‘కృష్ణా’ ముసాయిదాపై మొదలైన కసరత్తు!

29 Aug, 2016 01:58 IST|Sakshi
‘కృష్ణా’ ముసాయిదాపై మొదలైన కసరత్తు!

సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వినియోగం, ప్రాజెక్టుల నియంత్రణపై ముసాయిదా సమర్పించాలన్న బోర్డు సూచనపై రాష్ట్ర ప్రభుత్వం తన కసరత్తు ప్రారంభించింది. ఏయే అంశాలను ముసాయిదాలో పొందుపరచాలన్న దానిపై ప్రాథమిక చర్చలు మొదలుపెట్టింది. ఈ చర్చల అనంతరం వారంరోజుల్లో ముసాయిదాను బోర్డుకు సమర్పించనుంది. కాగా ఇప్పటికే నిర్ణయించిన మేరకు ఏపీ, తెలంగాణ మధ్య నీటి పంపకాల్లో స్పష్టత వచ్చే వరకు ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణా బోర్డు పరిధిలోకి చేర్చే విషయంలో తొందర అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసే అవకాశాలున్నాయి.

ప్రాజెక్టుల వారీ కేటాయింపులపై స్పష్టత వచ్చాకే బోర్డు పరిధిలోకి తెచ్చే అంశంపై నిర్ణయం తీసుకోవాలని కోరనుందని నీటి పారుదల శాఖ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర పునర్‌విభజన చట్టంలోని సెక్షన్ 85 ప్రకారం ప్రాజెక్టులను కేంద్రం నోటిఫై చేసిన తర్వాత, ప్రాజెక్టుల వారీగా నీటి లెక్కలు తేలాక కేవలం బోర్డు వీటి నిర్వహణను మాత్రమే చూడాల్సి ఉంటుందని, అదీగాక బ్రజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ గడువును పొడిగిస్తూ, ప్రాజెక్టుల వారీగా కేటాయింపులను నిర్ధారించాల్సిందిగా సూచించారని, ఎవరి వాటా ఎంత, వినియోగం ఏరీతిన ఉండాలో ట్రిబ్యునల్ చెప్పాకే బోర్డు ప్రాజెక్టులను నియంత్రణలోకి తెచ్చుకోవాలని సూచించే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నాయి. నికర జలాల కేటాయింపులపై ఎలాంటి అభ్యంతరాలు లేనప్పటికీ ఆంధ్రప్రదేశ్ చేపట్టిన పట్టిసీమ పథకానికి సమాన స్థాయిలో నీటి కేటాయింపులు చేసే అంశాన్ని పరిశీలించాల్సిందిగా తెలంగాణ డిమాండ్ చేసే అవకాశం ఉంది. దీంతో పాటే నీటి వినియోగ, అవసర షెడ్యూల్‌ను ముందుగానే బోర్డుకు అందించే విషయంలో కచ్చితత్వాన్ని పాటించేలా నిబంధనలు పెట్టాలని కోరే అవకాశాలున్నాయి.

>
మరిన్ని వార్తలు