పార్టీకి నష్టమే

2 Aug, 2015 01:09 IST|Sakshi

టీడీపీ సమావేశంలో ముఖ్యుల ఆందోళన
 
 సాక్షి, విజయవాడ బ్యూరో : రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చి పరిశ్రమలతో పాటు ఇతర అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తామని ఎన్నికలప్పుడు చెప్పామని, ఇప్పుడు హోదా రాకపోతే పార్టీకి నష్టం తప్పదని పలువురు టీడీపీ సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రమంత్రి ప్రకటించడం, వామపక్షాలు ఆందోళనలకు శ్రీకారం చుట్డడం, ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తమ ఎంపీలతో కలిసి ఢిల్లీలో ధర్నా చేస్తానని ప్రకటించడం.. తెలుగుదేశం నేతల్లో గుబులుకు కారణమయ్యాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీతో ఘర్షణకు దిగే అవకాశం లేదని ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. విజయవాడలో శనివారం టీడీపీ రాష్ట్రస్థాయి సమావేశం జరిగింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. సమావేశం హాల్లో, హాలు బయట ప్రత్యేక హోదా అంశమే హాట్ టాపిక్‌గా మారింది.

 బీజేపీ మన పుట్టి ముంచేలా ఉంది..!
 ఎంపీలు కొనకళ్ల నారాయణరావు, జేసీ దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు అంగర రామ్మోహన్, పయ్యావుల కేశవ్‌ల మధ్య ఆసక్తికర చర్చ సాగింది. ఏ ఇద్దరు నాయకులు కలిసినా బీజేపీ తమ పుట్టి ముంచే వ్యూహం అమలు చేస్తున్నట్లుగా ఉందనే అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. అంతక ముందు జేసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ దేశానికే విజిటింగ్ పీఎంగా వస్తున్నారని, సమస్యలు చెప్పుకునే అవకాశమే ఇవ్వడం లేదని మరో ఎంపీ రాయపాటి సాంబశివరావు హోదా ఇవ్వకపోతే తమకంటే బీజేపీకే  ఎక్కువ నష్టం జరుగుతుందన్నారు. మొత్తానికి ఈ సీనియర్ నేతల వ్యాఖ్యలు పార్టీలో పెద్ద దుమారాన్నే  రేపాయి.

మరిన్ని వార్తలు