మీసా భారతిపై మనీలాండరింగ్‌ ఆరోపణలు

14 May, 2017 10:02 IST|Sakshi
మీసా భారతిపై మనీలాండరింగ్‌ ఆరోపణలు

నకిలీ కంపెనీలతో నల్లధనాన్ని తెలుపుగా మార్చారు: సుశీల్‌ మోదీ

పట్నా: ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ కూతురు, రాజ్యసభ సభ్యురాలు మీసా భారతి నకిలీ కంపెనీలు సృష్టించి మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారని బిహార్‌ బీజేపీ సీనియర్‌ నాయకుడు సుశీల్‌ కుమార్‌ మోదీ ఆరోపించారు. అలా ఆమె ఢిల్లీలోని బిజ్వాసాన్‌ ప్రాంతంలో చవకగా ఓ వ్యవసాయ క్షేత్రాన్ని కొన్నారని తెలిపారు. లాలూ కుమారులు, బిహార్‌లో మంత్రులైన తేజస్వి, తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌లు రూ.1000 కో ట్లను అక్రమంగా పోగేశారని సుశీల్‌ ఇంతకు ముందు ఆరోపించారు. మీసా అనుమానాస్పద రీతిలో తన కంపెనీ షేర్లను అమ్మి, తిరిగి కొనుగోలు చేసి నల్ల ధనాన్ని తెలుపుగా మార్చారని వెల్లడించారు.

2008–09లో ఆమె కేవలం రూ.1.41 కోట్లకు కొనుగోలు చేసిన ఫార్మ్‌హౌస్‌ వెల ఇప్పుడు కనీసం రూ.50 కోట్లుంటుందని పేర్కొన్నారు. లాలూ అధికారిక నివాసాన్నే మీసా తన కంపెనీ చిరునామాగా మార్చి, దాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఎన్నికల అఫిడవిట్‌లో కూడా ఆమె తన ఆదాయ వనరులను వెల్లడించలేదని తెలిపారు.

ఈ ఆరోపణలపై ఆర్జేడీ జాతీయ అధికార ప్రతినిధి స్పందిస్తూ... ఏం పనిలేని సుశీల్‌ మోదీ నిరాశ, నిస్పృహలో ఉన్నారని, బీజేపీలో తన ఉనికిని కాపాడుకోవడానికే చాలా ఏళ్ల క్రితం న్యాయంగా జరిగిన వ్యాపార లావాదేవీలను తేవనెత్తుతున్నారని అన్నారు.

మరిన్ని వార్తలు