'ఆ జట్లు సెమీస్‌కు వస్తాయని అనుకోలేదు'

13 Jun, 2017 17:51 IST|Sakshi
'ఆ జట్లు సెమీస్‌కు వస్తాయని అనుకోలేదు'

చాంపియన్స్‌ ట్రోఫీలో శ్రీలంకపై అనూహ్య విజయం సాధించిన పాకిస్థాన్‌ జట్టు సెమీస్‌కు చేరుకోవడంపై కుమార సంగక్కర ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కీలకమైన ఈ మ్యాచ్‌లో లంక జట్టు పలు పొరపాట్లు చేసిందని ఆ జట్టు మాజీ ఆటగాడైన సంగక్కర అభిప్రాయపడ్డాడు. చాంపియన్స్‌ ట్రోఫీలో ఆసియాకు చెందిన మూడు జట్లు టాప్‌-4లో ఉన్నాయని, టోర్నమెంటుకు ముందు ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించి ఉండరని అన్నారు. బంగ్లాదేశ్, పాకిస్థాన్‌ జట్లు సెమీఫైనల్‌కు చేరుతాయని తాను అనుకోలేదని, కానీ అద్భుతంగా ఆడి ఆ జట్లు ఈ ఘనత సాధించాయని, చక్కని క్రికెట్‌ ఆడి సెమీస్‌కు చేరిన ఘనత వాటికి దక్కుతుందని అన్నాడు.

చాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా సోమవారం జరిగిన ఈ గ్రూప్‌ ‘బి’ మ్యాచ్‌లో పాక్‌ 3 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 49.2 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. ఓపెనర్‌ డిక్‌వెల్లా (86 బంతుల్లో 73; 4 ఫోర్లు), మ్యాథ్యూస్‌ (54 బంతుల్లో 39; 2 ఫోర్లు, 1 సిక్స్‌) మాత్రమే రాణించగలిగారు. పేసర్లు జునైద్‌ ఖాన్, హసన్‌ అలీలకు మూడేసి, ఆమిర్, అష్రాఫ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పాక్‌ 44.5 ఓవర్లలో 7 వికెట్లకు 237 పరుగులు చేసింది. లక్ష్యఛేదన సందర్భంగా పాకిస్థాన్‌ ఓ దశలో స్కోరు 162/7తో వెనుకబడటంతో... ఇక శ్రీలంక గెలుపు ఖాయమే అని అంతా భావించారు. కానీ, కెప్టెన్‌ సర్ఫరాజ్‌ (79 బంతుల్లో 61 నాటౌట్‌; 5 ఫోర్లు), ఆమిర్‌ (43 బంతుల్లో 28 నాటౌట్‌; 1 ఫోర్‌) పట్టువదలని పోరాటం ఆ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించింది. పాక్‌ బ్యాట్స్‌మెన్‌ ఫఖర్‌ జమాన్‌ (36 బంతుల్లో 50; 8 ఫోర్లు, 1 సిక్స్‌), అజహర్‌ అలీ (50 బంతుల్లో 34; 2 ఫోర్లు, 1 సిక్స్‌) కూడా రాణించారు.

మరిన్ని వార్తలు