లోకేష్‌కు జై... ప్రత్యేక హోదాకు నై

30 Sep, 2015 06:46 IST|Sakshi
లోకేష్‌కు జై... ప్రత్యేక హోదాకు నై

 ఏయూలో అధికార టీడీపీ రాజకీయ సమావేశాలు నిర్వహిస్తే ఓకే...వీసీ, రిజిస్ట్రార్‌లు కూడా పాల్గొంటారు. దగ్గరుండీ మరీ టీడీపీ సభ్యత్వాలు చేయించి ఏయూను టీడీపీ ఆఫీసుగా మార్చేస్తారు. చాన్సలర్ గవర్నర్ ఫొటో అవసరం లేదు...యువరాజు లోకేష్ ఫోటో ఉంటే చాలు జై కొడతారు. లోకేష్ బర్త్‌డేను ఏయూ అధికారిక పండుగలా నిర్వహిస్తారు. వీసీ, రిజిస్ట్రార్‌లు కూడా పరస్పరం కేకులు తినిపించుకుంటూ ఛీర్స్ కొడతారు. ఇదంతా రాజకీయం కాదట... కానీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని ఎవరైనా ప్రొఫెసర్లు కోరితే ‘అమ్మో! అంతపని చేస్తావా!’అని మండిపడతారు.

విద్యార్థులు ఏయూ వెలుపల రాజకీయాలకు అతీతంగా నిర్వహించిన సదస్సులో పాల్గొంటే క్రమశిక్షణరాహిత్యమని అంటారు. ప్రత్యేక హోదా సాధిస్తే యువతకు ఉపాధి అవకాశాలువస్తాయి... ప్రభుత్వానికే మంచిపేరు వస్తుందని సూచిస్తే... అది ‘రాజకీయం చేయడం’ కింద జమకడతారు. నోటీసులు జారీ చేస్తారు. ఎందుకంటే... ఏయూ ఉన్నతాధికారులు ప్రభుత్వ పెద్దల చేతుల్లో కీలుబొమ్మలు.  ఉన్నత పదవులపై కన్నేసి ‘ప్రభువు’ మనసెరిగి మసలుకుంటున్నవారు. అందుకే  ఏయూ ప్రతిష్ట మంటగలుస్తున్నా ప్రభుత్వ ప్రాపకం ఉంటే చాలన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఈ పరిణామాలపై విద్యార్థి లోకం మండిపడుతోంది. బుధవారం ఏయూ బంద్‌కు పిలుపునిచ్చింది.
 - సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం
 
  ప్రొఫెసర్లు ప్రసాదరెడ్డి, అబ్బులులకు నోటీసులు జారీ చేయడంపై ఏయూలోతీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ప్రత్యేక హోదా సాధన వల్ల ప్రయోజనాలను వివరిస్తూ ఆ దిశగా మార్గనిర్దేశం చేయడం ఎలా క్రమశిక్షణారాహిత్యమవుతుందని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ప్రసాదరెడ్డి క్రమశిక్షణరాహిత్యానికి పాల్పడ్డారని  ఇచ్చిన నోటీసులో ఏయూ ఉన్నతాధికారులు చూపించిన కారణాన్ని కూడా విద్యావేత్తలు, విద్యార్థులు తప్పుబడుతున్నారు. ‘ ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు విద్యార్థులతో కలసి పోరాడి ప్రత్యేక హోదా సాధిస్తే ప్రభుత్వానికే మంచిపేరు వస్తుంది. ఆ విషయం తెలిసీ రాష్ట్ర ప్రయోజనాల కోసం  ప్రత్యేక హోదా కోసం పోరాడటం అభినందనీయం’ అని ప్రసాదరెడ్డి ప్రసంగించడాన్ని ఏయూ పెద్దలు తప్పుబడుతున్నారు. 

ఆ మాటల్లో రాజకీయంగానీ ఏయూ ప్రతిష్టకు భంగం కలిగించే అంశంకానీ ఏముందని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. అబ్బులు మాట్లాడుతూ ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి వచ్చే రాయితీల వల్ల సివిల్ ఇంజినీరింగ్ రంగంలో ఉపాధి అవకాశాలు ఎంతగా పెరుగుతాయో వివరించారు. ఇందులోనూ రాజకీయపరమైన అంశం లేదు.  ప్రభుత్వ పెద్దల ఒత్తిడికి లొంగి, వారి మెప్పు పొందేందుకే ఏయూ ఉన్నతాధికారులు ఇద్దరు ప్రొఫెసర్లకు నోటీసులు జారీ చేశారని క్యాంపస్‌లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.

 ఉన్నతాధికారులా?... టీడీపీ కార్యకర్తలా?
 ఉన్నతాధికారులు క్యాంపస్‌ను టీడీపీ ఆఫీసుగా మార్చేసి ఏయూ ప్రతిష్టను  మంటగలిపుతున్నారని విద్యావేత్తలు, విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడాదికాలంలో ఏయూలో వీసీ, రిజిస్ట్రార్‌ల సమక్షంలోనే నిర్వహించిన రాజకీయ కార్యకలాపాలను వారు ఉదాహరిస్తున్నారు. టీడీపీ అనుబంధ విభాగం టీఎన్‌ఎస్‌ఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఏయూలో నిర్వహించడం రాజకీయ కార్యక్రమం కాదా అని ప్రశ్నిస్తున్నారు. వీసీ, రిజిస్ట్రార్‌లు టీడీపీ నేతలతో కలసి టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేయించి ఆ పార్టీ కార్యకర్తల్లా వ్యవహరించారని విమర్శిస్తున్నారు. టీడీపీ అనుబంధ విభాగం క్యాంపస్‌లో  నిర్వహించిన ఫ్రెషర్స్ డే వేడుకల్లో వీసీ, రిజిస్ట్రార్‌లు పాల్గొనడాన్ని విద్యార్థులు ప్రస్తావిస్తున్నారు. టీడీపీ అధ్యక్షుడి హోదాలో చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ల ఫ్లెక్సీలను బ్యానర్‌గా పెట్టి ఆ వేడుకలను నిర్వహించారు.

 చాన్సలర్ గవర్నర్ ఫొటో లేదు. కానీ లోకేష్ ఫొటో మాత్రం ఉంటే చాలు అన్నట్లుగా వీసీ, రిజిస్ట్రార్‌లు ఆ కార్యక్రమంలో ఆసాంతం పాల్గొన్నారు. లోకేష్ జన్నదిన వేడుకలను ఏయూ అధికారిక పండుగ  తరహాలో నిర్వహించగా అందులో కూడా వీసీ, రిజిస్ట్రార్‌లు పాల్గొని కేక్‌లు తినిపించుకున్నారు. ఇలా రాజకీయ కార్యకలాపాల్లో వీసీతోసహా ఉన్నతాధికారులు పాల్గొనడంపై విద్యావేత్తలు తీవ్రస్థాయిలో విమర్శించారు. కానీ అవేవీ పట్టని ఉన్నతాధికారులు ‘ప్రభువు’ సేవలో తరించేందుకు క్యాంపస్‌ను టీడీపీ ఆఫీసుగా మార్చేస్తున్నారు. కానీ ప్రత్యేక హోదా కావాలని కోరిన ప్రొఫెసర్లపై మాత్రం కక్షసాధింపునకు పాల్పొడుతున్నారు. ఉన్నతాధికారుల తీరును నిరసనగా బుధవారం ఏయూ బంద్‌కు విద్యార్థులు పిలుపునిచ్చారు.

 ఏయూ బాటలోనే సెయింట్ పాల్ బీఈడీ కాలేజీ
 సాక్షి, విశాఖపట్నం యువభేరీ  సదస్సులో ఏయూ ప్రొఫెసర్లపైనే కాదు ప్రైవేటు విద్యా సంస్థల విద్యావేత్తలపైనా వేధింపుల పర్వం కొనసాగుతోంది. ప్రత్యేక హోదా ఆవశ్యకతను చెప్పేందుకు యువభేరీ’ సదస్సులో పాల్గొన్న  సెయింట్ పాల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్ మన్మథరావును ఆ కాలేజీ యాజమాన్యం వేధింపులకు గురిచేసింది. ఆయనకు నోటీసులు జారీ చేసింది. దాంతో తన ప్రిన్సిపాల్ పదవికి రాజీనామా చేశారు. ప్రత్యేక హోదా కోసం సదస్సులో పాల్గొనడం రాజకీయం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నిస్తున్నారు.  యాజమాన్యం తీరుకు నిరసనగా  ఆయన స్వచ్ఛందంగా తన పదవికి రాజీనామా చేశారు.

మరిన్ని వార్తలు