లడ్డూలు మార్చుకోవడం కుదరదు

13 Dec, 2016 19:20 IST|Sakshi
లడ్డూలు మార్చుకోవడం కుదరదు

న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఏటీఎంల ముందు, బ్యాంకుల ముందు గంటల తరబడి నిలబడుతున్న ప్రజల ఓపికకు మెచ్చుకొని వారికి లడ్డూలు పంచాలని ఢిల్లీలోని బీజేపీ శాఖ నిర్ణయించింది. ప్రతి పార్టీ కార్యకర్త ఇందులో క్రియాశీలకంగా పాల్గొనాలని. జనవరి ఒకటవ తేదీ నుంచి పది తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని ఢిల్లీ బీజేపీ చీఫ్‌ మనోజ్‌ తివారి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఒక ఇంటికి ఒక లడ్డూ లేదా ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని లడ్డూల చొప్పున ఇవ్వాలంటూ ఆయన చేసిన సూచనపై సోషల్‌ మీడియా యూజర్లు తమదైన శైలిలో స్పందించారు.

‘నెలలో నాలుగు లడ్డూలు మాత్రమే ఇస్తారు. పాత వాటితోని కొత్త లడ్డూలు మార్చుకోవడం కుదరదు. పది లడ్డూలకు మించి లడ్డూలుంటే ఐటీ దాడులు జరుగుతాయి...ఏటీఎంల ముందు క్యూలో నిలబడితే లడ్డూలు ఇస్తారట, వాస్తవానికి రెండు లడ్డూలు వస్తాయి. ఒకటి క్యూలో, మరోటి ఏటీఎం నుంచి....లడ్డూ వ్యాసానికి సరిపడే పరికరాలు ఏటీఎంలో లేవట. వాటన్నింటిని మూసేసి మరమ్మతులకు పంపిస్తారట...డబ్బుకు బదులుగా లడ్డూలు ఇమ్మని తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదంటూ ఆర్బీఐ వివరణ....మొదటి రోజు కుటుంబానికి ఒక లడ్డూ ఇస్తారు. రెండో రోజు మూడు కుటుంబాలకు కలిపి రెండు లడ్డూలు ఇస్తారు. మూడోరోజు ఆప్‌ లడ్డూ కా రహా హై, వా బార్డర్‌ పర్‌....నరేంద్ర మోదీ క్యాష్‌లెస్‌ సొసైటీ కోరుకుంటున్నందున నమో యాప్‌పై డిజిటల్‌ లడ్డూలను పంచుతారు....’ఇలా తమదైన శైలిలో వ్యంగ్యోక్తులు విసురుతున్నారు.
 

మరిన్ని వార్తలు