రుణమాఫీ కోసం కేంద్రానికి లేఖ: సీఎం

31 Oct, 2013 05:27 IST|Sakshi
రుణమాఫీ కోసం కేంద్రానికి లేఖ: సీఎం

శ్రీకాకుళం, న్యూస్‌లైన్/విశాఖపట్నం, సాక్షి ప్రతినిధి: తుపాను, వర్షాలు, వరదల్లో తీవ్రంగా దెబ్బ తిన్న శ్రీకాకుళం జిల్లాలో పంట రుణాల మాఫీ కోసం కేంద్రానికి లేఖ రాస్తానని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో వర్షాలు, వరదల ప్రభావిత ప్రాంతాల్లో బుధవారం ఆయన పర్యటించారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో విలేకరుల సమావేశంలో, విశాఖ జిల్లా రాంబిల్లి మండలం నారాయణపురంలో రైతులతో ఆయన మాట్లాడారు. పంట రుణాల రీషెడ్యూల్ చేసే విషయమై బ్యాంకులతో మాట్లాడుతామని చెప్పారు. పోయిన పంటల స్థానంలో మళ్లీ వేసేందుకు విత్తనాలు, ఎరువులు తదితరాలను ఇప్పుడున్న సబ్సిడీ కంటే ఎక్కువ సబ్సిడీతో అందజేయాలని, దెబ్బతిన్న ఇళ్ల పునర్నిర్మాణానికి ఐఏవై ఇళ్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు.
 
  ఇళ్ల నిర్మాణానికి ఎస్సీ, ఎస్టీలకు లక్ష రూపాయిల వరకు, ఇతరులకు రూ.70 వేల వరకు తక్షణం మంజూరు చేసే అధికారాన్ని కలెక్టర్‌కు కల్పించామన్నారు. హెక్టారుకు ’ 10 వేల ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రి కృపారాణి, రాష్ట్ర మంత్రులు కోండ్రు మురళీమోహన్, శత్రుచర్ల విజయరామరాజు తదితరులు పాల్గొన్నారు. బుధవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో హెలికాప్టర్‌లో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల చేరుకున్న ముఖ్యమంత్రి అక్కడి నుంచి అదపాక జంక్షన్‌కు వెళ్లి నష్టపోయిన పత్తి చేనును పరిశీలించారు. బుడుమూరు ఎస్సీ కాలనీకి వెళ్లి మహిళలతో మాట్లాడారు. లావేరు మండలం అదపాకలో తమకు సాయం అందడం లేదని కొందరు మహిళలు ముఖ్యమంత్రిని నిలదీశారు. సీఎం మౌనంగా నిష్ర్కమించడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
 త్వరితంగా వరద నష్టపరిహారం: విశాఖపట్నం: రాష్ట్రంలో వరద ప్రభావానికి నష్టపోయిన అన్నదాతలు, పంటల వివరాలు తక్షణమే నమోదుచేసి సాధ్యమైనంత వేగంగా నివేదిక సిద్ధం చేసి పరిహారం అందించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి స్పష్టంచేశారు. శ్రీకాకుళం,విజయనగరం,విశాఖపట్నంలో పర్యటన అనంతరం సీఎం సెక్రటేరియట్ నుంచి వచ్చిన పలువురు ఉన్నతాధికారులు, జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చాలాచోట్ల ఇంకా అన్నదాతలు బ్యాంకు అకౌంట్లు ప్రారంభించలేదని, ఈప్రక్రియకు బ్యాంకర్లు కూడా సహకరించకపోవడం కూడా కారణమని సీఎం వ్యాఖ్యానించారు. బ్యాంకర్లతో మాట్లాడి ఈ సమస్య పరిష్కరిస్తామన్నారు.

మరిన్ని వార్తలు