చేతులు కలిపిన ఆర్జేడీ-కాంగ్రెస్

6 Mar, 2014 00:27 IST|Sakshi
గయ: బీహార్లో కాంగ్రెస్-ఆర్జేడీ పొత్తుపై అనిశ్చితికి తెరపడింది. రెండు పార్టీలు రాజీ ధోరణిలో కలసి సాగాలని నిర్ణయానికొచ్చాయి. ఇరు పార్టీల మధ్య పొత్తు ఖరారైనట్లు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ బుధవారం గయలో జరిగిన బహిరంగ సభలో వెల్లడించారు. చర్చలు ముగిశాయని, పొత్తు విషయాన్ని అధికారికంగా వెల్లడిస్తామన్నారు. అలాగే, రెండు రోజుల్లో తమ పార్టీ లోకసభ అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటిస్తామని చెప్పారు.

ఆర్జేడీ వర్గాల సమాచారం ప్రకారం.. కాంగ్రెస్‌కు 12 లోక్‌సభ స్థానాలు, ఎన్సీపీకి ఒక స్థానం ఇచ్చేందుకు అంగీకారం కుదిరినట్లు తెలిసింది. 40 స్థానాలున్న ఈ రాష్ట్రంలో మిగిలిన స్థానాల్లో ఆర్జేడీ పోటీ చేయనుంది. ఇంతకుముందు కాంగ్రెస్‌కు 11 స్థానాలే ఇస్తామని లాలూ బీష్మించుకుని కూర్చున్న విషయం తెలిసిందే. 2009లో లాలూ కాంగ్రెస్‌కు కేవలం 3 స్థానాలే ఇవ్వజూపడంతో పొత్తు సాకారం కాలేదు. ఆ దెబ్బకు లాలూ కూడా చేదు ఫలితాలు చవి చూడడంతో అలాంటి పొరపాటుకు మళ్లీ తావివ్వరాదని ఈసారి ఇచ్చిపుచ్చుకునే ధోరణి అనుసరించినట్లు కనిపిస్తోంది. 
 
లాలూని నోరారా ప్రశంసించిన కాంగ్రెస్
లాలూ ప్రసాద్ తమకు సంపూర్ణ మద్దతునిచ్చే మిత్రుడిగా కాంగ్రెస్ పార్టీ అభివర్ణించింది. పార్లమెంటు లోపల, వెలుపల తమకు పూర్తి మద్దతునిచ్చారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సంజయ్‌జా ఢిల్లీలో మీడియాకు చెప్పారు. ఇరు పార్టీల మధ్య వివాదం లేదని స్పష్టం చేశారు. 
>
మరిన్ని వార్తలు