కృష్ణానదిపై మరో బ్యారేజీ నిర్మాణం!

9 Aug, 2015 02:37 IST|Sakshi
కృష్ణానదిపై మరో బ్యారేజీ నిర్మాణం!

మాగనూర్ (మహబూబ్‌నగర్) : కృష్ణానదిపై కర్ణాటక మరో అక్రమ నిర్మాణానికి పూనుకుంది. కేంద్ర జలవనరుల శాఖ అనుమతులు లేకుండానే బ్రిడ్జి కం బ్యారేజీ నిర్మాణాన్ని చేపట్టింది. గిరిజాపూర్ వద్ద నిర్మించే ఈ బ్రిడ్జి నిర్మాణానికి కర్ణాటక ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతోపాటు గతనెల 28న రూ.150 కోట్ల నిధులనూ విడుదల చేసింది. బ్యారేజీ నిర్మాణాన్ని 24 నెలల్లో పూర్తిచేయాలని నిర్ణయించింది.  బ్యారేజీ పొడవు 1.35 కిలోమీటర్లు నిర్మించే ఈ బ్యారేజీకి 194 గేట్లు ఏర్పాటు చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది.

అయితే, కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే కృష్ణానదిపై గూగల్ దగ్గర బ్రిడ్జి కం బ్యారేజీని నిర్మించింది. మళ్లీ ఇదే నదిపై కర్ణాటక తెలంగాణ సరిహద్దుకు కిలోమీటర్ దూరంలో బ్యారేజీ నిర్మాణానికి పూనుకుంది. ఈ బ్యారేజీ నిర్మాణం పూర్తయితే  తెలంగాణలోని ప్రాజెక్టులకు, ఎత్తిపోతల పథకాలకు నీరందడం గగనంగా మారనుంది. మరోపక్క భీమా నదిపై గూడూర్, యాద్‌గిర్‌ల వద్ద ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం బ్రిడ్జి కం బ్యారేజీలను నిర్మించి నీటిని నిల్వ చేస్తున్నది.

వీటికి కేంద్ర జలవనరుల శాఖ నుంచి ఎలాంటి అనుమతులూ లేవు. కర్ణాటక అక్రమ నిర్మాణంపై పక్షం రోజుల క్రితమే జిల్లా కలెక్టర్‌కు, భారీ నీటిపారుదలశాఖ మంత్రికి ఫిర్యాదు చేశామని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి తెలిపారు.

>
మరిన్ని వార్తలు