వృద్ధిబాటలో జీవిత బీమా

17 Dec, 2013 01:28 IST|Sakshi
వృద్ధిబాటలో జీవిత బీమా

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మూడేళ్ళ విరామం తర్వాత ఈ ఏడాది జీవిత బీమా పరిశ్రమలో వృద్ధి నమోదవుతుందని బీమా నియంత్రణ, అభివృద్ధి మండలి (ఐఆర్‌డీఏ) ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రస్తుత సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో జీవిత బీమా వ్యాపారంలో వృద్ధి కనిపించిందని, మలి రెండు త్రైమాసికాల్లో ఇదే విధమైన వృద్ధి నమోదవుతుందన్న విశ్వాసాన్ని ఐఆర్‌డీఏ చైర్మన్ టి.ఎస్.విజయన్ వ్యక్తం చేశారు. ఐఆర్‌డీఏ అనుబంధ సంస్థ ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా (ఐఐబీ) కొత్త కార్యాలయాన్ని సోమవారం ప్రారంభించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ ఏడాది జీవిత బీమాలో పది శాతం లోపు, సాధారణ బీమాలో 16 నుంచి 17 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది మొత్తం మీద జీవిత, సాధారణ బీమా వ్యాపార పరిమాణం రూ. 4 లక్షల కోట్లు దాటుతుందన్నారు. గతంలో కొత్త పథకాలను ఆమోదించడానికి మూడు నెలలకు పైగా సమయం పట్టేదని, ఐఐబీ సమాచారం అందుబాటులోకి వస్తే ఈ సమయం మరింత తగ్గుతుందన్నారు. ఇతర దేశాలకు అనుగుణంగానే దేశంలో జీవిత బీమా సాంద్రత ఉన్నప్పటికీ ఇంకా వ్యాపారం విస్తరించడానికి అవకాశాలు ఉన్నాయన్నారు.
 
 జీవిత బీమా సమాచారం కూడా సేకరిస్తాం
 ప్రస్తుతం వాహన, ఆరోగ్య బీమాలతో పాటు ఇతర సాధారణ బీమా పథకాల సమాచారాన్ని సేకరిస్తున్నామని, త్వరలోనే  జీవిత బీమాకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఐఐబీ సీఈవో ఆర్.రాఘవన్ తెలిపారు.  పాలసీదారులకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఈ సమాచారంతో బీమా కంపెనీలు, ఐఆర్‌డీఏ కొత్త పథకాలు, నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు. ఇప్పటికే మోటార్ ఇన్సూరెన్స్‌లో వీసేవాను ప్రవేశపెట్టామని, అలాగే హాస్పిటల్స్ అన్నింటికి ఏకీకృత సంఖ్యను ఇస్తూ పెలైట్ ప్రాజెక్టును మొదలు పెట్టినట్లు రాఘవన్ తెలిపారు.

>
మరిన్ని వార్తలు