'ప్రీ యాక్టివేటెడ్' సిమ్ కార్డుల కలకలం

13 Jul, 2016 18:40 IST|Sakshi
‘ప్రీ యాక్టివేటెడ్’కు ఫుల్‌స్టాప్ పడేనా?

సాక్షి, సిటీబ్యూరో:
మూడన్నర నెలల కిందట.. సినిమాల ప్రభావంతో సాయి, రవి, మోహన్ అనే యువకులు పదోతరగతి విద్యార్థి అభయ్‌ను కిడ్నాప్ చేసి, అతని తల్లిదండ్రుల నుంచి డబ్బు గుంజాలనుకున్నారు. పథకం ప్రకారం బేగంబజార్ ప్రాంతం నుంచి రెండు ప్రీ-యాక్టివేటెడ్ సిమ్‌కార్డులు కొన్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద మరో రెండు ఖరీదు చేశారు. ఈ సిమ్స్ అన్నీ వేరే వ్యక్తుల పేర్లు, గుర్తింపుతో ఉన్నవే. ఆ సిమ్ కార్డుల నుంచే కిడ్నాపర్లు అభయ్ కుటుంబీకులతో బేరాలాడారు. తర్వాత ఆ కిడ్నాప్ హత్యోదంగా మారిన సంగతి తెలిసిందే. నాటి కేసు దర్యాప్తు క్లిష్టంగా మారడానికి ప్రీయాక్టివేటెడ్ సిమ్ కార్డులూ ఓ కారణం.

గత నెలలో.. జేకేబీహెచ్ పేరుతో హైదరాబాద్‌తో పాటు దేశ వ్యాప్తంగా విధ్వంసాలకు కుట్రపన్నిన ఐదుగురు అనుమానిత ఉగ్రవాదుల్ని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అదుపుతోకి తీసుకుంది. కుట్రలు అమలు చేయడంలో భాగంగా వారు సంప్రదింపులు జరుపుకోవడానికి ప్రీ-యాక్టివేటెడ్ సిమ్‌కార్డుల్నే వినియోగించారు. ముఠాలో కీలక వ్యక్తి అయిన ఫహద్ దగ్గర తొమ్మిది ప్రీ యాక్టివేటెడ్ సిమ్ కార్డులు లభించాయి. చార్మినార్ బస్టాప్ ఎదురుగా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఔట్‌లెట్‌లో వాటిని ఖరీదేచేశారని ఎన్‌ఐఏ గుర్తించింది.

నగరంలో యథేచ్ఛగా లభిస్తున్న ప్రీ-యాక్టివేటెడ్ సిమ్‌కార్డుల దుర్వినియోగానికి మచ్చుతునకలివి. పెద్ద సంఘటనలు కాబట్టి కొన్ని పోలీస్ రికార్డులకు వస్తున్నాయిగానీ ఈ తరహా సిమ్ కార్డులతో జరుగుతోన్న నేరాలుఘోరాలకు ఎన్నో! అసాంఘిక శక్తులకు బాగా ఉపయోగపడుతున్న ఈ దందాకు చెక్ పెట్టడంలో పోలీసు విభాగం విఫలమవుతోంది. కనెక్షన్లు పెంచుకుంటూ ధనార్జనే ధ్యేయంగా పని చేస్తున్న సర్వీసు ప్రొవైడర్లూ ఈ విషయాన్ని పట్టించుకోవట్లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నిబంధనలు పట్టించుకోని ఔట్‌లెట్స్...
సెల్‌ఫోన్ వినియోగదారుడు ఏ సర్వీసు ప్రొవైడర్ నుంచి అయినా సిమ్‌కార్డు తీసుకోవాలంటే ఫొటోతో పాటు గుర్తింపు, నివాస ధ్రువీకరణ పత్రాలు కచ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (డీఓటీ) నిబంధనలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. సిమ్‌కార్డులు దుర్వినియోగం కాకుండా, నేరగాళ్లకు ఉపయుక్తంగా ఉండకూడదనే ఈ నిబంధనల్ని రూపొందించారు. ప్రస్తుతం నగరానికి చెందిన అనేక మంది సిమ్‌కార్డ్స్ రిటైలర్లు, తాత్కాలిక ఔట్‌లెట్ నిర్వాహకులు తమ దగ్గరకు సిమ్‌కార్డుల కోసం వచ్చే సాధారణ కస్టమర్ల నుంచి గుర్తింపులు తీసుకుని సిమ్‌కార్డు విక్రయదారులు ఇస్తున్నారు. పనిలో పనిగా వారికి తెలియకుండా స్కానింగ్, జిరాక్సు ద్వారా ఆయా గుర్తింపుల్ని పదుల సంఖ్యలో కాపీలు తీస్తున్నారని స్పష్టమవుతోంది. వీటి ఆధారంగా ఒక్కో వినియోగదారుడి పేరుతో 100 నుంచి 150 సిమ్‌కార్డులు (కనెక్షన్లు) ముందే యాక్టివేట్ చేస్తున్నారు. ఇది డీఓటీ నిబంధనలకు పూర్తి విరుద్ధమైన అంశం.

అనారోగ్యకర పోటీ నేపథ్యంలో...
ఈ ప్రీ-యాక్టివేటెడ్ సిమ్‌కార్డుల దందా సర్వీసు ప్రొవైడర్ల మధ్య ఉన్న అనారోగ్యకర పోటీతో మరింత పెరిగింది. రిటైలర్లతో పాటు సిమ్‌కార్డుల డిస్ట్రిబ్యూటర్లు సైతం ఈ వ్యవహారాన్ని జోరుగా సాగిస్తుండటంతో అనామకులు, నేరగాళ్ల చేతికి సిమ్స్ చేరుతున్నాయి. రిటైలర్లు, డిస్ట్రిబ్యూటర్ల నుంచి వచ్చే సిమ్‌కార్డు దరఖాస్తులను పూర్తిస్థాయిలో సరిచూసి, అనుమానాస్పదమైన వాటి యాక్టివేషన్‌ను 24 గంటల్లో కట్ చేయాల్సిన బాధ్యత సర్వీస్ ప్రొవైడర్లపై ఉన్నప్పటికీ వారు కూడా నిర్లక్ష్యం వహిస్తూ టార్గెట్లు ఇచ్చి మరీ ప్రీ-యాక్టివేటెడ్ కార్డులు విక్రయానికి ప్రోత్సహిస్తున్నారనే అనుమానం వ్యక్తంమవుతున్నాయి. సర్వీసు ప్రొవైడర్ల మధ్య నెలకొన్న అనారోగ్యకర పోటీనే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

నామ్‌కే వాస్తే చర్యలతో హడావుడి...
దేశ భద్రతను పెనుముప్పుగా మారడంతో పాటు నేరగాళ్లకు కలిసి వస్తున్న ప్రీ-యాక్టివేటెడ్ సిమ్‌కార్డుల వ్యాపారం నగరంలో జోరుగా సాగుతోంది. అభయ్ కేసులో నిందితుల్ని అరెస్టు చేసినప్పుడు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంటామని పోలీసులు ప్రకటించారు. ఆ వ్యవహారాలు సాగిస్తున్న వ్యక్తులు, ముఠాలపై స్పెషల్‌డ్రై వ్స్ చేపడతామనీ పేర్కొన్నారు. అన్నప్రకారమే నాలుగైదు రోజుల పాటు శాంతిభద్రతల విభాగం అధికారులతో పాటు ప్రత్యేక విభాగాలూ రంగంలోకి దిగాయి. సెల్‌ఫోన్ దుకాణాలు, సర్వీస్ ప్రొవైడర్లకు చెందిన తాత్కాలిక ఔట్‌లెట్స్‌లో వరుస తనిఖీలు చేశాయి. ఈ ‘స్పెషల్ డ్రై వ్’లో ఎంతమంది అవకతవకలకు పాల్పడుతున్నట్లు గుర్తించారో తెలియదు కానీ... వారం రోజులకే ఈ విషయాన్ని పోలీసులు మర్చిపోయారు. యథాప్రకారం అధికారులు తమ రోటీన్ విధుల్లో నిమగ్నం కాగా అక్రమార్కులు తమ దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు.

ఫీల్డ్ వెరిఫికేషన్ ఎందుకు ఉండట్లేదు?
కేవలం గుర్తింపులు తీసుకుని సిమ్‌కార్డ్స్ ఇచ్చే విధానం అమలైనా పూర్తి స్థాయి ఫలితాలు ఉండవన్నది సుస్పష్టం. ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న బోగస్ ధ్రువీకరణల్ని తీసుకువచ్చే నేరగాళ్లు వాటి ఆధారంగా సిమ్‌కార్డుల్ని తేలిగ్గా పొందవచ్చు. ఈ దందాను అరికట్టాలంటే సిమ్‌కార్డ్ జారీ తర్వాత, యాక్టివేషన్‌కు ముందు సర్వీస్ ప్రొవైడర్లు కచ్చితంగా ఫీల్డ్ వెరిఫికేషన్ చేసే విధానం ఉండాల్సిందే. పోస్ట్‌పెయిడ్ కనెన్షన్ మాదిరిగానే ప్రీ-పెయిడ్‌ను పూర్తిస్థాయిలో వెరిఫై చేసిన తరవాత యాక్టివేట్ చేసేలా ఉంటేనే ఫలితాలు ఉంటాయి. క్షేత్రస్థాయిలో జరుగుతున్న అవకతవకల్ని డీఓటీ ద ష్టికి తీసుకువెళ్లడం ద్వారా బాధ్యులైన సర్వీసు ప్రొవైడర్లకు షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో పాటు భారీగా పెనాల్టీలు విధించడం, అవసరమైతే లెసైన్సులు రద్దు చేసే దిశలో పోలీసులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

>
మరిన్ని వార్తలు