తెలంగాణ ఉద్యమకారుడు కృష్ణారావు కన్నుమూత

31 Jan, 2016 04:31 IST|Sakshi
తెలంగాణ ఉద్యమకారుడు కృష్ణారావు కన్నుమూత

ఆంధ్రావాసి అయినా... తెలంగాణ కోసం ఉద్యమించిన వ్యక్తి
రామచంద్రాపురం: తను ఆంధ్రాలో పుట్టినా తనకు ఉద్యోగ జీవితాన్నిచ్చిన తెలంగాణ గడ్డ రుణం తీర్చుకుంటానంటూ తెలంగాణ ఉద్యమ సమయంలో 18 రోజులు ఆమరణ నిరాహారదీక్ష చేసిన కృష్ణారావు శనివారం కన్నుమూశారు. విజయవాడకు చెందిన ఆయన ఏళ్ల క్రితమే ఇక్కడ స్థిరపడ్డారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం  నివాసంలో మృతి చెందా రు. కృష్ణారావుకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు.

మెదక్ జిల్లాలోని భెల్ పరిశ్రమ ప్రారంభంలో కార్మికుడిగా జీవితాన్ని మొదలుపెట్టిన కృష్ణారావు భెల్ కార్మిక సంఘంలో తన ప్రత్యేకతను చాటారు. ఆ సమయంలో ఇందిరాగాంధీ కుటుంబంతో సన్నిహితంగా మెలిగారు. సామాజిక సేవలు చేసిన ఆయనకు మదర్‌థెరిసా కూడా ప్రశంసాపత్రాన్ని పంపించారు. అదే స్ఫూర్తితో తనకు నీడనిచ్చిన తెలంగాణ గడ్డకు న్యాయం చేయాలన్న సంకల్పంతో 2006, 2007లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన 18 రోజులు ఆమరణ నిరాహారదీక్ష చేశారు.

ఆ సమయంలో కేంద్ర మాజీ మంత్రి నరేంద్ర, మాజీ ఎంపీలు విజయశాంతితోపాటు పలువురు టీఆర్‌ఎస్ నాయకులు నచ్చజెప్పినా చావడానికైనా సిద్ధం కానీ, తెలంగాణ కావాలంటూ ఆయన తెగేసి చెప్పారు. పోలీసులు ఆసుపత్రి తరలించినా ఆసుపత్రిలోనూ దీక్ష కొనసాగించారు. భెల్ మొదటి ఫేజ్ ఎంఐజీ కోసం తన భార్యతో కలిసి ఆమరణ నిరాహారదీక్ష చేశారు. ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, భెల్ ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడు ఎల్లయ్య, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్, మాజీ సర్పంచ్ రాజేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మల్లెపల్లి సోమిరెడ్డి ఆయన పార్ధివదేహాన్ని సందర్శించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

మరిన్ని వార్తలు