లోక్పాల్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం

18 Dec, 2013 14:59 IST|Sakshi
లోక్పాల్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం

న్యూఢిల్లీ: అవినీతి నిర్మూలనకు ఉద్దేశించిన చరిత్రాత్మకమైన లోక్పాల్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. గందరగోళ పరిస్థితుల మధ్య లోక్పాల్ బిల్లును నేడు మూజువాణి ఓటుతో లోక్‌సభ ఆమోదించింది. లోక్పాల్ బిల్లుకు రాజ్యసభ నిన్న ఆమోదముద్ర వేసింది. సీమాంధ్ర ఎంపీలు సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలతో చేయడంతో లోక్సభ దద్దరిల్లింది. గందరగోళం కొనసాగుతుండగానే లోక్పాల్ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. బీజేపీ బిల్లును సమర్థించింది. సమాజ్వాది పార్టీ బిల్లును వ్యతిరేకించింది.

లోక్‌పాల్ బిల్లు ఆమోదించేందుకు కేంద్రం యేడాది సమయం తీసుకుందని బీజేపీ నాయకురాలు సుష్మాస్వరాజ్‌ విమర్శించారు. లోక్‌పాల్ బిల్లు ఆమోదంతో చరిత్ర నెలకొల్పబోతున్నామని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఒక్క లోక్‌పాల్‌తో అవినీతి నిర్మూలన సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. లోక్‌పాల్‌పై కాంగ్రెస్, బీజేపీ తొందరపడుతున్నాయని సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ ఆరోపించారు. లోక్‌పాల్ బిల్లు ఆమోదంతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలవుతుందన్నారు. లోక్‌పాల్ బిల్లుకు నిరసనగా సభ నుంచి ఎస్పీ వాకౌట్‌ చేసింది. లోక్‌పాల్ బిల్లును పార్లమెంట్ ఆమోదించడంతో అన్నా హజారే దీక్ష చేస్తున్న రాలెగావ్ సిద్ధిలో ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది.

మరిన్ని వార్తలు