ఉడీ దాడి ఇలా జరిగింది

22 Sep, 2016 22:33 IST|Sakshi
ఉడీ దాడి ఇలా జరిగింది

ఉడీ: ఉడీ దాడిలో 18మంది జవానులు అమరవీరులు కావడానికి గల కారణాన్ని జాతీయ దర్యాప్తు సంస్ధ(ఎన్ఐఏ) అధికారులు కనుగొన్నారు. క్యాంపు లోపల గల రెండు గార్డు పోస్టుల మధ్య సమన్వయ లోపమే మూల్యం చెల్లించేలా చేసిందని ఎన్ఐఏ నిర్ధారించినట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి విచారణను చేపట్టిన ఎన్ఐఏ బృందం సంబంధిత అంశాలను డాక్యుమెంటేషన్ చేస్తోంది. ఆర్మీ క్యాంపు చుట్టూ ఉన్న ఫెన్సింగ్ లో లోపాలు కూడా ఉగ్రదాడికి ఉపయోగపడినట్లు ఎన్ఐఏ విచారణలో తేలినట్లు తెలిసింది.

పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి నలుగురు ఉగ్రవాదులు సెప్టెంబర్ 16/17 మధ్య రాత్రి హాజీ పీర్ పాస్ గుండా సుఖ్ దార్ గ్రామానికి చేరుకున్నారు. ఎత్తైన ప్రదేశంలో సుఖ్ దార్ గ్రామం నుంచి క్యాంపు డిజైన్, జవానుల కదలికలను గమనించడానికి పుష్కలంగా అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని వినియోగించుకున్న ఉగ్రవాదులకు క్యాంపు ఫెన్సింగ్ కు దగ్గరగా ఉన్న ఎత్తైన గడ్డి వరంలా మారింది.

అదను చూసుకుని గడ్డి చాటున నక్కుతూ ఫెన్సింగ్ ను తొలగించుకుని క్యాంపులోకి చొరబడినట్లు చెప్పారు. సెక్యూరిటీ నిబంధనల ప్రకారం క్యాంపుకు చుట్టూ ఉన్న గడ్డిని ఎప్పటికప్పుడు తొలగించాల్సివున్నా చేయకపోవడం, కీలకమైన ప్రాంతాల్లో భద్రతకు సంబంధించిన పరికరాలను ఉంచకపోవడం కూడా ఉగ్రవాదులకు లాభించింది తెలిపారు. క్యాంపు లోపల రెండు గార్డు పోస్టులు ఉగ్రవాదుల చొరబాటును గుర్తించకలేకపోయాయని చెప్పారు.

దాడికి ముందు ఒక రోజు పాటు ఉడీ పట్టణంలో జరిగిన కాల్ డేటా(సంభాషణలు)వివరాలను జమ్మూకశ్మీర్ పోలీసులు సేకరించినట్లు చెప్పారు.కాల్ డేటా వివరాలను పాక్షికంగా పరీక్షించిన పోలీసులు అనుమానిత కాల్స్ వివరాలను, మరణించిన ఉగ్రవాదుల డీఎన్ఏ రిపోర్టులను ఎన్ఐఏకు అప్పగించినట్లు తెలిపారు. ఉగ్రవాదుల శవాలకు పట్టణానికి దగ్గరలోని శ్మశానంలో అంత్యక్రియలు చేయించినట్లు పేర్కొన్నారు.

చనిపోయిన మిలిటెంట్ల నుంచి స్వాధీనం చేసుకున్ జీపీఎస్ లు, ఆయుధాలను ఎన్ఐఏ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్లు వెల్లడించారు. క్యాంపు నుంచి ఆధారాలు సేకరించిన ఎన్ఐఏ బృందంలో కొందరు క్యాంపు చుట్టుపక్కల గ్రామాల ప్రజలను విచారించనున్నట్లు చెప్పారు. మిలిటెంట్లను గుర్తించిన అనంతరం పాకిస్తాన్ కు అధికారికంగా ఆ వివరాలను పంపనున్నట్లు తెలిపారు.
 

>
మరిన్ని వార్తలు