కాంగ్రెస్, ఆర్‌ఎస్‌ఎస్ మధ్య మహాభారత యుద్ధమే

28 Oct, 2013 01:55 IST|Sakshi
కాంగ్రెస్, ఆర్‌ఎస్‌ఎస్ మధ్య మహాభారత యుద్ధమే

తిరుచిరాపల్లి(తమిళనాడు): వచ్చే లోక్‌సభ ఎన్నికలు కాంగ్రెస్‌కు, నరేంద్ర మోడీని బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా నిర్ణయించిన ఆరెస్సెస్‌కు మధ్య మహాభారత యుద్ధమే కాగలవని కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం వ్యాఖ్యానించారు. ఆయన శనివారం రాత్రి ఇక్కడ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడారు. రాజకీయేతర సంస్థగా చెప్పుకుంటున్న ఆర్‌ఎస్‌ఎస్ పరోక్షంగా రాజకీయాలను తన చేతిలో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో తన రాజకీయ ముఖాన్ని(బీజేపీని) పరోక్షంగా తన నియంత్రణలో నడిపిస్తున్న సంస్థకు, కాంగ్రెస్‌కు మధ్య రాబోయే ఎన్నికలు మహాభారత యుద్ధాన్ని తలపించనున్నాయన్నారు. విద్వేషాలు రెచ్చగొట్టేందుకు యత్నించడం ద్వారా ప్రజలను మతప్రాతిపదికపై చీల్చేందుకు ఆర్‌ఎస్‌ఎస్ ప్రయత్నిస్తోందని చిదంబరం ఆరోపించారు.
 
 

గుజరాత్‌లో జరిగిన ఎన్‌కౌంట ర్లలో ఎక్కువ మంది ముస్లిం యువకులే మృత్యువాత పడ్డారని ఆరోపించారు. అప్పట్లో కేంద్ర హోం మంత్రిగా ఉన్న తాను ఈ తరహా ఎన్‌కౌంటర్లు ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నట్టు చెప్పారు. ఉగ్రవాదులుగానీ, నేరస్తులుగానీ కాల్పులకు తెగించినప్పుడు తప్పిస్తే.. వారిని సజీవంగా పట్టుకోవాలని తాను భద్రతా దళాలకు ఆదేశాలిచ్చానని చెప్పారు. సమాచార హక్కు చట్టం, విద్యాహక్కు చట్టం లాంటి అనేక విప్లవాత్మక చట్టాలను తీసుకొచ్చిన ఘనత తమదేనన్నారు.
 

>
మరిన్ని వార్తలు