివాదంలో ఇప్పటివరకూ ఎవరూ దృష్టిసారించని ఓ పెను ప్రమాదంపై సాక్షి ప్రత్యేక కథనం..
     
     మనకు వచ్చేది లవణాల నీరే!
     వర్షపు నీరు నేలను తాకినప్పుడు మట్టిలోని కొన్ని లవణాలను కరిగించి తన వెంట మోసుకెళ్తుంది. ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే మహారాష్ట్ర, కర్ణాటకల్లో కృష్ణా నది ప్రవహించే ప్రాంతాల్లో అగ్నిపర్వత అవశేషాలతో కూడిన రాతి నేలలు (బసాల్ట్) ఎక్కువగా ఉన్నాయి. ఫలితంగా ఈ ప్రాంతాల్లో కురిసే వర్షపు నీటిలోకి చేరే లవణాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. వర్షాలు కురిసినప్పుడు తాజాగా వచ్చిన నీటిని వాడుకొని అప్పటికే నిల్వ ఉంచిన నీటిని మహారాష్ట, కర్ణాటక కిందకు వదులుతాయి. అంటే నాణ్యమైన నీటిని ఆ రాష్ట్రాలు వినియోగించుకోగా, లవణాలతో కూడిన నీరంతా కిందకు వచ్చి చేరుతుందన్నమాట!
     
      పైనుంచి స్వచ్ఛమైన జలాలు తగ్గిపోతే నీటిలో లవణాల శాతం పెరిగిపోయి సాగుకు కాదు కదా.. కనీసం పశువులు తాగేందుకు కూడా పనికిరాకుండా పోయే ప్రమాదముంది. నది పరీవాహక ప్రాంతంలో నీటిలోని లవణాల మోతాదు లీటర్‌కు 500 మిల్లీ గ్రాములకు మించితే ఆ నీరు వాడుకునేందుకు పనికిరాని స్థాయికి చేరుతుంది. క్యాల్షియం, మెగ్నీషియం వంటి లవణాలతో పోలిస్తే సోడియం మోతాదు పెరిగిపోవడం లేదా సోడియం కార్బొనేట్ వంటి లవణాలు ఉండటం వల్ల సాగునీరు, వ్యవసాయ భూములపై దుష్ర్పభావం చూపుతుంది. కాలక్రమంలో నేల చౌడుబారి సాగుకు పనికిరాని ఉప్పుకయ్యగా మిగులుతుంది. కృష్ణా బేసిన్‌లో లవణాలన్నింటినీ వదిలించుకోవాలంటే దాదాపు 850 టీఎంసీల వరకూ నీటిని సముద్రంలోకి వదిలేయాలి. బేసిన్ బయట వాడుకుంటున్న మరో 360 టీఎంసీల నీటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలంటే వదిలేయాల్సిన నీటి పరిమాణం మొత్తం మరో 490 టీఎంసీలకు పెరుగుతుంది. కృష్ణా పరీవాహక ప్రాంతంలో లభ్యమయ్యే మొత్తం 2,578 టీఎంసీల నీటిలో ఎవరికీ కేటాయించని జలాలు.. దాదాపు 16 టీఎంసీలు. పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడేందుకుగాను ఈ నీటిని ప్రకాశం బ్యారేజీ ద్వారా నేరుగా సముద్రంలోకి కలిపేయాలని నిర్ణయించారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఎగువ రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్న లవణాల మాటేమిటన్నది ప్రశ్నార్థకంగా మిగిలింది. నీటి పరిమాణంతో పాటు అత్యంత ముఖ్యమైన ఈ నీటి నాణ్యత అంశాన్ని ఇప్పటిదాకా ఎవరూ పట్టించుకోకపోవడం చిత్రమే. 
     
     అంతర్జాతీయంగా చేదు అనుభవాలు..
     ఆస్ట్రేలియాలోని ముర్రే డార్లింగ్ జలాలను విచ్చలవిడిగా వాడటం వల్ల క్షారత పెరిగిపోయింది. ఈ నష్టాన్ని నివారించేందుకు రివర్ అథారిటీ 1997లో చర్యలు చేపట్టింది. నీటి నాణ్యతను 1993 నాటి స్థాయికి చేర్చేందుకు అప్పటిదాకా విచ్చలవిడిగా వాడుతున్న జలాల వినియోగంలో కోత పెట్టారు. ఫలితంగా బేసిన్ ప్రాంతంలో నీటి లభ్యత గణనీయంగా పెరిగింది. కొలరాడో కథ కూడా ఇలాంటిదే.  అమెరికాలో వ్యవసాయం విపరీతంగా పెరిగిపోవడంతో మెక్సికోకు చేరే నీటి నాణ్యత దెబ్బతినడం మొదలైంది. దీనిపై మెక్సికో నిరసన వ్యక్తం చేయడంతో అమెరికా వాడుతున్న నాణ్యతతో కూడిన నీరు లభించేలా చూసేందుకు 1974లో ద్వైపాక్షిక ఒప్పందం కుదిరింది.
మరిన్ని వార్తలు