కార్పొరేట్ కంపెనీల్లో ‘లీవ్ ట్రెండ్’

10 Aug, 2015 16:41 IST|Sakshi
కార్పొరేట్ కంపెనీల్లో ‘లీవ్ ట్రెండ్’

న్యూఢిల్లీ: ‘చెట్టు లెక్కగలవా...ఓ నరహరి! పుట్టలెక్కగలవా!...చెట్టు లెక్కగలనే...ఓ చెంచిత! పుట్ట లెక్కగలనే!’ అనే ట్రెండ్ కాస్త ‘లీవు పెట్టగలవా...ఓ నరహరి! సినిమా తీసుకెళ్లగలవా!...లీవు పెట్టగలనే ఓ చెంచిత! సినిమా తీసుకెళ్లగలనే’గా ఉద్యోగుల ట్రెండ్ మారిపోవడంతో ఉద్యోగుల సెలవుల విషయంలో కార్పొరేట్ సంస్థల వైఖరిలోనూ ఎంతో మార్పు వచ్చింది. పలు కార్పొరేట్ కంపెనీలు, ముఖ్యంగా మల్టీ నేషనల్ కంపెనీలు ఉద్యోగులకు ఉదారంగా సెలవులు మంజూరు చేస్తున్నాయి.

గత మార్చి నెలలో ఆస్ట్రేలియా, భారత్ క్రికెట్ జట్ల మధ్య కీలకమైన సెమీ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఆ మ్యాచ్‌ను టీవీలో చూసేందుకు ఎక్కువ మంది ఉద్యోగులు సెలవు పెట్టే అవకాశం ఉందన్న విషయాన్ని ముందుగానే గ్రహించిన ఫైనాన్సియల్ సర్వీసెస్, కార్పొరేట్ గవర్నెస్‌లో పేరుపొందిన కంపెనీ ‘కేపీఎంజీ’, ట్రావెల్ పోర్టల్ ‘మేక్‌మైట్రిప్’ కంపెనీలు ఆ రోజును సెలవు దినంగా ప్రకటించాయి. సంస్థ కార్యకలాపాలకు ఇబ్బంది కలుగకుండా ముందుగానే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకొన్నాయి. మరికొన్ని కంపెనీలు ఉద్యోగులు టీవీ మ్యాచ్‌ను తిలకించేందుకు కార్యాలయంలోనే బిగ్ స్క్రీన్లను ఏర్పాటు చేయడమే కాకుండా ఉచితంగా స్నాక్స్ కూడా సరఫరా చేశాయి.

మొన్నటి వరకు వీకెండ్ హాలీడేస్‌ను పొడిగిస్తే ఆ హాలీడేస్‌ను కూడా వ్యక్తిగత సెలవులుగా పరిగణించిన కంపెనీలు ఇప్పుడు వీకెండ్ హాలీడేస్‌కు ముందూ, వెనకా ఉద్యోగులు సెలవులు పెట్టినా, వాటిని వ్యక్తిగత సెలవు దినాలుగా పరిగణించడం లేదు. ఐచ్ఛిక సెలవుల(క్యాజువల్ లీవ్స్)ను ఇతర సెలవులతో కలపకూడదనే నిబంధనలను కూడా ఎత్తివేశాయి. కొన్ని కంపెనీలు మెటర్నటీ, పెటర్నిటీ సెలవులను ఏకంగా ఏడాదికి పెంచేశాయి. మరికొన్ని కంపెనీలు ఆఫీసుల్లో ఎనిమిది గంటలు పనిచేయడానికి బదులుగా ఇంటి నుంచి నాలుగు గంటలు పనిచేసే వెసలుబాటును కల్పిస్తున్నాయి.

ఇంకొన్ని కంపెనీలు ఉద్యోగుల‘లీవ్ పూల్’ను ఏర్పాటు చేశాయి. ఎక్సెస్ సెలవులున్నవారు తమ సహచరుల అవసరార్థం వారి సెలవులను ఈ లీవ్ పూల్‌కు సరెండ ర్ చేసే వెసలుబాటును కల్పించాయి. వేతనం రాని సెలవుల కింద ఒకే సారి ఏడాది పాటు సెలవు పెట్టుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. సెలవులపై పూర్తిగా ఆంక్షలు ఎత్తివేసిన కంపెనీలు కూడా ఉన్నాయి. పరిమితికి మించి సెలవులు పెడితే వేతనాల్లో కోత విధిస్తారుగానీ ఉద్యోగానికి ఏ ఢోకా ఉండదన్నమాట.

వీడియో స్ట్రీమింగ్ కంపెనీ ‘నెట్‌ఫిక్స్’ మెటర్నటీ, పెటర్నిటీ లీవ్‌ను అన్‌లిమిటెడ్ చేసింది. పరిమిత రోజుల వరకు వేతనంతో కూడిన సెలవులు ఇస్తారు. పరిమిత రోజులు దాటితే వేతనంలో కోత విధిస్తారు. వేతనాల అవసరాన్ని, తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి సెలవులు పెట్టిన తల్లిదండ్రులే అంచనా వేసుకోవాలి. ఎక్కువ సెలవులు పెడితే రిమార్కులు కూడా ఉండవు. ఇప్పటికే అమెరికాలోని కంపెనీ హెడ్‌క్వార్టర్స్‌లో ప్రవేశపెట్టిన ఇదే విధానాన్ని త్వరోలోనే భారత్‌కు విస్తరిస్తామని నెట్‌ఫిక్స్ కంపెనీ యాజమాన్యం ప్రకటించింది.
 
వర్జిన్‌గ్రూప్‌నకు చెందిన వర్జిన్ మేనేజ్‌మెంట్ కంపెనీలో నాలుగేళ్ల సర్వీసు నిండిన ఉద్యోగులకు వెటర్నటీ, పెటర్నటీ సెలవులను ఏడాదికి పెంచుతూ గత జూన్ నెలలో ఉత్తర్వులు జారీ చేసింది. అదే బాటలో జింగా, గ్రూపాన్, గ్లాస్‌డోర్, ఎవర్నోట్ కంపెనీలు ఈ సెలవులను ఏడాదికి పెంచాయి. అపోలో మ్యూనిచ్ హెల్త్ ఇన్సూరెన్స్ ‘లీవ్ పూల్’ను ఏర్పాటు చేసింది. వొడాఫోన్ ఇండియా, ఎంటీఎస్, కోకకోలా ఇండియా కంపెనీలు వీకెండ్ హాలీడేస్‌ను పొడిగిస్తే వ్యక్తిగత సెలవులుగా ప్రకటించే విధానానికి సెలవు చీటి ఇచ్చాయి.

ఈ కామర్స్‌లో భారత్‌లో ముందుకు దూసుకెళుతున్న కంపెనీ ‘ఫ్లిప్‌కార్ట్’ తన కొత్త సెలవుల విధానాన్ని ఇటీవలనే ప్రకటించింది. రెండేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులు తమ వ్యక్తిగత అవసారాల కోసం ఆరు నెలల పాటు వేతనాలు లేని సెలవులు తీసుకోవచ్చు. కొత్తగా పెళ్లయినవారు ఫైవ్ డేస్ ఆఫ్‌ను క్లేమ్ చేసుకోవచ్చు. తమ ఆత్మీయులు ఎవరైనా మరణిస్తే ఆ బాధ నుంచి కోలుకునే వరకు ఉద్యోగులు ఎన్ని రోజులైనా సెలవులు తీసుకోవచ్చు. మెటర్నరీ లీవ్‌ను 24 వారాలకు పొడిగించడంతోపాటు, తల్లులు ఇంటి నుంచి ఏవైనా నాలుగు గంటలు పనిచేసుకునే వెసలుబాటును కూడా కల్పించింది. అంతేకాకుండా కెరీర్ బ్రేక్ కింద ఏడాది పాటు సెలవు పెట్టొచ్చు. మహీంద్ర మహీంద్ర కంపెనీ ప్రతి ఉద్యోగికి ఏడాదిలో వరుసగా 14 రోజులు తప్పనిసరిగా సెలవు తీసుకోవాలనే నిబంధన తీసుకొచ్చింది.

వర్క్‌ప్లేస్‌లో ఉద్యోగులకు సంతృప్తి అనేది భారత దేశంలోనే అతి తక్కువగా ఉందని పలు సర్వేల్లో తేలడం, భారత్‌లో మార్కెట్ విస్తరిస్తుండడం, ఉద్యోగుల్లో ఎప్పటికప్పుడు సృజనాత్మకతను పెంచాల్సిన అవసరం ఏర్పడడం, కార్పొరేట్ కంపెనీల మధ్య పోటీతత్వం పెరగడం తదితర కారణాల వల్ల సెలవులు పట్ల పలు కంపెనీలు ఉదారంగా వ్యవహరిస్తున్నాయి. పేచెక్ ఇండియా ఇటీవల చేసిన సర్వే ప్రకారం 44 శాతం మంది వర్క్‌ప్లేస్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, కేవలం 22 శాతం మంది మాత్రమే సంతృప్తి వ్యక్తం చేశారు. పాశ్చాత్య దేశాల్లో అన్ని కార్పొరేట్ కంపెనీ ఫైవ్ డే వీక్ విధానాన్ని అమలు చేస్తుండగా, భారత్‌లో పలు కంపెనీలు ఇప్పటికీ సిక్స్ డే వీక్‌ను అమలు చేస్తున్నాయి. ఇంటివద్ద ఉన్నప్పుడు కాకుండా ఆపీసుల్లో ఉన్నప్పుడే ఉద్యోగులు కంపెనీ ఉత్పత్తుల తయారీ కోసం ఎక్కువ సమయం కేటాయిస్తుండడమే ఇందుకు కారణమని పలు కంపెనీలు తెలియజేస్తున్నాయి.

>
మరిన్ని వార్తలు