గతవారం బిజినెస్‌

16 Jan, 2017 01:39 IST|Sakshi
గతవారం బిజినెస్‌

నియామకాలు
టాటా సన్స్‌ చైర్మన్‌గా చంద్రశేఖరన్‌
టాటా సన్స్‌కు కొత్త చైర్మన్‌ ఎంపికయ్యారు. ఇప్పటిదాకా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) సీఈవో, ఎండీగా పనిచేస్తున్న ఎన్‌.చంద్రశేఖరన్‌ను టాటా గ్రూపు కొత్త ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా నియమించారు. ముంబైలో జరిగిన బోర్డు సమావేశంలో నూతన చైర్మన్‌గా ఆయన్ను టాటా సన్స్‌ ఎంపిక చేసింది. చంద్రశేఖరన్‌ ఫిబ్రవరి 21న బాధ్యతలు స్వీకరిస్తారు. ఇక టీసీఎస్‌ నూతన ఎండీ, సీఈవోగా రాజేశ్‌ గోపీనాథన్‌ ఎంపికయ్యారు. అలాగే, కంపెనీ ప్రెసిడెంట్, చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ (సీఎఫ్‌వో)గా ఎన్‌.గణపతి సుబ్రమణ్యం నియమితులయ్యారు.

  అంచనాల్ని మించిన టీసీఎస్‌
దేశీ ఐటీ దిగ్గజం టీసీఎస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో అంచనాల్ని మించి వృద్ధి సాధించింది. క్యూ3లో నికర లాభం 10.9 శాతం ఎగిసి రూ. 6,778 కోట్లకు చేరింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో లాభం రూ.6,110 కోట్లు. తాజా క్యూ3లో మొత్తం ఆదాయం 8.7 శాతం వృద్ధితో రూ.27,364 కోట్ల నుంచి రూ. 29,735 కోట్లకు పెరిగింది. రెండో త్రైమాసికంతో పోలిస్తే నికర లాభం 2.9 శాతం, ఆదాయం 1.5 శాతం మేర పెరిగాయి. నిర్వహణ లాభం రూ. 7,733 కోట్లుగా నమోదైంది. షేరు ఒక్కింటికి రూ. 6.5 మేర డివిడెండ్‌ ఇవ్వనున్నట్లు టీసీఎస్‌ తెలిపింది.

  విమానాల్లో... మహిళలకు మాత్రమే!!
ఎయిర్‌ ఇండియా తాజాగా తన దేశీ విమానాల్లో మహిళల కోసం ఆరు సీట్లను ప్రత్యేకంగా రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది త్వరలోనే అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఇది దేశీ సర్వీసులకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. ఎయిర్‌బస్‌ ఏ320లో ఎకానమీ క్లాస్‌లోని మూడవ వరుసలో ఉన్న ఆరు సీట్లను జనవరి 18 నుంచి మహిళలకు కేటాయించామని ఎయిర్‌ ఇండియా అధికారి చెప్పారు. కుటుంబంతో కలసి ప్రయాణించే మహిళలకు ఈ సౌకర్యం వర్తించదు. ఏవియేషన్‌ పరిశ్రమలో ఇలాంటి సేవలు ప్రారంభించడం ఇదే ప్రథమం.

  దేశవ్యాప్తంగా ఎయిర్‌టెల్‌ బ్యాంక్‌
ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ తాజాగా దేశవ్యాప్తంగా తమ కార్యకలాపాలు విస్తరించింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ వీటిని అధికారికంగా ప్రారంభించారు. గతేడాది నవంబర్‌లో రాజస్థాన్‌లో బ్యాంకింగ్‌ సేవలు ప్రారంభించిన ఎయిర్‌టెల్‌... ఆ తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కి విస్తరించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కార్యకలాపాలు ప్రారంభించింది.   కస్టమర్ల ఫోన్‌ నంబర్‌నే బ్యాంకు ఖాతా నంబరుగా కూడా ఉపయోగించుకోవచ్చని భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ చైర్మన్‌ సునీల్‌ భారతి మిట్టల్‌ చెప్పారు. పొదుపు ఖాతాల్లో డిపాజిట్లపై వార్షికంగా 7.25 శాతం మేర వడ్డీ రేటు ఇస్తున్నట్లు తెలిపారు.

  6 లోగా... 600 కోట్లు కట్టాల్సిందే!
 సహారా చీఫ్‌ సుబ్రతోరాయ్‌ మళ్లీ తీవ్ర ఇబ్బందుల్లో పడుతున్నట్లు కనిపిస్తోంది. పెరోల్‌ పొడిగింపునకు చెల్లించాల్సిన రూ.600 కోట్లను ఫిబ్రవరి 6వ తేదీలోగా చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గడువును ఎంతమాత్రం పొడిగించేది లేదంటూ... డిపాజిట్‌ చేయలేకపోతే జైలుకు వెళ్లక తప్పదని పేర్కొంది.

  మూడేళ్ల కనిష్టానికి రిటైల్‌ ద్రవ్యోల్బణం
వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం డిసెంబర్‌లో మూడేళ్ల కనిష్ట స్థాయి 3.41 శాతానికి పడిపోయింది. అంటే 2015 డిసెంబర్‌లో కొన్ని వస్తువుల బాస్కెట్‌ ధరను 2016 డిసెంబర్‌తో పోలిస్తే... ధరలు 3.41 శాతం పెరిగాయన్నమాట. కాగా 2015 నవంబర్‌లో ఈ రేటు 3.63 శాతంకాగా, 2015 డిసెంబర్‌లో 5.61 శాతం. తాజా గణాంకాలను చూస్తే,... డిసెంబర్‌ నెలలో కొన్ని రంగాలపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం పడి డిమాండ్‌ తగ్గడంతో పాటు కూరగాయల ధరలు తగ్గడం దీనికి ప్రధాన కారణమన్న విశ్లేషణలు ఉన్నాయి.

   వాహన విక్రయాలు ఢమాల్‌
పెద్ద నోట్ల రద్దుతో వాహన పరిశ్రమ కుదేలయ్యింది. దేశంలో కన్సూమర్‌ డిమాండ్‌ను ప్రతిబింబించే వాహన విక్రయాలు డిసెంబర్‌ నెలలో 16 ఏళ్ల కనిష్ట స్థాయికి పతనమయ్యాయి. అంతక్రితం ఏడాది ఇదే నెలతో పోలిస్తే దాదాపు 18.66 శాతం క్షీణించాయి. సియామ్‌ తాజా గణాంకాల్లో ఈ విషయాలను వెల్లడయ్యాయి. తేలికపాటి వాణిజ్య వాహన విభాగాన్ని మినహాయిస్తే (వీటి విక్రయాలు 1.15 శాతం పెరిగాయి).. మిగతా స్కూటర్లు, మోటార్‌సైకిళ్లు, కార్లు.. ఇలా అన్ని విభాగాల్లో విక్రయాలు గత నెల రికార్డ్‌ స్థాయికి పడిపోయాయి.

  క్షీణించిన వ్యాపార విశ్వాసం
దేశంలో వ్యాపార విశ్వాసం క్షీణించింది. 2017 జనవరి–మార్చి క్వార్టర్లో వ్యాపారం మెరుగ్గా వుండబోదన్న అంచనాలు వెలువడ్డాయి. ఈ విశ్వాసం 31 త్రైమాసికాల కనిష్ట స్థాయికి పడింది. కంపెనీలపై నోట్ల రద్దు అంశం తీవ్ర ప్రభావం చూపింది. నగదు కొరతతో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల వల్ల వాటి వ్యాపార విశ్వాసం సన్నగిల్లింది. డన్‌ అండ్‌ బ్రాడ్‌స్ట్రీట్‌ కంపొసైట్‌ బిజినెస్‌ ఆప్టిమిజమ్‌ ఇండెక్స్‌ 2017 తొలి త్రైమాసికంలో 65.4 వద్ద ఉంది. 2016 జనవరి–మార్చి త్రైమాసికంతో పోలిస్తే సూచీలో 23.9 శాతం క్షీణత నమోదయ్యింది.

  ఇండస్‌ఇండ్‌ బ్యాంకు నుంచి మెరుగైన ఫలితాలు
గతేడాది అక్టోబర్‌–డిసెంబర్‌ త్రైమాసికంలో పెద్ద నోట్ల రద్దు వంటి ప్రతికూలతలను తట్టుకుని మరీ ప్రైవేటు రంగ ఇండస్‌ఇండ్‌ బ్యాంకు మెరుగైన ఫలితాలను ప్రకటించింది. బ్యాంకు లాభం 29%     అధికంగా రూ.750.64కోట్లు నమోదైంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో బ్యాంకు లాభం రూ.581 కోట్లే. డీమానిటైజేషన్‌ ప్రభావం అంతగా లేదని బ్యాంకు తెలిపింది.

  ఇన్ఫోసిస్‌ నికర లాభం రూ.3,708 కోట్లు
దేశీ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌ ఫలితాలు ఆకట్టుకున్నప్పటికీ.. ఆదాయ అంచనాలు (గైడెన్స్‌) మాత్రం నిరుత్సాహపరిచాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం(2016–17, క్యూ3)లో కంపెనీ కన్సాలిడేషన్‌ నికర లాభం రూ.3,708 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.3,465 కోట్లతో పోలిస్తే 7 శాతం వృద్ధి చెందింది. ఇక ఆదాయం రూ.15,902 కోట్ల నుంచి రూ.17,273 కోట్లకు ఎగసింది. క్రితం ఏడాది క్యూ3తో పోలిస్తే 8.6 శాతం పెరిగింది.

  ఈ నెల 23 నుంచి బీఎస్‌ఈ ఐపీఓ
బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (బీఎస్‌ఈ) ఐపీఓ (ఇనీషియల్‌ పబ్లిక్‌  ఆఫర్‌) ఈ నెల 23 నుంచి ప్రారంభం కానుంది. రూ.1,500 కోట్లు సమీకరిస్తుందన్న అంచనాలున్న ఈ ఐపీఓ ఈ నెల 25న ముగుస్తుంది. వచ్చే నెల 3న బీఎస్‌ఈ షేర్లు ఎన్‌ఎస్‌ఈలో లిస్ట్‌ అవుతాయని అంచనా. ఈ ఐపీఓలో భాగంగా బీఎస్‌ఈలో వాటాలు ఉన్న సంస్థలు 1.54 కోట్లషేర్లను (దాదాపు 30 శాతం వాటా) ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) విధానంలో విక్రయించనున్నాయి. ఈ షేర్‌ ధర గరిష్టంగా రూ.500 ఉండొచ్చని అంచనా.

  డిసెంబర్‌లో ఎగుమతులు పైకే
ట్రంప్‌ ఎన్నికతో అనిశ్చితిని, దేశీయంగా డీమోనిటైజేషన్‌ను ఎదుర్కొని మరీ దేశీయ ఎగుమతులు వరుసగా నాలుగో నెల డిసెంబర్‌లోనూ వృద్ధి దిశగా పయనించాయి. డిసెంబర్‌ నెలలో 5.72 శాతం వృద్ధితో 23.9 బిలియన్‌ డాలర్ల ఎగుమతులు జరిగాయి. దిగుమతులు సైతం స్వల్పంగా 0.46 శాతం పెరిగాయి. 34.25 బిలియన్‌ డాలర్ల విలువైన దిగుమతులు నమోదయ్యాయి. 2015 డిసెంబర్‌లో వాణిజ్య లోటు 11.5 బిలియన్‌ డాలర్లుగా ఉండగా... గత డిసెంబర్‌లో వాణిజ్య లోటు 10.36 బిలియన్‌ డాలర్లకు పరిమితం అయింది.

డీల్స్‌..
డీపీ వరల్డ్‌ గ్రూప్‌ భారత్‌లో భారీగా పెట్టుబడులు పెట్టనుంది. పోర్ట్, లాజిస్టిక్స్‌ రంగంలో దశలవారీగా వంద కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు డీపీ వరల్డ్‌ గ్రూప్‌ చైర్మన్, సీఈఓ సుల్తాన్‌ అహ్మద్‌ బిన్‌ సులాయేమ్‌ పేర్కొన్నారు.

ఆన్‌లైన్‌ రియల్‌ ఎస్టేట్‌ సర్వీసుల రంగంలో మరో కన్సాలిడేషన్‌ డీల్‌కు తెరతీస్తూ ప్రాప్‌టైగర్‌డాట్‌కామ్, హౌసిం గ్‌డాట్‌కామ్‌ సంస్థలు విలీనం కానున్నాయి. తద్వారా దేశీయంగా అతి పెద్ద ఆన్‌లైన్‌ రియల్టీ సేవల సంస్థ ఆవిర్భవించనుంది. ఇది వ్యాపార కార్యకలాపాల విస్తరణ కోసం 55 మిలియన్‌ డాలర్లు సమీకరించనుంది.

అమెరికా ఫాస్ట్‌ ఫుడ్‌ దిగ్గజం, మెక్‌డొనాల్డ్‌.. చైనా, హాంగ్‌కాంగ్‌ వ్యాపారానికి సంబంధించి నియంత్రిత వాటాను విక్రయించింది. ఈ వాటాను 208 కోట్ల డాలర్లకు చైనా ప్రభుత్వ సంస్థ సిటిక్, కార్లైల్‌ గ్రూప్‌కు అమ్మేశామని మెక్‌డొనాల్డ్‌ తెలిపింది.

మరిన్ని వార్తలు