లాటరీ పద్ధతిన మార్కెట్ చైర్మన్ల నియామకం!

20 Aug, 2015 03:33 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: లాటరీ పద్ధతిన వ్యవసాయ మార్కెట్ కమిటీలకు చైర్మన్లను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను అమలు చేసేందుకు ఈ విధానాన్ని ఎంచుకోవాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. మార్కెట్ కమిటీ పాలకమండళ్ల నియామకంలో రిజర్వేషన్లను పాటిస్తామని ఇటీవలే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు టీఆర్‌ఎస్ శాసనసభా పక్ష సమావేశంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీంతో చైర్మన్ల నియామకం  ఆ పార్టీ శ్రేణులను ఊరిస్తోంది. రిజర్వేషన్ల విధానమెలా ఉంటుంది..

ఎలా ఖరారు చేస్తారు.. ఏయే మార్కెట్ కమిటీలను ఎవరికి కేటాయిస్తారనేవి చర్చనీయాంశమయ్యాయి. రిజర్వేషన్ల అమలుపై మార్కెటింగ్ శాఖ  కసరత్తు చేసింది.  ఎస్సీ, ఎస్టీ, బీసీల వారీగా రైతుల వివరాలు  అందుబాటులో లేకపోవడంతో రిజర్వేషన్ల ఖరారు  కత్తి మీద సాములా అవుతుందని అధికారులు భావిస్తు న్నారు. రాష్ట్రంలో 183 నోటిఫైడ్ వ్యవసాయ మార్కెట్లున్నాయి. వీటిని విభజించి మరో 30 మార్కెట్ యార్డుల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

ప్రభుత్వం ఏర్పడ్డ కొత్తలోనే  ఎస్సీ, ఎస్టీలకు 22 శాతం రిజర్వేషన్లు, అదే తరహాలో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని సీఎం ప్రకటించారు. తాజా నిర్ణయాల ప్రకారం.. ఏజెన్సీల్లోని మార్కెట్ కమిటీలను గిరిజనులకు కేటాయిస్తారు. మిగిలిన వాటిని లాటరీపద్ధతిలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ చేస్తారు. ముందుగా అన్ని మార్కెట్ల పేర్లను చిట్టీలపై రాసి డబ్బాలో వేస్తారు. ఎస్టీ రిజర్వేషన్ల శాతం మేరకు అంత సంఖ్యలోనే డ్రా తీస్తారు. వాటిని ఆ కేటగిరీకి రిజర్వు చేస్తారు. అదే వరుసలో ఎస్సీలు, బీసీల శాతం ప్రకారం డ్రా తీస్తారు.  ఆ సామాజిక వర్గానికి చెందిన వారిని అక్కడి చైర్మన్‌గా నామినేట్ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

మరిన్ని వార్తలు