ఓట్లు మావే.. సీట్లూ మావే

27 Nov, 2015 00:31 IST|Sakshi
ఓట్లు మావే.. సీట్లూ మావే

* ‘స్థానిక’ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటుతాం: ఎంపీటీసీల ఫోరం
* మొత్తం 12 సీట్లలో ఎంపీటీసీ అభ్యర్థులను నిలుపుతాం
* ఎంపీటీసీలకు కాకుండా ఎవరికి టికెట్ ఇచ్చినా ఓడిస్తాం
* జెడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లతో జేఏసీగా ఏర్పడతామని ప్రకటన
సాక్షి, హైదరాబాద్: రానున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటాలని రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం ఉవ్విళ్లూరుతోంది.

ప్రభుత్వం గత 17 నెలలుగా ఎంపీటీసీలకు ఎలాంటి నిధులు, విధులు అప్పగించకపోవడంపై ఉన్న వ్యతిరేకతను చూపేందుకు సన్నద్ధమవుతోంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 12 సీట్లకు ఫోరం తరపున ఎంపీటీసీలనే ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నిలపాలని నిర్ణయించింది. ఏవైనా రాజకీయ పార్టీలు ఎమ్మెల్సీ టికెట్లను ఎంపీటీసీలకు కేటాయించిన పక్షంలో, ఆ అభ్యర్థులకు మాత్రం మద్దతు ఇవ్వాలని ఫోరం రాష్ట్ర కార్యవర్గం తీర్మానించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 80 శాతం ఓట్లున్న ఎంపీటీసీలకు కాకుండా ఇతరులకు టికెట్లు ఇచ్చి బరిలో నిలిపితే ఓడించి తీరతామని స్పష్టం చేసింది.

గురువారం హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి సమావేశంలో ఫోరం రాష్ట్ర ప్రతినిధులు, వివిధ జిల్లాల అధ్యక్షులు ఈ మేరకు ప్రతినబూనారు. ఈ దఫా ఎన్నికల్లో ఓట్లు, సీట్లు తమవేనని నినదించారు. గత ఏడాదిన్నర కాలంగా ఎంపీటీసీలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి పట్టించుకున్న నాథుడే కరువయ్యాడని, ఈ నేపథ్యంలో ఎంపీటీసీలనే ఎమ్మెల్సీలుగా చట్టసభలకు పంపాల్సిన అవసరం ఏర్పడిందని వారు అంటున్నారు.
 
ఎంపీటీసీల సమస్యలివే..
గ్రామ సర్పంచులతో సమానమైన అధికారాలు కల్పిస్తామంటూ గత ఆగస్టులో కరీంనగర్‌లో జరిగిన గ్రామజ్యోతి కార్యక్రమంలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినా... అందుకు సంబంధించిన ఉత్తర్వులు ఇప్పటిదాకా వెలువడలేదని ఎంపీటీసీల ఫోరం ఆరోపిస్తోంది. ఎంపీటీసీల ద్వారా ఖర్చు చేయాల్సిన బీఆర్‌జీఎఫ్ నిధులను ఈ ఏడాది కేంద్రం నిలిపివేసిందని, 14వ  ఆర్థిక సంఘం నిధులు కూడా కేంద్రం నేరుగా గ్రామ పంచాయతీలకే ఇస్తుండడంతో తమ పరిస్థితి ఉత్సవ విగ్రహాల మాదిరి తయారైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం చేపట్టిన గ్రామజ్యోతి పథకంలోనైనా తమకు సముచిత స్థానం కల్పించడం లేదని అంటున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు టీచర్లను, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు గ్రాడ్యుయేట్లను అభ్యర్థులుగా నిలుపుతున్నపుడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక ప్రజాప్రతినిధులైన ఎంపీటీసీలకు ఎందుకు అవకాశమివ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు.
 
80 శాతం ఓట్లు మావే..
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఓట్లలో 80 శాతం ఓట్లు ఎంపీటీసీలవేనని తెలంగాణ రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు బోళ్ల కరుణాకర్ చెప్పారు. ఏడాదిన్నర కాలంగా ఎంపీటీసీలకు ఎలాంటి అధికారాలు, నిధులు, విధులనూ ప్రభుత్వం అప్పగించలేదన్నారు. ఎంపీటీసీల సమస్యలను చట్టసభల్లో ప్రస్తావించేందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేయడమే సరైన మార్గంగా భావిస్తున్నామన్నారు.

రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులుగా ఎంపీటీసీలకు టికెట్లిస్తే ఫోరం తరపున మద్దతు ఇస్తామని వెల్లడించారు. తమలాగే ఎలాంటి అధికారాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న జెడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సెలర్లను కూడా కలుపుకొని స్థానిక ప్రజాప్రతినిధుల జేఏసీగా ఏర్పడాలని యోచన చేస్తున్నామన్నారు. నెలాఖరులోగా రాష్ట్ర స్థాయిలో భారీ సమావేశం నిర్వహించి తమ అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. ఈ సమావేశంలో ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాకయ్య, ఉపాధ్యక్షుడు పెండ్యాల గోవర్ధన్, కార్య నిర్వాహక కార్యదర్శి మనోహర్‌రెడ్డి, వివిధ జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు