తేలని కృష్ణా పంచాయితీ: పరస్పర ఫిర్యాదులు

21 Sep, 2016 17:13 IST|Sakshi
తేలని కృష్ణా పంచాయితీ: పరస్పర ఫిర్యాదులు

- అపెక్స్ సమావేశంలో హాట్ హాట్ గా వాదనలు
- పాలమూరు, డిండికి ఏపీ అభ్యంతరం
- అవి పాతవేనన్న తెలంగాణ.. పట్టిసీమ, పోతిరెడ్డిపాడులపై ఫిర్యాదు
- కలిసి మాట్లాడుకోవాలని ఉమాభారతి సూచన

న్యూఢిల్లీ: కృష్ణానదీ జలాల్లో వాటాల కేటాయింపులు, వాటి ఆధారంగా నిర్మిస్తోన్న ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు కేంద్రానికి పరస్పర ఫిర్యాదులు చేశాయి. ఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌లోని కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతి కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం జరిగిన అపెక్స్ సమావేశంలో.. తెలంగాణ నిర్మిస్తోన్న పాలమూరు, డిండి ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరాలు వ్యక్యం చేయగా, అవి రెండూ పాత ప్రాజెక్టులేనని, తమకు దక్కాల్సిన నీటివాటాను పెంచాలని తెలంగాణ వాదించింది. మొత్తంగా ఎజెండాలోని ఐదు అంశాల్లో మూడింటికి ఏకాభిప్రాయం లభించగా, కీలకమైన ప్రాజెక్టులపై మాత్రం స్పష్టత రాలేదు.

కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి, తెలంగాణ, ఏపీ సీఎంలు కె.చంద్రశేఖర్ రావు, నారా చంద్రబాబునాయుడులతోపాటు నీటిపారుదల మంత్రులు హరీశ్ రావు, దేవినేని ఉమా మహేశ్వరరావు, ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖల ముఖ్యకార్యదర్శులు, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, ఇంజనీర్ ఇన్ చీఫ్ లు అపెక్స్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. భేటీ అనంతరం అనంతరం ఉమాభారతి మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర అధికారులతో సమావేశం నిర్వహించామని, ఇరు పక్షాల వాదలు పూర్తయిన తర్వాత మూడు అంశాలపై ఏకాభిప్రాయం కుదిరిందని, వ్యక్తిగతంగా దీనినొక విప్లవాత్మక(క్రాంతికారి) భేటీగా భావిస్తున్నానని అన్నారు.

టెలీ మెట్రిక్ విధానం ద్వారా నీటి వాడకాన్ని లెక్కించేందుకు ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. 47 చోట్ల ఈ టెలీమీటర్లను ఏర్పాటుచేయనున్నారు. టెండర్ల ద్వారా త్వరలోనే ఈ ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించాయి. నదీజలాల లభ్యత, పంపిణీపై అధ్యయనానికి సంయుక్త కమిటీ ఏర్పాటుచేసుకోవాలనే ఎజెండా అంశానికి కూడా ఇరు పక్షాలు సరేనన్నాయి. రాష్ట్రాల మధ్య నీటి పంపిణీకి తాత్కాలిక విధానానికి (ప్రస్తుతం అమలవుతోన్న దానికి) అంగీకారం తెలిపాయి. అయితే ఏకాభిప్రాయం కుదరని ప్రాజెక్టుల అంశాలపై రెండు రాష్ట్రాలు కలిసి మాట్లాడుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. అపెక్స్ భేటీకి సంబంధించిన నివేదికను ట్రిబ్యూనల్ కు అందజేయనున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారు. కాగా, నీటి వాటాలపై మరో సమావేశం ఉండదని ఉమాభారతి తెగేసిచెప్పారు. దీంతో తదుపరి అభ్యంతరాలన్నీ ట్రిబ్యూనల్, సుప్రీంకోర్టులకే తెలపాల్సి ఉంటుంది.

పాలమూరు, డిండికి ఏపీ 'నో': తెలంగాణ నిర్మించతలపెట్టిన పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు లేవని అపెక్స్ సమావేశంలో ఏపీ ప్రభుత్వం వాదనలు వినిపించింది. బ్రిజేష్ ట్రిబ్యూనల్ తీర్పు నోటిఫై అయ్యేంత వరకు పాత విధానంలోనే నీటిని పంచుకునేందుకు, టెలీ మీటర్ల ఏర్పాటుకు, నీటి లభ్యతపై అధ్యయన కమిటీ ఏర్పాటుకు అంగీకరించింది.

పాలమూరు, డిండి పాతవే: ఆంధ్రప్రదేశ్ వాదిస్తున్నట్లు పాలమూరు- రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు కొత్తవి కావని, చాలా ఏళ్ల కిందటే వాటి నిర్మాణాలకు జీవోలు జారీ అయ్యాయని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ఏపీ నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు కొత్తదని, దానికి సీడీబ్ల్యూసీ, బోర్డు అనుమతులు లేవని ఆరోపించింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఏపీ ఎక్కువ నీళ్లను వాడుకుంటున్నదని ఫిర్యాదుచేసింది. ఆర్డీఎస్ ఉల్లంఘనలపై కేంద్రం దృష్టిపెట్టాలని కోరింది. కృష్ణాలో తెలంగాణ వాటా 299 టీఎంసీల నుంచి 389 టీఎంసీలకు పెంచాలని విజ్ఞప్తి చేసింది. ట్రిబ్యూనల్ ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేసే వరకు బోర్డు నియంత్రణ అక్కర్లేదని, మొహిలే, గోయల్ లను నిపుణుల కమిటీ నుంచి తొలిగించాలని కోరింది. గోదావరి జలాల్లో తనకున్న 954 టీఎంసీల వాటాను వినియోగించుకునేలా చేపట్టిన ప్రాజెక్టుల రీ డిజైనింగ్ లో ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని తెలంగాణ ప్రభుత్వం అపెక్స్ సమావేశంలో తేల్చిచెప్పింది.

సుప్రీం ఆదేశాల మేరకు రూపొందించిన అపెక్స్ ఎజెండాలోని అంశాలివే..
1) తెలంగాణ నిర్మిస్తోన్న పాలమూరు, డిండి ప్రాజెక్టులపై చర్చకు మొదటిప్రాధాన్యం
2) ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీకి తాత్కాలిక విధానం
3) రిజర్వాయర్ల పరిధిలో ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో లెక్కలు పారదర్శకంగా ఉండేందుకు టెలీమెట్రీ విధానం
4) సంవత్సరంలో(ఒక వాటర్ ఇయర్‌లో) నీటి వాటాల్లో హెచ్చుతగ్గులుంటే వాటి సర్దుబాటు చేసుకోవడం
5) గోదావరి నుంచి కృష్ణా బేసిన్‌కు నీటి తరలిస్తూ ఏపీ ప్రభుత్వం చేపట్టిన పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులపై చర్చ
వీటిలో కీలకమైన అంశాలు తప్ప మిగిలిన మూడింటిపై భేటీలో ఏకాభిప్రాయం కుదిరింది.

మరిన్ని వార్తలు