జియో రైస్‌ వచ్చేశాయ్‌..!

11 Apr, 2017 20:02 IST|Sakshi



రామగుండం(పెద్దపల్లి):
బంపర్ ఆఫర్.. భారీ బొనాంజా.. క్రేజీ సమ్మర్.. ఇలా ఎన్నేన్నే ఆఫర్లతో వినియోగదారుల మనసు దోచుకుంటూ.. ప్రత్యర్థి కంపెనీలకు చుక్కలు చూపెడుతోంది రిలయన్స్ జియో నెట్ వర్క్! జనంలో జియో పట్ల పెరిగిన ఆసక్తి అంతా ఇంతాకాదు. ఎక్కడ పదిమంది కలిస్తే అక్కడ చర్చ జియోపైనే! సరిగ్గా ఈ క్రేజ్ నే క్యాష్ చేసుకుంటున్నారు రైస్ మిల్లర్లు.

పెద్దపల్లి జిల్లా రామగుండం సహా పలు పట్టణాలకు చెందిన కొందరు రైస్ మిల్లర్లు.. 25 కేజీల సంచులపై జియో లోగోను ముద్రించి సన్నరకం బియ్యం షాపులకు సరఫరా చేస్తున్నారు. ఈ పోకడకు సంబంధించిన ఫొటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జియో నెట్ వర్క్ లోకి ఒక్కసారి రిజిస్టర్ అయితే మూడు నెలలు ఉచిత కాల్స్, డేటా ఇచ్చిన విధంగా.. 'జియో బియ్యంతో ఒక్కసారి అన్నం తింటే మూడు నెలల దాకా ఆకలి కాదు' అంటూ నెటిజన్లు చవాకులు పేలుస్తున్నారు.

బ్రాండ్ ను సొంతం చేసుకునే ఈ తరహా మార్కెటింగ్ ఐడియాలు కొత్తేమీ కావు. సంక్రాంతి, దీపావళి సీజన్లలో హిట్ సినిమాల పేర్లు, హీరోల పేర్లతో పతంగులు, పటాకులు తెలిసినవే. పలు ఉత్పత్తులపై ప్రధాని మోదీ బొమ్మను సైతం ముద్రించి వ్యాపారాలు సాగించిన సందర్భాలను చూశాం.

మరిన్ని వార్తలు