యాసిన్ భత్కల్ ఆరు నెలలుగా నేపాల్‌లోనే

31 Aug, 2013 02:57 IST|Sakshi
యాసిన్ భత్కల్ ఆరు నెలలుగా నేపాల్‌లోనే

పాట్నా/న్యూఢిల్లీ: నేపాల్ సరిహద్దుల్లో పోలీసులకు పట్టుబడ్డ ఉగ్రవాది, ఇండియన్ ముజాహిదీన్ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ ఆరు నెలలుగా నేపాల్‌లోనే ఉంటున్నాడు. తాను చెబితే ఏమైనా చేయగల వంద మంది ఉగ్రవాదులను సైతం తయారు చేశాడు. ఇంటరాగేషన్‌లో అతడు ఈ విషయాన్ని పోలీసులకు చెప్పాడు. భత్కల్‌ను, అతడి సహచరుడు అసదుల్లా అక్తర్‌ను ఎన్‌ఐఏ పోలీసులు శుక్రవారం ఢిల్లీ కోర్టులో ప్రవేశపెట్టగా, కోర్టు వారిని పన్నెండు రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగించింది.
 
 భత్కల్, అక్తర్‌లను బుధవారం రాత్రి నేపాల్ సరిహద్దుల్లో పట్టుకున్న ఎన్‌ఐఏ అధికారులు, తొలుత వారిని బీహార్‌లోని మోతిహారి కోర్టులో ప్రవేశపెట్టి, మూడు రోజుల బదిలీ రిమాండ్ పొందిన సంగతి తెలిసిందే. ఢిల్లీ కోర్టులో గోప్యంగా జరిగిన విచారణలో నిందితుల తరఫు న్యాయవాది ఎస్.ఎం.ఖాన్, నిందితుల్లో ఒకరు మహమ్మద్ అహ్మద్ అని, అతడు యాసిన్ భత్కల్ కాదని వాదించారు.

అయితే, మహమ్మద్ అహ్మద్ సిద్దిబప్ప, యాసిన్ భత్కల్ ఒక్కరేనని, అతడిపై కోర్టు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసిందని ఎన్‌ఐఏ తన రిమాండ్ దరఖాస్తులో తెలిపింది. నిందితులను ఇతర రాష్ట్రాలకు తీసుకు వెళ్లేటప్పుడు వారి చేతులకు సంకెళ్లు వేసి తీసుకు వెళ్లేందుకు అనుమతించాలని ఎన్‌ఐఏ అభ్యర్థించగా, కోర్టు అంగీకరించింది. ఉత్తర కర్ణాటకలోని ఉడిపి జిల్లా భత్కల్ గ్రామానికి చెందిన యాసిన్ భత్కల్ దాదాపు 40 ‘ఉగ్ర’ కేసుల్లో కీలక నిందితుడు. హైదరాబాద్, అహ్మదాబాద్, సూరత్, పుణే, ఢిల్లీ, బెంగళూరు దాడుల్లో కీలక పాత్ర పోషించినట్లు ఎన్‌ఐఏ గత నెలలో ఢిల్లీ కోర్టుకు సమర్పించిన చార్జిషీట్‌లో పేర్కొంది. కాగా, ఇటీవల ఈద్ పర్వదినం సందర్భంగా భత్కల్ తన భార్యకు కానుకగా లక్ష రూపాయలు బ్యాంకు ద్వారా పంపాడు.
 
 ఈ చర్య ఆధారంగానే ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు అతడి ఆచూకీని కనిపెట్టగలిగినట్లు సమాచారం. ఇంటరాగేషన్‌లో ఏమాత్రం పశ్చాత్తాపం వ్యక్తంచేయని భత్కల్, హెచ్చరిక పంపేందుకే తాను బాంబు పేలుళ్లకు పాల్పడినట్లు చెప్పాడని సమాచారం. నేపాల్‌లో ఉన్న ఆరు నెలల్లోనూ తరచుగా ఇళ్లు మార్చేవాడినని, యునానీ వైద్యుడిగా చెప్పుకుంటూ అక్కడి ముస్లింలకు వైద్యం చేసేవాడినని చెప్పినట్లు మోతిహారి ఎస్పీ చెప్పారు. అయితే, గతనెల 7న బుద్ధగయలో జరిగిన పేలుళ్లలో తమ పాత్ర లేదని అతడు విచారణలో చెప్పినా, అతడి పాత్ర ఉందనే తాము అనుమానిస్తున్నామని తెలిపారు.

మరిన్ని వార్తలు