మనవడిని చంపిన బామ్మకు జీవితఖైదు

4 Sep, 2014 19:39 IST|Sakshi

కోడలి మీద పగ తీర్చుకోడానికి మనవడిని చంపిన 62 ఏళ్ల బామ్మకు కోర్టు జీవిత ఖైదు విధించింది. బీనా అనే ఈ బామ్మ చేసినది అత్యంత క్రూరమైన పని అని, అందుకు జీవిత ఖైదే తగిన శిక్ష అని అదనపు సెషన్స్ జడ్జి సవితారావు తీర్పు చెప్పారు. దాంతోపాటు ఆమెకు రూ. 10 వేల జరిమానా కూడా విధించారు. తన సొంత మనవడి అత్యంత విలువైన ప్రాణాలను ఆమే తీయడం అత్యంత క్రూరమైన సంఘటన అనడంలో ఎలాంటి అనుమానం లేదని జడ్జి అన్నారు.

అయితే.. ముద్దాయి వయసు, మహిళ కావడం, ఆరోగ్యం బాగోకపోవడం లాంటి కారణాలను దృష్టిలో పెట్టుకుని ఆమెకు జీవితఖైదు మాత్రమే విధిస్తున్నట్లు జడ్జి పేర్కొన్నారు. తన కొడుకును తన నుంచి కోడలు దూరం చేస్తోందన్న కోపంతో.. ఆ పగ తీర్చుకోడానికి సమీర్ అనే సొంత మనవడిని ఆమె చంపినట్లు నేరం రుజువైంది. కోడలిని కూడా అంతకు ఒకరోజు ముందు ఆమె బెదిరించినట్లు కోర్టు తెలిపింది. మనవడిని చంపిన తర్వాత ఆమె ఆత్మహత్యకు కూడా ప్రయత్నించిందని, తర్వాతి పరిణామాలు ఊహించుకునే ఈ పని చేసి ఉంటుందని అన్నారు. మనవడిని ఆమె పీక పిసికి చంపేసినట్లు కోర్టులో రుజువైంది.

>
మరిన్ని వార్తలు