సినిమాను తలపించే 'తొలిప్రేమ' కథ

8 Jan, 2017 17:30 IST|Sakshi
సినిమాను తలపించే 'తొలిప్రేమ' కథ

ఇదో ఖండాంతర 'తొలిప్రేమ' కథ. ఆమె.. ఇరాక్‌ నుంచి శరణార్థిగా వలస వెళ్లిన ముస్లిం యువతి. అతను మెసిడోనియాకు చెందిన క్రిస్టియన్‌ పోలీస్‌ ఆఫీసర్‌. ఇద్దరూ తొలిచూపులోనే ప్రేమలో పడ్డారు. కొన్ని రోజుల తర్వాత పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం మెసిడోనియాలో ఇద్దరూ సంతోషంగా జీవిస్తున్నారు. ఈ ప్రేమకథ ఎలా మొదలైందంటే..

ఇరాక్‌లో ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులకు, ప్రభుత్వ బలగాలకు మధ్య జరుగుతున్న పోరాటంలో దియాల ప్రాంతంలో భీతావహ వాతావరణం ఏర్పడింది. అక్కడి కల్లోల పరిస్థితుల మధ్య జీవించలేక దియాలకు చెందిన 20 ఏళ్ల నూర అర్కవాజీ కుటుంబం దేశం విడిచి యూరప్‌కు వలస వెళ్లాలని నిర్ణయించుకుంది. గతేడాది మార్చిలో నూర, తల్లిదండ్రులు, సోదరుడు, సోదరి ఇతర శరణార్థులతో కలసి మెసిడోనియా సరిహద్దుకు చేరుకున్నారు. అక్కడ విధుల్లో ఉన్నవారిలో బాబి డొడెవ్స్కీ అనే అధికారికి మాత్రమే ఇంగ్లీష్‌ మాట్లాడటం తెలుసు. శరణార్థుల సమస్యల తెలుసుకుని వారికి సాయం చేస్తుంటాడు. ఆ రోజే నూర‌, బాబి మధ్య తొలిసారి చూపులు కలిశాయి. తొలిచూపులోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. పలు భాషలు మాట్లాడే నూర‌.. బాబితో మాట కలిపింది. కొన్ని రోజుల్లోనే ఇద్దరూ సన్నిహితమయ్యారు. కలసి జీవించాలని, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెద్దల ఆమోదంతో గతేడాది జూన్‌లో ఇద్దరూ ఒక్కటయ్యారు. నూర‌ ప్రస్తుతం బాబితో కలసి మెసిడోనియాలోని కమనోవోలో ఉంటోంది. కాగా ఆమె కుటుంబ సభ్యులు మాత్రం తమకు ఆశ్రయం ఇచ్చిన జర్మనీకి వెళ్లిపోయారు. 15 ఏళ్లుగా పోలీస్‌ అధికారిగా బాబి పనిచేస్తున్నాడు. అంతేగాక ప్రొఫెషనల్‌ డాన్సర్‌. అతని డాన్స్‌ ట్రూప్‌ ప్రపంచమంతా పర్యటిస్తుంటుంది.

మెసిడోనియాలో నివసించడానికి త్వరగా అలవాటుపడ్డానని నూర చెబుతోంది. ఈ దేశం, పట్టణం, ప్రజలు నన్ను శరణార్థిగా భావించరని, వారిలో ఒకరిలా కలసిపోయానని సంతోషం వ్యక్తం చేసింది. నూరను పెళ్లి చేసుకున్నందుకు చాలామంది ఆశ్చర్యపోయారని బాబి చెప్పాడు. గతంలో రెండుసార్లు వివాహం చేసుకోవడమే దీనికి కారణమని అన్నాడు. ఇద్దరూ ఒకరి పేర్లను మరొకరు టాటూలు వేయించుకున్నారు. వీరి బంధం జీవితాంతం కొనసాగాలిన కోరుకుందాం.
 

మరిన్ని వార్తలు