ఇదెక్కడి న్యాయం చంద్రబాబూ: భూమా

11 Jul, 2015 04:36 IST|Sakshi
ఇదెక్కడి న్యాయం చంద్రబాబూ: భూమా

నంద్యాల: ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కో పార్టీకి ఒక్కో విధంగా చట్టాన్ని అమలు చేయాలని చూస్తున్నారని కర్నూలు జిల్లా  నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి విమర్శించారు. ఒకే చట్టాన్ని ఒకే రాష్ట్రంలో ఒక్కో తీరుగా అమలు చేయడం ఎంతరకూ సమంజసమని ప్రశ్నించారు. శుక్రవారం ఆయన నంద్యాలలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను అణగదొక్కడమే లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతున్నారన్నారు.

ఇందులో భాగంగానే తెలంగాణలో శాసనమండలి ఎన్నికల సందర్భంగా రేవంత్‌రెడ్డిని అరెస్ట్ చేస్తే ఎన్నికల సంఘం అనుమతి లేకుండా ఎలా అరెస్ట్ చేశారని ప్రశ్నించారన్నారు. అదే తన విషయానికొచ్చే సరికి ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ ఎలా అరెస్టు చేయించారని అన్నారు. ఏసీబీ కేసులో కీలక నిందితుడిగా ఉన్న సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వీరయ్య ఏపీలో వైద్య చికిత్సలు చేయించుకోవడానికి అనుమతిచ్చిన చంద్రబాబు.. తనకు మాత్రం హైదరాబాద్‌లో చికిత్సలు చేయించుకోవడానికి అనుమతి ఇవ్వకపోవడంలోని ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఎమ్మార్వో వనజాక్షిపై దాడి చేస్తే ఇంత వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని అన్నారు.
 
ఎస్పీ నంద్యాలకు వస్తే స్వాగతిస్తా..
జిల్లా ఎస్పీ నంద్యాలకు అధికారిగా వచ్చి ప్రజలకు న్యాయం చేస్తానంటే స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. తాను గాని, తన అనుచరులు గానీ నంద్యాలలో ఎక్కడా అరాచకాలు, అన్యాయాలు చేయడం లేదని.. అందు వల్ల ఎలాంటి అధికారి వచ్చినా భయపడమన్నారు.ఎస్పీకి ప్రస్తుతం సీఎం నుంచి మంచి మార్కులు వచ్చి ఉండొచ్చని, అందువల్ల ఆయన జిల్లాలో ఏ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసినా స్వాగతిస్తానన్నారు.

మరిన్ని వార్తలు