‘హేగ్‌’లో భారత్‌ గెలుపు

19 May, 2017 08:14 IST|Sakshi
‘హేగ్‌’లో భారత్‌ గెలుపు

అంతర్జాతీయ న్యాయస్థానంలో పాకిస్తాన్‌కు ఎదురుదెబ్బ
కుల్‌భూషణ్‌ జాధవ్‌ మరణశిక్షపై స్టే

తుది తీర్పు వచ్చేంతవరకు శిక్ష అమలు చేయవద్దని పాక్‌కు ఆదేశం
జాధవ్‌ను అరెస్టు చేసిన పరిస్థితులు వివాదాస్పదంగా ఉన్నాయి
ఆయనకు దౌత్యపరమైన సాయం అందలేదు
ఇది మానవ హక్కుల ఉల్లంఘనే.. వియన్నా ఒప్పందానికి వ్యతిరేకం
జాధవ్‌కు దౌత్యపర సాయం అందేందుకు వీలు కల్పించాలిæ
భారత్‌కు దౌత్య విజయం.. దేశంలో సంబరాలు
ప్రధాని మోదీ హర్షం.. సుష్మాపై రాజ్‌నాథ్‌ ప్రశంసలు
ఐసీజే తీర్పును అంగీకరించబోమన్న పాక్‌
అయినా ఆగస్టు వరకూ మరణశిక్ష అమలు చేయబోమని హామీ
ఆ తర్వాత ఏం జరుగుతుందో భరోసా ఇవ్వలేమన్న పాక్‌ న్యాయవాది  


ది హేగ్‌/న్యూఢిల్లీ
కుల్‌భూషణ్‌ జాధవ్‌కు మరణశిక్ష కేసులో పాకిస్తాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ వ్యవహారంలో పాకిస్తాన్‌ తీరు సరిగా లేదంటూ అంతర్జాతీయ న్యాయస్థానం మొట్టికాయలు వేసింది. అసలు జాధవ్‌ను అరెస్టు చేసిన పరిస్థితులే వివాదాస్పదంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. ఈ కేసులో జాధవ్‌కు ఎలాంటి దౌత్యపరమైన సాయం అందకుండా పాకిస్తాన్‌ వ్యవహరించిందని.. ఇది హక్కుల ఉల్లంఘనేనని, వియన్నా ఒప్పందానికి వ్యతిరేకమని స్పష్టం చేసింది. జాధవ్‌కు దౌత్యపరమైన సాయం అందేందుకు వీలు కల్పించాలని.. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు కోర్టుకు వివరాలు అందజేయాలని పాకిస్తాన్‌కు సూచించింది. ఈ కేసులో తుది తీర్పు వెలువరించేవరకు జాధవ్‌కు మరణశిక్షను అమలు చేయరాదని ఆదేశిస్తూ.. స్టే విధించింది. ఈ మేరకు అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) అధ్యక్షుడు రోనీ అబ్రహాం నేతృత్వంలోని 15 మంది న్యాయమూర్తుల ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. మరోవైపు అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలను పాకిస్తాన్‌ తప్పుబట్టింది. ఈ తీర్పును తాము అంగీకరించబోవడం లేదని పేర్కొంది. అయితే ఆగస్టు వరకూ జాధవ్‌కు మరణశిక్షను అమలుచేయబోమని, కానీ ఆ తర్వాత ఏం జరుగుతుందో భరోసా ఇవ్వలేమని పాకిస్థాన్‌ తరఫు న్యాయవాది అంతర్జాతీయ న్యాయస్థానానికి స్పష్టం చేశారు. ఇక జాధవ్‌ మరణశిక్ష అమలుపై అంతర్జాతీయ న్యాయస్థానం స్టే ఇవ్వడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. జాధవ్‌ను రక్షించుకునేందుకు ఉన్న ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

ఏకగ్రీవంగా ఐసీజే ధర్మాసనం తీర్పు
భారత మాజీ నావికాదళ అధికారి కుల్‌భూషణ్‌ జాధవ్‌ (46)కు గూఢచర్యం కేసులో పాకిస్తాన్‌ మిలటరీ కోర్టు మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. దీనిపై భారత ప్రభుత్వం నెదర్లాండ్స్‌లోని హేగ్‌లో ఉన్న అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)లో అప్పీలు చేసింది. ఈ పిటిషన్‌పై ఐసీజే అధ్యక్షుడు రోనీ అబ్రహాం నేతృత్వంలోని 15 మంది న్యాయమూర్తుల ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. భారత్‌తోపాటు పాకిస్థాన్‌ వాదనలు వినిపించాయి. పాకిస్థాన్‌ వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ జాధవ్‌కు ఎలాంటి దౌత్యసాయం అందకుండా అడ్డుకుంటోందని భారత్‌ వివరించింది. దీనిపై తాము 16 సార్లు విన్నవించినా కూడా తిరస్కరించిందని కోర్టుకు తెలిపింది. అయితే ఈ వాదనను పాకిస్థాన్‌ తప్పుబట్టింది. జాధవ్‌ ఒక గూఢచారి అని.. వియన్నా ఒప్పందం ప్రకారం ఉగ్రవాదులు, గూఢచర్యం చేసేవారికి దౌత్యసాయం ఉండదని వాదించింది. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చింది. తమ తుది తీర్పు వచ్చేవరకు జాధవ్‌కు మరణశిక్ష అమలుకాకుండా సాధ్యమైన అన్ని చర్యలూ తీసుకోవాలని ఆదేశించింది.

అరెస్టు పరిస్థితులూ వివాదాస్పదం..
జాధవ్‌ అరెస్టుకు సంబంధించిన పరిస్థితులు వివాదాస్పదంగా ఉన్నాయని ఐసీజే అధ్యక్షుడు రోనీ అబ్రహం పేర్కొన్నారు. వియన్నా ఒప్పందం ప్రకారం (1977లో భారత్‌–పాకిస్థాన్‌లు ఆ ఒప్పందంపై సంతకాలు చేశాయి) కుల్‌భూషణ్‌ జాధవ్‌కు భారత్‌ దౌత్యపరమైన సాయం చేసేందుకు అనుమతించాలని స్పష్టం చేశారు. తుది తీర్పు ఇచ్చేంతవరకు యథాతథస్థితి కొనసాగించాలని ఆదేశించారు. ఇక దౌత్యపరమైన సాయానికి సంబంధించిన ప్రాథమిక అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత జాధవ్‌ విషయంలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని స్పష్టమైందని ధర్మాసనంలో సభ్యుడిగా ఉన్న జస్టిస్‌ భండారి (భారత్‌) పేర్కొన్నారు. జాధవ్‌ను అరెస్టు చేసినప్పటినుంచి మరణశిక్ష విధించేవరకు కూడా దౌత్యపరమైన సాయానికి అనుమతించాలంటూ భారత ప్రభుత్వం 16 సార్లు విజ్ఞప్తి చేసినా తిరస్కరణకు గురైందనేది సుస్పష్టమని వ్యాఖ్యానించారు. కోర్టు స్టే విధించిన నేపథ్యంలో.. ఆగస్టు వరకు జాధవ్‌కు మరణశిక్ష అమలుచేయమని, కానీ ఆ తర్వాత ఏం జరుగుతుందో భరోసా ఇవ్వలేమని పాకిస్తాన్‌ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. కాగా.. జాధవ్‌కు మరణశిక్ష అమలుకాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అంతకుముందే పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కు ఐసీజే లేఖ రాసింది.

సుష్మా చొరవ భేష్‌!
ఐసీజే తీర్పుపై ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ అంశంలో కీలకంగా వ్యవహరించి భారత్‌ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది హరీశ్‌ సాల్వేను అభినందించారు. కుల్‌భూషణ్‌ జాధవ్‌ను కాపాడటంలో ప్రతి చిన్న అవకాశాన్నీ వినియోగించుకుంటామని సుష్మాస్వరాజ్‌ ట్వీటర్‌లో ట్వీట్‌ చేయగా.. మోదీ దానిని రీట్వీట్‌ చేశారు. ‘‘పాకిస్తాన్‌ తప్పు చేసినట్లు తేలిపోయింది. వియన్నా ఒప్పందం ప్రకారం వారు జాధవ్‌కు దౌత్య సాయం అందించాల్సిందే..’’అని మోదీ పేర్కొన్నారు. ఇక కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ కూడా ఐసీజే తీర్పును స్వాగతించారు. భారతీయులంతా ఈ తీర్పుపై ఆనందంగా ఉన్నారని, ఈ కేసులో సుష్మా వ్యవహరించిన తీరు ప్రశంసనీయమని అభినందించారు. న్యాయవ్యవస్థ పేరుతో పాక్‌లో జరుగుతున్న అపహాస్యానికి ఈ తీర్పు ఎదురుదెబ్బ అని కేంద్ర ఆర్థిక, రక్షణ శాఖల మంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. పాక్‌ ఐసీజే తీర్పును అంగీకరించబోమంటే అది అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనే అవుతుందని... ఆ దేశం తనను తాను మరింత తప్పులోకి నెట్టేసుకున్నట్లేనని చెప్పారు. వెంకయ్యనాయుడు సహా పలువురు కేంద్ర మంత్రులు కూడా ఐసీజే తీర్పును స్వాగతించారు. ఇది భారత్‌కు గొప్ప విజయమని వ్యాఖ్యానించారు. ఇక కోర్టు తీర్పు ఉత్తేజాన్ని, ధైర్యాన్ని కల్పించిందని సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే చెప్పారు. ‘40 ఏళ్లుగా న్యాయవాదిగా ఉన్నాను. న్యాయమూర్తులు ఎలా స్పందిస్తారో అర్థమవుతుంది. కేసు వాదిస్తున్నప్పుడే పాజిటివ్‌గా అనిపించింది. ఆ పాజిటివ్‌ శక్తే న్యాయమూర్తులతో అనుసంధానం చేసింది’అని పేర్కొన్నారు.

జాధవ్‌ మిత్రుల సంబరాలు
జాధవ్‌ మరణశిక్షపై ఐసీజే స్టే విధించటంతో జాధవ్‌ మిత్రులు సంబరాలు చేసుకున్నారు. ముంబైలో లోయర్‌ పరేల్‌లోని సిల్వర్‌ ఓక్‌ అపార్ట్‌మెంట్‌ వద్ద టపాసులు కాల్చి హర్షం వ్యక్తం చేశారు. భారత్‌ మాతాకీ జై, వందేమాతరం నినాదాలు చేశారు. ‘125 కోట్ల భారతీయుల ప్రార్థనలు ఫలించాయి. ఐసీజేకు ధన్యవాదాలు’అని జాధవ్‌ బాల్యమిత్రుడొకరు పేర్కొన్నారు. జాధవ్‌ క్షేమంగా తిరిగొస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆ తీర్పును అంగీకరించబోం: పాక్‌
అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పుపై పాకిస్థాన్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆ తీర్పు తమను షాక్‌కు గురిచేసిందని.. తమ దేశ భద్రతకు సంబంధించిన ఈ విషయంలో ఐసీజే తీర్పును అంగీకరించడం లేదని పేర్కొంది. జాధవ్‌ కేసును అంతర్జాతీయ న్యాయస్థానానికి తీసుకెళ్లడం ద్వారా అసలురంగు బయటపడకుండా భారత్‌ జాగ్రత్తపడుతోందని పాక్‌ విదేశాంగ అధికార ప్రతినిధి నఫీస్‌ జకారియా విమర్శించారు. ‘‘భారత్‌ పాక్‌లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, వారికి ఆర్థికసాయం చేస్తున్నట్లు స్పష్టమైంది. ఈ అంశంపై చర్చ జరగకుండా ఉండేందుకే జాధవ్‌ కేసులో మానవ హక్కుల ఉల్లంఘనను తెరపైకి తెచ్చింది..’’అని వ్యాఖ్యానించారు. ఇక జాధవ్‌ మరణశిక్ష అమలుపై స్టే విధించే హక్కు ఐసీజేకు లేదని పాక్‌ న్యాయనిపుణులు అభిప్రాయపడ్డారు. ఐసీజేలో పాకిస్తాన్‌ వాదన సరిగా లేకపోవడమే పాక్‌కు వ్యతిరేకంగా తీర్పు రావటానికి కారణమైందని పేర్కొన్నారు. ‘‘జాధవ్‌ కేసును వాదిస్తున్న న్యాయవాదులకు కనీస అనుభవం లేదు. కోర్టు ఇచ్చిన 90 నిమిషాల్లో సరైన వాదనలు వినిపించలేక పోయారు. పాక్‌ వాదనలో పసలేదు.’’అని ఆ దేశ మాజీ అటార్నీ జనరల్‌ ఇర్ఫాన్‌ ఖాదిర్‌ వ్యాఖ్యానించారు.


కోర్టులో విచారణ తీరు ఇలా...
భారతీయ నావికాదళ మాజీ అధికారి కులభూషణ్‌జాధవ్‌ విషయంలో పాకిస్తాన్‌ వెలిబుచ్చిన అభ్యంతరాలను అంతర్జాతీయ న్యాయస్థానం హేతుబద్ధమైన వాదనలతో తిప్పికొట్టింది.

అదెలా సాగిందంటే...
♦ అంతర్జాతీయ న్యాయస్థానం ముందుగా తనకు ఈ కేసును విచారించే పరిధి ఉందా? లేదా? అన్న అంశాన్ని చేపట్టింది. వియన్నా ఒప్పందం ఆప్షనల్‌ ప్రొటోకాల్‌ ఆర్టికల్‌ ఒకటి ప్రకారం... ఒప్పందం అమలులో ఏర్పడే వివాదాలపై కూడా విచారించే పరిధి ఐసీజేకు ఉంటుంది. భారత్‌ ఇందుకు అంగీకరిస్తే... పాక్‌ విభేదించింది. అయితే జాధవ్‌ అరెస్ట్‌ విషయాన్ని పాక్‌ తమకు తెలపలేదని, అతడితో మాట్లాడేందుకు దౌత్యవేత్తలనూ అనుమతించలేదని భారత్‌ చెప్పడాన్ని పరిగణలోకి తీసుకుంటే ఈ విషయంలో వివాదమున్నట్లు స్పష్టమవుతోంది. కాబట్టి ఈ కేసును విచారించే పరిధి తమకు ఉన్నట్లేనని ఐసీజే స్పష్టం చేసింది.

♦ పాకిస్తాన్‌ దౌత్య పరంగా తమ హక్కులను ఉల్లంఘించిందన్న భారత్‌ ఆరోపణలు ఆమోదయోగ్యమైనవేనని ఐసీజే స్పష్టం చేసింది. ఇతర దేశాల పౌరులను అరెస్ట్‌ చేసినప్పుడు ఆ విషయాన్ని వీలైనంత తొందరగా ఆ దేశ దౌత్య కార్యాలయానికి తెలపడం, దౌత్య సిబ్బందితో మాట్లాడే అవకాశం కల్పించడం అనేవి పౌరుడిని అరెస్ట్‌ చేసిన దేశం బాధ్యతలు. జాధవ్‌ విషయంలో పాక్‌ వీటిని అమలు చేయకపోవడం భారత్‌కు ఉన్న హక్కులను ఉల్లంఘించడమే.

♦ జాదవ్‌కు ఉరిశిక్ష విధించారనీ, దీన్ని ఎప్పుడైనా అమలు చేయవచ్చునన్న అంశం ఈ కేసును అత్యవసరంగా పరిష్కరించాల్సిన అవసరాన్ని చెబుతోందని ఐసీజే తెలిపింది. ఈ ఏడాది ఆగస్టులోపు అతడిని ఉరితీయబోమని పాకిస్తాన్‌ పరోక్షంగా సూచించినప్పటికీ ఆ తరువాత ఎప్పుడైనా శిక్ష అమలు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో కేసును అత్యవసరంగా విచారించి తీర్పునిస్తున్నట్లు ఐసీజే తెలిపింది. విచారణ ఆలస్యమైతే సరిదిద్దలేని అన్యాయం జరిగే అవకాశముందని అభిప్రాయపడింది.

>
మరిన్ని వార్తలు