కేటీపీపీ వ్యయం పైపైకి!

13 Jul, 2015 02:29 IST|Sakshi

రూ.2,968 కోట్ల నుంచి రూ.4,334 కోట్లకు పెరుగుదల
సాక్షి, హైదరాబాద్: కాకతీయ థర్మల్ విద్యుత్కేంద్రం (కేటీపీపీ) రెండో దశ ప్రాజెక్టు వ్యయం అంచనాకు మించి పెరుగుతోంది. వరంగల్ జిల్లాలోని కేటీపీపీ రెండో దశ విస్తరణ కింద 600 మెగావాట్ల థర్మల్ విద్యుత్కేంద్రాన్ని నిర్మించేందుకు 2008 లో రూ.2,968 కోట్ల అంచనా వ్యయంతో ఉమ్మడి ఏపీ జెన్‌కో పరిపాలన అనుమతులిచ్చింది. ఆ తర్వాత నిర్మాణంలో జాప్యం వల్ల నిర్మాణ వ్యయంతో పాటు పెట్టుబడి రుణాలపై వడ్డీ (ఐడీసీ) పెరిగిపోయింది. దీంతో దీని అంచనా వ్యయాన్ని రూ.3,652.51 కోట్లకు పెంచుతూ 2013లో జెన్‌కో ఉత్తర్వులిచ్చింది.
 
 ఆ తర్వాత కూడా ప్రాజెక్టు నిర్మాణ పనులు నత్తనడకన సాగాయి. పనులు సాగదీయడంతో ఏడాదిన్నర లోనే మళ్లీ ఈ ప్రాజెక్టు వ్యయాన్ని రూ.4,334.11 కోట్లకు పెంచాల్సి వచ్చింది. ఈ మేరకు గత నెల 20న తెలంగాణ జెన్‌కో యాజమాన్యం ఉత్తర్వులిచ్చింది. తొలుత కేటీపీపీ-2 ప్రాజెక్టు వ్యయంలో ఐడీసీలు రూ.383.82 కోట్లు ఉండగా, ఏడాదిన్నర కింద రూ.450 కోట్లకు పెంచారు. కేవలం ఏడాదిన్నర వ్యవధిలోనే ఐడీసీలు రూ.850 కోట్లకు ఎగబాకడం శోచనీయం. సకాలంలో పనులు పూర్తి చేస్తే వ్యయం పెరిగేది కాదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
 
 భవిష్యత్తు ప్రాజెక్టులపై ప్రభావం
 రాష్ట్రంలో జెన్‌కో, సింగరేణి, ఎన్టీపీసీల ఆధ్వర్యంలో 11,880 మెగావాట్ల కొత్త విద్యుత్కేంద్రాల నిర్మాణానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రూ.91,500 కోట్ల అంచనా వ్యయంతో భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది. పెట్టుబడుల కోసం ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీల నుంచి రూ.35 వేల కోట్లకు పైగా రుణాలను సమీకరించింది. మిగతా భారాన్ని ఎన్టీపీసీ, జెన్‌కో, సింగరేణి సంస్థలే పెట్టుబడిగా పెడుతున్నాయి. అయితే, ఈ ప్రాజెక్టుల నిర్మాణం ఇంకా పట్టాలెక్కలేదు.
 

మరిన్ని వార్తలు