‘డిజిటల్’లో హిందీ రాజ్యం

11 Sep, 2015 00:29 IST|Sakshi
‘డిజిటల్’లో హిందీ రాజ్యం

యాప్స్ తయారీ ద్వారా కంపెనీలకు లబ్ధి: మోదీ
* హిందీని విస్మరించటం దేశానికి నష్టదాయకం
* ప్రపంచ హిందీ సదస్సులో ప్రధాని మోదీ
భోపాల్: రాబోయే రోజుల్లో డిజిటల్ ప్రపంచంలో ఇంగ్లిష్, చైనీస్, హిందీ భాషలు రాజ్యమేలుతాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. భాషా మార్కెట్ భారీగా ఉంటుందని.. దానిపై సత్వరమే యాప్స్ (అప్లికేషన్లు) తయారు చేయటం ద్వారా కంపెనీలు లాభపడవచ్చని సూచించారు.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 6,000 భాషల్లో 90 శాతం భాషలు గతించిన ఆనవాళ్లుగా మిగిలిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తుండటాన్ని ప్రస్తావిస్తూ.. అంతరించిపోతున్న భాషలను పరిరక్షించటానికి చర్యలు చేపట్టాలని కూడా ప్రధాని పిలుపునిచ్చారు. గురువారం భోపాల్‌లో పదో ప్రపంచ హిందీ సదస్సును మోదీ ప్రారంభిస్తూ ప్రసంగించారు. హిందీ ప్రాముఖ్యతను, దానిని సుసంపన్నం చేయాల్సిన అవసరాన్ని ఉద్ఘాటిస్తూ.. హిందీని విస్మరించటం దేశానికి నష్టదాయకమని పేర్కొన్నారు. ‘‘నా మాతృభాష గుజరాతీ అయినప్పటికీ.. నాకు హిందీ తెలియకపోతే నా పరిస్థితి ఏమై ఉండేదని నేను అప్పుడప్పుడూ అనుకుంటుంటాను.

ఏ భాషను అయినా తెలుసుకోవటం వల్ల ఉండే బలమేమిటనేది నాకు బాగానే తెలుసు. దున్నపోతులను కొనుగోలు చేసేందుకు గుజరాత్ వచ్చే ఉత్తరప్రదేశ్ వ్యాపారులకు టీ అమ్ముతూ నేను హిందీ నేర్చుకున్నాను’’ అని తెలిపారు. మారిషస్, మంగోలియా, చైనా, రష్యా తదితర దేశాల్లో హిందీకి పెరుగుతున్న ప్రజాదరణను తాను వీక్షించానని చెప్పారు. హిందీ భాషను విదేశాల్లో విస్తరించటంలో బాలీవుడ్ సినిమాల పాత్ర ఎంతో ఉందన్నారు. దేశంలో మాట్లాడే వివిధ ప్రాంతీయ భాషల్లోని మంచి పదాలను హిందీలో చేర్చటానికి కార్యసదస్సులు నిర్వహిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

‘హిందీ మహాకుంభ మేళా’గా మోదీ అభివర్ణించిన ఈ సదస్సులో 40 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. అంతకుముందు విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ మాట్లాడుతూ.. విశ్వ హిందీ సదస్సు ఇతర సదస్సులకన్నా భిన్నమైనదని పేర్కొన్నారు. హిందీ భాష సాహిత్య కోణాలపై మాత్రమే కాకుండా.. వివిధ రంగాల్లో ఈ భాషను విస్తరించటానికి గల అవకాశాలపై ఈ సదస్సులో దృష్టి కేంద్రీకరించటం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌చౌహాన్ కూడా మాట్లాడారు. ఈ సందర్భంగా సదస్సు జ్ఞాపకార్థం పోస్టల్ స్టాంపును మోదీ ఆవిష్కరించారు.

మరిన్ని వార్తలు