పీవీ మేధావి.. అంతర్ముఖుడు!

31 Aug, 2015 04:37 IST|Sakshi
పీవీ మేధావి.. అంతర్ముఖుడు!

* తాజా పుస్తకంలో జైరాం రమేశ్ అభివర్ణన
* ఆర్థిక సంస్కరణలు పీవీ, మన్మోహన్‌ల సాహస ఫలితమే

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, ఆయన కేబినెట్లో ఆర్థికమంత్రిగా చేసిన తాజా మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్.. 1991లో మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్న భారత ఆర్థిక రంగ నావను ఒడ్డెక్కించి, ప్రగతి పథం పట్టించిన మేధావులని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి జైరాం రమేశ్ అభివర్ణించారు. చైనాలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభించిన కమ్యూనిస్ట్ నేత డెంగ్ జియావో పింగ్‌తో పీవీని పోలుస్తూ..

‘భారతదేశ డెంగ్ మన పీవీ’ అని ప్రశంసల్లో ముంచెత్తారు. పీవీ హయాంలో వారిద్దరితో అత్యంత సన్నిహితంగా మెలిగిన, వారితో కలిసి పనిచేసిన జైరాం రమేశ్.. నాటి తన అనుభవాలను ‘టు ది బ్రింక్ అండ్ బ్యాక్- ఇండియాస్ 1991 స్టోరీ’ అనే రచన ద్వారా గ్రంథస్తం చేశారు.  పీవీని చాలా విషయాలు తెలిసిన, సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోగల ఒక తెలివైన నక్కగా.. మన్మోహన్ సింగ్‌ను ఒకే ఒక్క అంశంపై లోతైన అవగాహన ఉన్న ఓ హెజ్‌హాగ్(ప్రమాదం ఎదురైనప్పుడు తనలో తనే ముడుచుకుపోయి, బంతిలా మారే ముళ్లపందిలాంటి జంతువు)గా జైరాం రమేశ్ అభివర్ణించారు.

మన్మో హన్‌సింగ్ కేవలం ఆర్థిక సంస్కరణల నిపుణుడు కాగా, పీవీ అనేక అంశాల్లో అవగాహన ఉందని, వారిద్దరు కలిసి దేశంలో ఆర్థిక సంస్కరణలను విజయవంతంగా అమలు చేశారని వివరించారు. నిర్ణయాలు తీసుకోవడంలో విపరీతమైన జాప్యం చేస్తారన్న పేరున్న పీవీ నరసింహరావు.. 1991లో భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో అత్యంత నిర్ణయాత్మకంగా వ్యవహరించారని, ముఖ్యంగా మన్మోహన్ సింగ్ సహకారంతో 1991 జూన్, జులై, ఆగస్ట్ నెలల్లో ఆయన పాలన అత్యంత సాహసోపేతంగా సాగిందని ప్రశంసించారు. ‘వాస్తవానికి పీవీ ఒంటరివాడు. అంతర్ముఖుడు. సంబంధాలు కలుపుకోవడంలో, పరిచయాలు పెంచుకోవడంలో పెద్దగా ఆసక్తి, అభినివేశం ఉన్నవాడు కాదు. అన్నిటికన్నా ముఖ్యంగా గోప్యత పాటించడంలో ఆయన మేటి’ అని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు