నేడు తెలంగాణ బంద్

17 Jul, 2015 01:53 IST|Sakshi
నేడు తెలంగాణ బంద్

* మున్సిపల్ సమ్మెపై సర్కారు తీరుకు నిరసనగా వామపక్షాల పిలుపు
* మద్దతు పలికిన కాంగ్రెస్, టీటీడీపీ, తెలంగాణ వైఎస్సార్‌సీపీ
* 11వ రోజుకు చేరిన సమ్మె.. జిల్లాల్లో 83% మంది విధులకు దూరం
* కార్మిక సంఘాలతో సర్కారు చర్చలు మళ్లీ విఫలం...
* 18, 19 తేదీల్లో మున్సిపల్ అధికారులకు  సెలవులు రద్దు చేస్తూ కమిషనర్ ఉత్తర్వులు

 
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పారిశుధ్య కార్మికుల సమ్మెకు మద్దతుగా వామపక్షాలు శుక్రవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు కాంగ్రెస్, టీటీడీపీ, వైఎస్సార్‌సీపీ తెలంగాణ  సహా అన్ని విపక్ష పార్టీలు, పలు ఉద్యోగ, విద్యార్థి, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. మున్సిపల్ కార్మికులకు సంఘీభావంగా బంద్‌లో ప్రత్యక్షంగా పాల్గొని నిరసనలు తెలుపుతామని వివిధ పార్టీల నేతలు తెలిపారు. బంద్‌కు విపక్షాలు, సంఘాలు మద్దతిస్తుండడంతో.. రాష్ట్రవ్యాప్తంగా జన జీవనంపై ప్రభావం పడనుంది.
 
 దుకాణాలు, ఇతర సేవలు నిలిచిపోనున్నాయి. మరోవైపు మున్సిపల్ కార్మికుల సమ్మెపై గురువారం జరిగిన చర్చలు కూడా విఫలమయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా 11వ రోజూ సమ్మె కొనసాగింది. కాగా, గురువారం నాటికి సమ్మె విరమించిన జీహెచ్‌ఎంసీ కార్మికులకే వేతనాల పెంపు వర్తిస్తుందనే షరతులతో పాటు విధుల్లో చేరని కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించాలని సీఎం ఆదేశించడంపై కార్మిక సంఘాల జేఏసీతో పాటు వామపక్షాలు మండిపడ్డాయి. జీహెచ్‌ఎంసీ కార్మికుల వేతనాలను పెంపుపై సీఎం తీసుకున్న నిర్ణయాలను మంత్రులు ఈటెల రాజేందర్, నాయిని నర్సింహారెడ్డి గురువారం రాత్రి సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డికి ఫోన్ ద్వారా తెలియజేశారు.
 
 దీనిపై వామపక్షాల నేతలు తమ్మినేని వీరభద్రం, చాడ వెంకటరెడ్డి, జానకి రాములు తదితరులు చర్చించుకుని శుక్రవారం నాటి బంద్‌కు కట్టుబడి ఉండాలని నిర్ణయించారు. వేతనాల పెంపు నిర్ణయం అస్పష్టంగా ఉందని, ఇతర మున్సిపాలిటీల కార్మికుల పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నించారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు సమ్మె కొనసాగుతుందని ఉద్ఘాటించారు. వేతనాల పెంపు సహా 16 డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 6 నుంచి మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సమ్మెకు మద్దతుగా వామపక్షాలు బుధవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. దీంతో ప్రభుత్వ తీరుకు నిరసనగా శుక్రవారం రాష్ట్ర బంద్‌కు వామపక్షాలు, కార్మిక సంఘాలు, మున్సిపల్ కార్మిక జేఏసీ పిలుపునిచ్చాయి.
 
 ప్రభుత్వ తీరు సరి కాదు: నేతలు
 పారిశుధ్య కార్మికుల సమ్మె పట్ల ప్రభుత్వ తీరు సరికాదని పలు రాజకీయ పార్టీల నేతలు విమర్శించారు. సమ్మెపై అత్యంత నిరంకుశంగా వ్యవహరిస్తోందని టీపీసీసీ మండిపడింది. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు వేర్వేరుగా విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. కార్మికుల హక్కులను కాలరాసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క పేర్కొన్నారు. హైదరాబాద్‌లో చెత్తగుట్టలు పేరుకుపోతుంటే ఎంఐఎం పార్టీకి కనిపించడం లేదా అని వి.హనుమంతరావు ప్రశ్నించారు. చెత్తకంపులో రంజాన్ ఎలా జరుపుకుంటారన్నారు. కార్మికుల డిమాండ్లు న్యాయమైనవని, అందుకే బంద్‌కు మద్దతిస్తున్నామని వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
 
 కేసులు ఎత్తేయాలని డీజీపీకి వినతి
 మున్సిపల్ సమ్మె సందర్భంగా నిరసనల్లో పాల్గొన్న కార్మికులు, వామపక్ష కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తేయాలని రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మకు లెఫ్ట్ పార్టీల నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం వారు డీజీపీకి ఓ వినతిపత్రాన్ని సమర్పించారు.
 
 తగ్గని సమ్మె ఉధృతి
 మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికుల సమ్మె ఉధృతి తగ్గలేదు. హైదరాబాద్‌లో సమ్మె ప్రభావం క్రమంగా తగ్గుతోందని జీహెచ్‌ఎంసీ చెబుతున్నా.. రాష్ట్రంలోని ఇతర 67 నగరాలు, పట్టణాల్లో మాత్రం సమ్మె కొనసాగుతోంది. జిల్లాల్లోని మున్సిపాలిటీల్లో 83 శాతం కార్మికులు విధులకు దూరంగా ఉంటున్నారు. మొత్తం 15,345 మంది పారిశుధ్య, పారిశుధ్యేతర కార్మికులు పనిచేస్తుండగా.. గురువారం వారిలో 12,578 మంది సమ్మెలో పాల్గొన్నారు. కేవలం 2,587 మందే విధులకు హాజరయ్యారు. మరోవైపు రంజాన్ నేపథ్యంలో పురపాలక శాఖ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఈనెల 18(రంజాన్ సెలవు), 19న సెలవును రద్దు చేస్తూ రాష్ట్ర పురపాలక శాఖ సంచాలకులు బి.జనార్దన్‌రెడ్డి గురువారం ఆదేశాలు జారీచేశారు. పారిశుధ్య నిర్వహణకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, పోలీసుల సాయం తీసు కోవాలని మున్సిపల్ కమిషనర్లకు సూచించారు.
 
 బంద్‌కు సహకరించాలి వామపక్షాలు
 శుక్రవారం నాటి బంద్‌కు సహకరించాలని ఆర్టీసీ యాజమాన్యం, వాణిజ్య, వ్యాపార సంస్థలు, ప్రజలకు పది వామపక్షాలు విజ్ఞప్తి చేశాయి. పుష్కరాలు, రంజాన్ సందర్భంగా ప్రజలకు కొంత అసౌకర్యం కలిగినా ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఖండిస్తూ, మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి మద్దతు పలకాలని కోరాయి. గురువారం ఎంబీ భవన్‌లో చాడ వెంకట్‌రెడ్డి (సీపీఐ), తమ్మినేని వీరభద్రం (సీపీఎం), వేములపల్లి వెంకటరామయ్య (న్యూడెమోక్రసీ-రాయల), జానకిరాములు (ఆర్‌ఎస్‌పీ), మురహరి (ఎస్‌యూసీఐ-సీ) తదితర పార్టీల నాయకులు సమావేశమై బంద్‌పై నిర్ణయం తీసుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపాయి. శుక్రవారం ఉదయం 6 గంటలకు ఎంజీబీఎస్ బస్ డిపో వద్ద పది వామపక్షాల నాయకులు బస్ రోకోలో పాల్గొంటారని తెలిపాయి.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు