కర్నూలులో ‘ జై సమైక్యాంధ్ర’ అన్న లక్ష గొంతుకలు

23 Aug, 2013 02:58 IST|Sakshi

తాడేపల్లిగూడెంలో నాగళ్లతో రోడ్డెక్కిన రైతన్న
అనంతపురంలో న్యాయవాదుల 48 గంటల నిరశన
శ్రీకాకుళంలో విద్యుత్ ఉద్యోగులచే  హైవే దిగ్బంధం
రాజమండ్రిలో 33 మంది మున్సిపల్ కమిషనర్ల సమావేశం

సాక్షి నెట్‌వర్క్: సమైక్యాంధ్ర కోసం 23 వ రోజూ నిరసనలు, ర్యాలీలు, మావనహారాలతో సీమాంధ్ర జనసంద్రమైంది. లక్షల గొంతుకలు జై సమైక్యాంధ్ర అంటూ గళమెత్తి ఘోషించాయి. ఉద్యమంలో ఊపుతీసుకువచ్చిన వైఎస్సార్ సీపీ నాయకులు చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షలకు మద్దతుగా అనేకచోట్ల నిరాహారదీక్షలు నిర్వహిం చారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని నినదిస్తూ విద్యార్థి, ఉపాధ్యాయ, కార్మిక, కర్షకులు రోడ్లపైకి వచ్చి మానవహారాలు జరిగాయి. ఉపాధ్యాయ ఐక్య కార్యాచరణ సమితి నేతృత్వంలో కర్నూలు రాజ్‌విహార్ సెంటర్‌లో నిర్వహించిన ‘లక్షగళ ఘోష’ కార్యక్రమం విజయవంతమైంది.

 

నగరం, శివారులకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ప్రజాసంఘాల జేఏసీల ఆధ్వర్యంలో లక్ష గొంతుకలతో చేసిన సమైక్యాంధ్ర నినాదం మారుమోగింది. రాజ్‌విహార్  మూడురోడ్ల కూడలి ఎటూ చూసినా జనసంద్రమైంది. విద్యార్థులు రంగురంగుల దుస్తులు ధరించి, సమైక్యాంధ్ర జెండాలు చేత బూనారు. విద్యుత్ ఉద్యోగులు కర్నూలు జాతీయరహదారిని రెండు గంటల పాటు దిగ్భందించారు. అనంతపురం కలెక్టరేట్ మహిళా ఉద్యోగులు ఉపాధ్యాయ జాక్టో,స్వర్ణకారుల సంఘం, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు చేశారు. న్యాయవాదులు 48 గంటల నిరాహార దీక్ష చేపట్టారు.
 
 జెడ్పీ ఉద్యోగులు భిక్షాటన చేశారు. ఎస్కే యూనివర్సిటీలో మంత్రులు శైలజానాథ్, రఘువీరా దిష్టిబొమ్మలు, కళ్యాణదుర్గంలో సోనియాగాంధీ, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ దీక్షకు సంఘీభావంగా కడప జిల్లా వ్యాప్తంగా రిలేదీక్షలు సాగుతున్నాయి. ఉపాధ్యాయులు రోడ్లపైకి చేరి కదం తొక్కారు. రైల్వేకోడూరులో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీని వాసులు దీక్ష ను భగ్నం చేయడాన్ని నిరసిస్తూ బంద్‌ను పాటించారు. బద్వేలులో రెవెన్యూ ఉద్యోగులు భారీ ర్యాలీ తీయగా, రాయచోటిలో రోడ్లన్నీ జనసంద్రమయ్యాయి. చిత్తూరులో ఉన్నతాధికారులు ఉద్యోగులతో కలిసి భారీ ర్యాలీ తీశారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు గాంధీవిగ్రహం వద్ద కోలాటాలు అడగా, మినీలారీ అసోసియేషన్ ర్యాలీ నిర్వహించింది. వీ కోటలో ఆస్పత్రి సిబ్బంది రోగులకు రోడ్డుపైనే చికిత్సలు చేసి నిరసన తెలిపారు. మదనపల్లిలో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, పాఠశాల విద్యార్థులకు రోడ్డుపైనే బోధనలు నిర్వహించారు. చిత్తూరు ఎమ్మెల్యే సీకేబాబు మహాపాదయాత్ర గురువారం చంద్రగిరికి చేరుకుంది. తిరుపతిలో వైఎస్ విజయమ్మ దీక్షకు మద్దతుగా కుప్పం లో వైఎస్‌ఆర్‌సీపీ నేతలు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతోంది.
 
విజయవాడకు విశాలాంధ్ర మహాసభ యాత్ర
 విశాలాంధ్ర మహాసభ బృందం యాత్ర విజయవాడకు చేరిన సందర్భంగా భారీ సభ ఏర్పాటుచేశారు. న్యాయవాదులు, సిబ్బంది గురువారం కూడా కోర్టు గేట్లకు తాళాలు వేసిన  నిరసన తెలిపారు. వెఎస్ విజయమ్మ చేపట్టిన నిరాహారదీక్షకు మద్దతుగా జిల్లాలో పలుచోట్ల రిలే నిరాహార దీక్షలు జరిగాయి. మైలవరంలో బంద్ సంపూర్ణంగా జరిగింది.  గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీర్యాలీలో ఎమ్మెల్యే మేకతోటి సుచరిత పాల్గొన్నారు. తెనాలిలో ఆర్టీసీ కార్మికులు మౌనప్రదర్శన చేయగా, రేపల్లెలో యోగాసనాలతో వినూత్నంగా నిరసన తెలిపారు. తెనాలి, నరసరావుపేట, బాపట్ల, పొన్నూరు, చిలకలూరిపేట, సత్తెనపల్లి, మాచర్లలో వైఎస్‌ఆర్ సీపీ రిలేదీక్షలు కొనసాగాయి.

మంగళగిరిలో విద్యార్థి జేఏసీ సమ్మెకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ఎమ్మెల్యే కాండ్రు కమలను ఆందోళనకారులు చుట్టుముట్టారు. ప్రకాశం జిల్లాలో అటెండర్ స్థాయి ఉద్యోగి నుంచి గెజిటెడ్ అధికారి వరకు అందరూ ఉద్యమ బాట పట్టారు. చీరాలలో ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ 48 గంటల ఆమరణ దీక్షను విరమించారు. నెల్లూరుజిల్లా ఉదయగిరి నియోజకవర్గం బోగ్యం వారిపల్లికి చెందిన యువకుల నిరసన కార్యక్రమాలకు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. విద్యార్థి జేఏసీ, ఎన్‌జీఓ అసోసియేషన్, గెజి టెడ్ ఆఫీసర్స్‌తోపాటు పలు రాజకీయపార్టీలు జిల్లావ్యాప్తంగా రిలే దీక్షలు, ర్యాలీ లు, రాస్తారోకోలు, మానవహారాలు, వంటావార్పు కార్యక్రమాలను పెద్దఎత్తున నిర్వహించారు.
 
నాగళ్లతో రోడ్డెక్కిన రైతన్న
 తాడేపల్లిగూడెంలో వ్యవసాయ అధికారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రైతులు నాగళ్లు చేతబూని, ఎడ్లబండ్లతో ప్రదర్శన చేశారు. నిడదవోలు ఎమ్మెల్యే శేషారావు కుమ్మర్లతో కలసి కుండలు తయారుచేసి నిరసన తెలిపారు. విజయమ్మ దీక్షకు మద్దతుగా  వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు బుట్టాయిగూడెంలో ఒకరోజు రిలేనిరాహార దీక్ష చేపట్టారు. చింతలపూడిలో కర్రా రాజారావు, ధర్మాజీగూడెంలో మట్టా సురేష్, చిన్నం సురేష్ ఆమరణ నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. విశాఖపట్నం జిల్లాలో ఇన్‌చార్జి కలెక్టర్ తప్ప ఇతర ఉద్యోగులంతా రోడ్డెక్కారు. గోపాలపట్నం పరిధిలో ఆర్‌ఆర్ వెంకటాపురంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆధ్వర్యంలో వంటావార్పు, ైబె క్ ర్యాలీ నిర్వహించారు.
 
  వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త గండి బాబ్జీ ఆధ్వర్యంలో వేపగుంటలో బైక్ ర్యాలీ తీశారు. ఏపీఎస్ ఆర్టీసీ ఎన్‌ఎంయూ ర్యాలీగా వెళ్లి మద్దిలపాలెం వద్ద వైఎస్సార్‌సీపీ ముస్లిం నేతలు చేస్తున్న దీక్షలకు సంఘీభావం తెలిపింది. జిల్లాలోని ట్రైబల్ వెల్ఫేర్ ఉపాధ్యాయసంఘం ఆధ్వర్యంలో 11 మండలాల్లో ఉపాధ్యాయులు సమ్మెబాట పట్టారు. శ్రీకాకుళంలో వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బొడ్డేపల్లి పద్మజ ఆమరణ నిరాహారదీక్ష రెండోరోజూ కొనసాగింది. శ్రీకాకుళంలో జాతీయ రహదారిని విద్యుత్‌శాఖ ఉద్యోగులు దిగ్భందించారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘం మానవహారం చేపట్టింది. సీమాంధ్రలోని 33 మునిసిపాలిటీల కమిషనర్లు సమైక్యాంధ్రను కాంక్షిస్తూ రాజమండ్రిలో సమావేశమయ్యారు. కాకినాడలో మహిళా సమాఖ్య సభ్యులు ర్యాలీ తీశారు.
 
  కలెక్టరేట్ ఎదుట జేఏసీ దీక్షలకు తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, ఎమ్మెల్సీలు చైతన్య రాజు, రవికిరణ్ వర్మ సంఘీభావం తెలిపారు. దిండి-చించినాడ వంతెనపై రామరాజులంక గ్రామస్తులు వంటావార్పుతో రాస్తారోకో చేసి ఉభయగోదావరి జిల్లాల మధ్య రాకపోకలను స్తంభింప చేశారు. మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఆధ్వర్యంలో ట్రాక్టర్లతో భారీ ర్యాలీ తీశారు. రాజమండ్రి మోరంపూడి జంక్షన్‌లో వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ చేపట్టిన బస్సు యాత్ర అమలాపురం, పెద్దాపురం నియోజకవర్గాల్లో సాగిం ది.

 

పార్టీ సీజీసీ సభ్యులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, పార్టీజిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి తదితరులు పాల్గొన్నారు. విజయనగరంలో  సమైక్య జేఏసీ ఆధ్వర్యంలో కొందరికి సోనియా, దిగ్విజయ్ సింగ్, బొత్స,కేసీఆర్ మాస్కులు ధరింపజేసి, వారిని చీపుళ్లు, చేటలతో  కొడుతూ రోడ్లపై ఊరేగించారు. సాలూరులో మహిళలు జాతీయ రహదారిపై లలితా సహస్త్రనామ  పారాయణం చేశారు. కరీంనగర్ జిల్లా నుంచి బొబ్బిలిలో నివసిస్తున్న ప్రవీణ్ అనే యువకుడికి... ఇరుప్రాంతాల వారు అన్నదమ్ముల్లా కలిసి ఉండాలని కోరతూ పౌర సన్మానం చేశారు.  
 
 విభజన వేదనతో ఐదుగురు మృతి
 న్యూస్‌లైన్ నెట్‌వర్క్ : విభజన చిచ్చుకు గురువారం ఐదుగురు బలయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు కూసం నాగేంద్ర (50) హైదరాబాద్‌లో ఉంటున్న తన కుమారుడి ఉపాధికి విఘాతం కలుగుతుందనే ఆందోళనతో గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. లింగపాలెం మండలం కె.గోపవరం పరిధిలోని గణపవారిగూడెంకు చెందిన గద్దే ఆశీర్వాదం (32) టీవీలో సమైక్య ఉద్యమ వార్తలు చూస్తూ గుండెపోటుతో మృతి చెందాడు.

 

కృష్ణా జిల్లా నందిగామ మండలం తక్కెళ్లపాడు గ్రామానికి చెందిన అరిగెల ప్రసన్న(23) గురువారం పరిటాల సమీపంలోని 65వ నంబర్ జాతీయ రహదారి పక్కన శ్రీ ఆంజనేయస్వామి విగ్రహం సమీపంలో జై సమైక్యాంధ్ర అంటూ పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాష్ట్ర విభజనను తట్టుకోలేక అనంతపురంజిల్లా ముదిగుబ్బ మండల కేంద్రం లోని గేట్‌కొట్టాలకు చెందిన హైదర్‌వలి (55),ఓడీ చెరువు మండలం జంబులవాండ్లపల్లికి చెందిన జంబుల గంగిరెడ్డి (50) గురువారం గుండెపోటుతో మృతి చెందారు. కాగా, పెద్దపంజాణి మండలం బొమ్మలకుంటకు చెందిన నడిమింటి ఈశ్వరయ్య (44) శరీరంపై కిరోసిన్ పోసుకుని నిప్పం టించుకోబోగా, ఉద్యమకారులు అడ్డుకున్నారు.
 
 ఈ ఘటన చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో చోటుచేసుకుంది. విభజన జరిగితే తనకు వికలాంగుల పింఛన్ రాదేమోనన్న బెంగతో చాగల్లు మండలం ఊనగట్లకు చెందిన కొడమంచిలి శ్రీను ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. పోడూరులో కరెళ్ల సత్యనారాయణ (30) పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విజయమ్మ దీక్షా శిబిరాన్ని సందర్శించిన అనంతరం గుంటూరులోని సంగడికుంట ప్రాంతానికి చెందిన షేక్ అల్లాబక్షు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీక్షా శిబిరం ఎదురుగా ఒంటిపై కిరోసిన్ పోసుకుని ‘జగనన్న బయటకు రావాలి, ప్రజలకు న్యాయం చేయాలి’ అని నినాదాలు చేస్తూ నిప్పంటించుకోబోయాడు. పోలీసులు అప్రమత్తమై అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.
 
 26 నుంచి నేతల ఇళ్లకు సేవలు బంద్
 మున్సిపల్ ఉద్యోగుల సంఘం ప్రకటన
 తిరుపతి, న్యూస్‌లైన్: సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామాలు చేసి ఉద్యమంలోకి రాకపోతే చిత్తూరు జిల్లాలో ప్రజాప్రతినిధుల ఇళ్లకు  తాగునీరు, పారిశుధ్యం, వీధిదీపాలు వంటి సేవలను ఈనెల 26నుంచి నిలిపివేస్తున్నట్లు మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.లోకేశ్వర వర్మ తిరుపతిలో గురువారం ప్రకటించారు. ఈనెల 12 నుంచి సమ్మెబాట పట్టిన మున్సిపల్ ఉద్యోగులు గురువారం ఒంటికాలిపై నిలుచుని నిరసన తెలిపారు.

మరిన్ని వార్తలు