బెట్టింగ్‌ను చట్టబద్ధం చేయొచ్చా?

31 May, 2017 11:36 IST|Sakshi

ప్రజాభిప్రాయం కోరిన న్యాయ కమిషన్‌

న్యూఢిల్లీ: బెట్టింగ్, జూదాలను చట్టబద్ధం చేయొచ్చో లేదో తెలపాలని న్యాయ కమిషన్‌ ప్రజలను కోరింది. వీటిని చట్టబద్ధం చేస్తే దేశంలో అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట పడుతుందో లేదో కూడా తెలపాలంది. బెట్టింగ్, జూదాలకు లైసెన్స్‌ ఇస్తే ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందా? కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుందా?  లాంటి విషయాలను ప్రజాభిప్రాయం ద్వారా తెలుసుకోవాలనుకుంటోంది. మన దేశంలో జూదం, బెట్టింగ్‌లను చట్టబద్ధం చేయడం ఎంత వరకు నైతికంగా సరైందని ప్రశ్నించింది.

‘ఇలాంటి కార్యకలాపాల్లో పాల్గొనేవారు దివాలాతీయకుండా కాపాడేందుకు ఉన్న మార్గం ఏంటి? ఒకవేళ వీటిని చట్టబద్ధం చేస్తే విదేశీ కంపెనీలను భారత్‌లోకి అనుమతించాలా?’ అని కమిషన్‌ అడిగింది. బీసీసీఐ వర్సెస్‌ బిహార్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ కేసును విచారిస్తూ, బెట్టింగ్‌ను చట్టబద్ధం చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని 2016లో సుప్రీంకోర్టు, న్యాయ కమిషన్‌ను ఆదేశించింది.

మరిన్ని వార్తలు