టీడీపీలో చేరబోతున్న ప్రధాని మోదీ!?

18 Jan, 2017 15:26 IST|Sakshi
టీడీపీలో చేరబోతున్న ప్రధాని మోదీ!?
కొన్ని వదంతులు పదేపదే ప్రచారమవ్వడం ఎవరికైనా చీకాకు పరుస్తుంది. అలాంటి వదంతే ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) నేత కుమార్‌ విశ్వాస్‌ గురించి మరోసారి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఆప్‌ అధినేత అరవింద్‌ క్రేజీవాల్‌కు అత్యంత నమ్మకస్తుడైన కుమార్‌ విశ్వాస్‌ పార్టీని వీడి.. బీజేపీలోకి జంప్‌ చేయబోతున్నారని, యూపీ ఎన్నికల్లో ఆయన బీజేపీ టికెట్‌ మీద పోటీ చేస్తారని వదంతులు చెలరేగాయి. సోషల్‌ మీడియాలో గుప్పుమన్న ఈ వదంతులు మీడియా కూడా ప్రసారం చేయడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. 
 
ఈ వదంతులను ఇటు ఆప్‌, అటు కుమార్‌ విశ్వాస్‌ వ్యంగ్యంగా తోసిపుచ్చారు. గతంలోనూ బీజేపీలో చేరుతున్నట్టు వచ్చిన వదంతులను సెటైరిస్ట్‌ అయిన కుమార్‌ ఖండించారు. తాజాగా వచ్చిన వదంతులను కూడా ఆయన వెరైటీగా ఖండించారు. ఏకంగా ప్రధాని మోదీ ఏపీ అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ (టీడీపీ)లో చేరబోతున్నారంటూ బీజేపీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

‘విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రధాని మోదీ టీడీపీలో చేరబోతున్నారని తెలిసింది. దీనిని వార్తాకథనంగా ప్రసారం చేయండి. మీలాగే జోక్‌ చేస్తున్నా గైస్‌’ అంటూ కుమార్‌ విశ్వాస్‌ ట్వీట్‌ చేశారు. ప్రధాని మోదీ ’సెన్స్‌ ఆఫ్‌ హ్యుమర్‌’ పెంచుకోమని చెప్తే.. భక్తులు ’సెన్స్‌ ఆఫ్‌ రూమార్‌’ను పెంచుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా మరో అడుగు ముందుకువేసి ప్రధాని మోదీ కాంగ్రెస్‌లో చేరబోతున్నారని, త్వరలోనే రాహుల్‌ను కలుస్తారని వ్యంగ్యంగా అన్నారు. అమిత్‌ షా ఆప్‌లో చేరబోతున్నారా? అంటూ మరో ఢిల్లీ మంత్రి కపిల్‌ మిశ్రా పేర్కొన్నారు.
మరిన్ని వార్తలు