ఆయీయే మేడం..! ఆయీయే..!!

4 Jul, 2016 20:28 IST|Sakshi

హైదరాబాద్: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన లాడ్‌బజార్ పేరు వినగానే ప్రతి ఒక్కరికీ గుర్తుకు వచ్చేది అందమైన గాజులు. సాధారణ రోజుల్లో నిత్యం రద్దీగా ఉండే లాడ్‌బజార్ ప్రస్తుతం రంజాన్ మార్కెట్ సందర్భంగా మరింత బిజీగా మారింది. ప్రత్యేకమైన రంజాన్ ఆఫర్లతో లాడ్‌బజార్‌లోని గాజుల దుకాణదారులు కళకళలాడుతున్నాయి. పండుగ కోసం ముస్లిం మహిళలు రంగురంగుల గాజుల కొనుగోలులో నిమగ్నమయ్యారు. అందుకనే ఎంతో మక్కువగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చి మరీ తమకు కావాల్సిన గాజులను ఇక్కడ ఖరీదు చేస్తుంటారు. ఇది కేవలం నగరానికి, రాష్ట్రానికే పరిమితమైన సంగతి కాదు. ఇతర రాష్ట్రాల నుంచి దేశ విదేశాల నుంచి కూడా మహిళలు లాడ్‌బజార్‌కు వచ్చి తమకు ఇష్టమైన వాటిని ఎంపిక చేసుకొంటారు.



ఇక్కడ పగలూ రాత్రీ ఒక్కటే!
ఇక్కడి రంజాన్ నైట్ బజార్‌లో విద్యుత్ దీపాల కాంతిలో రాత్రి పగలు ఒకేలాగా కనిపిస్తున్నాయి. అద్దాల పెట్టెల్లో ఉన్న రంగు రంగుల రాళ్ల గాజులు ఛమక్‌ఛమక్‌మంటూ మహిళల ముఖాలను మెరిపిస్తూ ఆకట్టుకుంటున్నాయి. ఎన్ని జతల గాజులు చేతికి ఉన్నా.... ఊరిస్తూ మరో జత వేసుకోవాలనిపిస్తుంది లాడ్‌బజార్‌కొస్తే. మెటల్, డైమండ్స్, సీసం, బ్రాస్, ఫైబర్, మిర్రర్, ఎనామిల్... రకరకాల గాజులు. చూసే కొద్ధీ ఏది తీసుకోవాలో తెలియని అయోమయం.... ఆతత... రద్దీ.. కొనుగోలు చేసేవారితో కిటకిటలాడుతుంది లాడ్‌బజార్. చార్మినార్ పడమర వైపు పాదం దగ్గర పుట్టిన ఒక వెలుగుల వీధి లాడ్‌బజార్. తరతరాలుగా భాగ్యనరగం గర్వించదగ్గర రీతిలో ఖ్యాతి గడిస్తుంది ఈ గాజుల బజార్. దక్కను ప్రాంత వాసుల పెన్నిధి అయిన ఈ బజారుకు నాటికీ నేటికీ కూడా మరో ప్రత్యామ్నాయం లేదనే చెప్పాలి.

ఒక్కసారి అడుగు పెడితే చాలు..
ఒక్కసారి లాడ్‌బజార్‌లో అడుగు పెడితే చాలు గంటల తరబడి దుకాణాలను చూస్తూ గడిపేస్తాం. దుకాణాలలోని షోకేజ్‌లలో గల వివిధ రకాలైన గాజులను తనివితీరా చూస్తూ ఉండిపోతారు. ఐదు రూపాయల నుంచి పది వేల రూపాలయ వరకు ఖరీదు చేసే ఇక్కడి గాజులు హిందు, ముస్లిం అనే తారతమ్యం లేకుండా అందరికీ కావాల్సిన డిజైన్‌లలో అందుబాటులో ఉంటాయి. అందుకే వయసుతో నిమిత్తం లేకుండా పెద్దవాళ్లు, యువతు లు, పిల్లలు ఇక్కడి గాజుల పట్ల మోజు పెంచుకుంటూ ఉంటారు.

లాడ్‌బజార్ అంటే..
లాడ్లా అంటే గారాబం. ప్రేమ. అనురాగం. ఉర్దూ భాషలో తమకు ఇష్టమైన వారిని ముఖ్యంగా చిన్నారులను లాడ్లా అని సంబోధిస్తుంటారు. తమ ప్రేమకు, అభిమానానికి గుర్తుగా ఇక్కడ నుంచి కానుకను కొని బహూకరిస్తుండటం వల్ల దీనికి ఈ పేరు వచ్చిందని భావిస్తున్నారు. అంతేకాక తాము ప్రేమించి వారికి లాడ్‌బజార్‌లో ఏవైనా గాజులను ఖరీదు చేసి బహుమతిగా ఇస్తే వారి పట్ల ప్రేమానురాగాలు అధికమౌతాయని కూడా చాలామంది భావిస్తుంటారు. మహ్మద్ కూలీ కుతుబ్‌షా కూడా తాను ప్రేమించిన భాగమతికి ఇక్కడి లాడ్‌బజార్‌లోని గాజుల్నే బహుమతిగా ఇచ్చారని పెద్దలు అంటారు. ఐదవ నవాబ్ మహ్మద్ కూలీ కుతుబ్‌షా 1591-92 కాలంలో చారిత్రాత్మకమైన చార్మినార్‌ను నిర్మించారు. భాగమతిని గాఢంగా ప్రేమించిన ఆయన ఆమె పేరుతోనే హైదరాబాద్ నగరాన్ని కూడా నిర్మించారు. చార్మినార్ నిర్మించాక కాలక్రమేణా గుల్జార్‌హౌజ్ పరిసర ప్రాంతాలలో నివాస స్థలాలు ఏర్పడ్డాయి. ప్రారంభంలో ఒకటి రెండు వ్యాపార సముదాయాలతో ఏర్పడిన గాజుల దుకాణాలు రాను రాను సంఖ్య పెంచుకొని లాడ్‌బజార్‌గా విస్తరించాయి.

అప్పట్లో..
అప్పట్లో చార్మినార్ నుంచి గోల్కొండకు పురానాపూల్ మీదుగా వెళుతుండడంతో, పురానాపూల్‌కు వెళ్లడానికి లాడ్‌బజార్ ప్రధాన రహదారి కావడంతో క్రమంగా ఈ బజార్‌కు ప్రచారం ఏర్పడి మంచి గుర్తింపు లభించింది. ప్రస్తుతం లాడ్‌బజార్‌లో 250 పైగా దుకాణాలు నిత్యం వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తున్నాయి.

లక్షల్లో వ్యాపారం..
లాడ్‌బజార్ దుకాణాల లో ప్రస్తుతం రంజాన్ మార్కెట్ సందర్బంగా రోజుకు సగటున ఒక్కో దుకాణంలో రూ.50 వేలకు పైగా కొనుగోళ్లు జరుగుతున్నాయని మార్కెట్ వర్గాల అంచనా. అంటే అన్ని దుకాణాల లో జరిగే వ్యాపారం కలిపితే రూ. 50 లక్షలకు పైగా ఉంటుందంటున్నారు. ‘ఆయీయో మేడం.....! ఆయీయే....!!’... అంటూ దుకాణాల ముందు నిల్చొని బేర సారాలు....ఒకరికి మించి మరొకరు పిలుపు. రూ.500 చెప్పిన గాజుల జత రూ. 200లకు ఇవ్చొచ్చు...లేదా ఒక్క రూపాయలు కూడా తగ్గకపోవచ్చు. రంజాన్ మాసంలోని చివరి రెండు రోజులు కావడంతో మరింత రద్దీ కనిపిస్తోంది.

మరిన్ని వార్తలు